Lifestyle: బ్రషింగ్‌ విషయంలో మీక్కూడా ఈ అపోహలు ఉన్నాయా.?

|

Oct 21, 2024 | 1:07 PM

మన డెయిలీ లైఫ్ లో బ్రషింగ్ ఎంతో ముఖ్యమైందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే బ్రషింగ్ విషయంలో మనకు తెలిసో, తెలియకో కొన్ని తప్పులు చేస్తుంటాం. అదే విధంగా కొన్ని అపోహలు కూడా ఉంటాయి. ఇంతకీ బ్రషింగ్ విషయంలో ఉన్న అపోహలు ఏంటి.? అసలు నిజం ఏంటి? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Lifestyle: బ్రషింగ్‌ విషయంలో మీక్కూడా ఈ అపోహలు ఉన్నాయా.?
Brushing
Follow us on

ఉదయం లేవగానే ప్రతీ ఒక్కరూ చేసే పని బ్రషింగ్‌. మన రోజు మొదలయ్యేది బ్రషింగ్‌తోనే. అయితే ఇందుకు సంబంధించి మనలో కొన్ని రకాల అపోహలు ఉంటాయి. ఇంతకీ బ్రషింగ్‌ విషయంలో మనకు ఉండే అపోహలు ఏంటి.? వాటిలో నిజం ఎంత ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..

* బద్దకమో మరే కారణమో కానీ మనలో చాలా మంది రోజులో ఒకేసారి బ్రష్‌ చేసుకుంటారు. ఒక్కసారి ఒక్కసారి బ్రష్‌ చేసుకుంటే సరిపోతుందని నమ్ముతుంటారు. అయితే రోజుకు రెండుసార్లు బ్రష్ చేసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఉదయం బ్రష్‌ చేసుకోవడం ఎంత ముఖ్యమో, రాత్రి పడుకునే ముందు కూడా కచ్చితంగా బ్రష్‌ చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

* హార్డ్‌ బ్రిజల్స్‌ ఉన్న బ్రష్‌ను ఉపయోగిస్తే దంతాలు బాగా మెరుస్తాయని కొందరు భావిస్తుంటారు. అయితే ఇది ఏమాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. నిజానికి వీటివల్ల చిగుళ్లకు, దంతాలకు గాయమవుతాయి. అందుకే సాఫ్ట్ బ్రిజల్స్‌ ఉన్న బ్రష్‌ను ఉపయోగించడమే ఉత్తమం.

* కొందరు తిన్న వెంటనే బ్రష్‌ చేసుకోవడం కూడా మంచిది కాదు. భోజనం చేసిన 45 నిమిషాల నుంచి గంట తర్వాతే బ్రష్‌ చేసుకోవాలి. సాధారణంగా నోటిలోని లాలాజలం మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. అలాగే, నోటిలోని బ్యాక్టీరియా ఇతర సూక్ష్మక్రిముల నుంచి రక్షిస్తుంది. అలాంటిది ఆహారం తీసుకున్న తర్వాత పళ్లు తోమడం వల్ల ఈ ప్రభావం తగ్గిపోతుంది. ఇది జీర్ణ సంబంధిత సమస్యలకు దారి తీస్తుంది.

* ఇక మనలో చాలా మంది బ్రష్‌ను త్వరగా మార్చరు. ఏడాదిపాటు అలాగే ఉపయోగిస్తూనే ఉంటారు. అయితే కచ్చితంగా ప్రతీ 3 నెలలకు ఒకసారైనా బ్రష్‌ను మార్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నాయి. బ్రిజల్స్‌ వంగిపోయినట్లు కనిపించగానే బ్రష్‌ను మార్చేయాలని చెబుతున్నారు.

* మనలో కొందరు బ్రష్‌ నిండా పేస్ట్‌ను రుద్దేస్తుంటారు. అయితే దీనివల్ల పెద్దగా ఉపయోగం లేదని నిపుణులు అంటున్నారు. ఎక్కువ పేస్టు పెట్టుకుంటే ప్రత్యేకంగా లాభం ఏమి ఉండదు. పెద్దవాళ్లు బటానీ గింజ పరిణామంలో, చిన్న పిల్లలకు బియ్యపు గింజంత మాత్రమే పేస్టును ఉపయోగిస్తే సరిపోతుందని నిపుణులు అంటున్నారు.

నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..