
ప్రపంచంలోనే అగ్రగామి టెక్నాలజీ దిగ్గజం ఆల్ఫాబెట్ – గూగుల్ సీఈఓగా సుందర్ పిచాయ్ తీసుకునే ఒక్క నిర్ణయం ప్రపంచ టెక్ రంగాన్ని ప్రభావితం చేస్తుంది. వందల కోట్ల డాలర్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నడిపించే ఆయన వ్యక్తిగత జీవితం, దినచర్య ఎంత క్లిష్టంగా ఉంటుందోనని చాలామంది అనుకుంటారు. కానీ పిచాయ్ జీవనశైలి అత్యంత సాధారణంగా, క్రమశిక్షణతో కూడి ఉంటుంది. ముఖ్యంగా గత 15 సంవత్సరాలుగా ఆయన తన బ్రేక్‌ఫాస్ట్‌లో ఎలాంటి మార్పులూ లేకుండా దాదాపు ఒకే రకమైన ఆహారాన్ని తీసుకుంటుండటం విశేషం.
సుందర్ పిచాయ్ ప్రతిరోజూ ఉదయం ఆమ్లెట్ లేదా ఉడకబెట్టిన గుడ్లు, టోస్ట్ చేసిన బ్రెడ్ ముక్కలు, వేడి వేడి టీ మాత్రమే తీసుకుంటారు. ఒక అంతర్జాతీయ టెక్ దిగ్గజానికి అధిపతిగా ఉంటూ 15 ఏళ్ల పాటు ఇలా ఒకే ఆహారాన్ని కొనసాగించడం వెనుక బలమైన కారణం ఉంది. ఆధునిక మనస్తత్వశాస్త్రంలో దీనిని డెసిషన్ ఫెటీగ్ అంటారు. స్టీవ్ జాబ్స్ రోజూ ఒకే రకమైన నల్లటి టీషర్ట్ ధరించడం, మార్క్ జుకర్‌బర్గ్ ఒకే తరహా గ్రే టీషర్ట్‌లు వేసుకోవడం వెనుక ఉన్న ఉద్దేశం కూడా ఇదే. ఉదయాన్నే ‘‘ఏం తినాలి? ఏం వేసుకోవాలి?’’ వంటి చిన్న చిన్న విషయాల కోసం మెదడుపై ఒత్తిడి పెట్టకుండా కీలకమైన వ్యాపార, వ్యాపారేతర నిర్ణయాల కోసం తమ మానసిక శక్తిని ఆదా చేసుకోవడానికే పిచాయ్ ఈ అలవాటును కొనసాగిస్తున్నారు.
చాలామంది టెక్ దిగ్గజాలు ఉదయం 4 లేదా 5 గంటలకే మేల్కొంటారని చెబుతుంటారు. కానీ పిచాయ్ మాత్రం ఉదయం 6:45 నుంచి 7:30 గంటల మధ్య నిదానంగా నిద్రలేస్తారు. మేల్కొన్న వెంటనే ఫోన్లు, ఈమెయిళ్లు చూడకుండా తన ఉదయాన్ని ఎంతో ప్రశాంతంగా గడుపుతారు. ఉదయం వేడి టీ తాగుతూ భౌతిక రూపంలో ఉండే వార్తాపత్రికలను చదవడానికి ఆయన ప్రాధాన్యత ఇస్తారు. ముఖ్యంగా ది వాల్ స్ట్రీట్ జర్నల్, ది న్యూయార్క్ టైమ్స్ వంటి అంతర్జాతీయ దినపత్రికలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఆయన రోజువారీ ఆఫీస్ పనుల్లోకి దిగుతారు.
సాధారణంగా ఎక్కువమంది బిజినెస్ లీడర్లు నిద్రను త్యాగం చేస్తుంటారు. అయితే సుందర్ పిచాయ్ మాత్రం రాత్రిపూట కనీసం 6 నుంచి 7 గంటల నాణ్యమైన నిద్ర ఉండేలా చూసుకుంటారు. పగటిపూట తీవ్రమైన పని ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే తగినంత శారీరక విశ్రాంతి ఉండాల్సిందేనని ఆయన బలంగా నమ్ముతారు.
బిజీ షెడ్యూల్ వల్ల వారంలో సోమవారం నుంచి గురువారం వరకు సమయాన్ని బట్టి వ్యాయామం చేసినా, శుక్రవారం సాయంత్రం నుంచి వారాంతాల్లో మాత్రం ఫిట్‌నెస్‌కు ఎక్కువ సమయం కేటాయిస్తారు. జిమ్‌లోనే గడపడం కాకుండా ప్రకృతి నడుమ నడవడం, పర్వత ప్రాంతాల్లో హైకింగ్ చేయడం ఆయనకు ఎంతో ఇష్టం. మానసిక ఉల్లాసం, శారీరక దృఢత్వం కోసం సైక్లింగ్ చేస్తుంటారు. ఎంత ఎదిగినా సాదాసీదా జీవనం, అనవసర విషయాల్లో సమయం వృథా చేయకపోవడం, శారీరక-మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడమే సుందర్ పిచాయ్ అసాధారణ విజయానికి అసలైన పునాదులు.