AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మటన్ కర్రీ రుచిని తలపించే మీల్ మేకర్ మసాలా కర్రీ.. ఇంట్లోనే ఇలా ఈజీగా తయారు చేసుకోండి!

నాన్‌వెజ్ తినని వారికి ప్రోటీన్ కోసం మంచి ఆహారం ఏదైనా ఉందంటే.. అది మీల్‌ మేకర్.. వీటిలో మన ప్రోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే దీన్ని మసాలా కర్రీల చేసి అన్నం, చపాతీలోకి తింటే ఆ టేస్ట్‌ ఎప్పటికీ మర్చిపోలేరు. మరీ మటన్ కర్రీ రుచిని తలపించేలా, మీల్ మేకర్ మసాలా కర్రీని ఇంట్లోనే అద్భుతంగా ఎలా తయారు చేసుకోవచ్చో ఇక్కడ తెలుసుకుందాం.

మటన్ కర్రీ రుచిని తలపించే మీల్ మేకర్ మసాలా కర్రీ.. ఇంట్లోనే ఇలా ఈజీగా తయారు చేసుకోండి!
Meal Maker Masala Curry Recipe
Anand T
| Edited By: |

Updated on: Oct 22, 2026 | 9:31 AM

Share

మీకు రెగ్యులర్‌గా చేసుకునే మీల్‌ మేకర్ కర్రీ బోర్‌ కొట్టిందా.. దాన్ని కొత్తగా ట్రై చేయాలని ఉందా?.. అయితే ఒక్కసారి ఈ మసాలా మీల్‌ మేకర్ కర్రీ రెసిపీని ట్రై చేయండి.. మటన్‌ను కూడా మరిచిపోతారు. మొదటగా ఒక పెద్ద గిన్నె తీసుకుని అందులో ఒక కప్పు మీడియం సైజు మీల్ మేకర్‌ను వేయాలి.మరిగించిన వేడి నీటిని మీల్ మేకర్ మునిగే వరకు పోసి, ఒకసారి కలుపుకుని 15 నిమిషాల పాటు నాననివ్వాలి. 15 నిమిషాల తర్వాత మీల్ మేకర్ సైజు కొంచెం పెద్దగా మారి, మృదువుగా తయారవుతుంది. ఇప్పుడు అందులోని వేడి నీటిని పూర్తిగా తీసివేసి, చల్లని నీళ్లు పోయాలి.మీల్ మేకర్‌ను మరీ గట్టిగా కాకుండా, నెమ్మదిగా పిండి నీటిని తీసేయాలి. ఇలా చేయడం వల్ల మీల్ మేకర్ సాఫ్ట్‌గా మారి, కర్రీ రుచిని బాగా గ్రహిస్తుంది. అనంతరం వీటిని ఒక ప్లేట్‌లో పక్కన పెట్టుకోవాలి.

మసాలా పేస్ట్ తయారీ:

మిక్సీ జార్ తీసుకుని అందులో నాలుగు లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, ఒక స్పూన్ ఎండుకొబ్బరి ముక్కలు, ఆరు నుంచి ఏడు వెల్లుల్లి రెక్కలు, ఒక స్పూన్ తరిగిన అల్లం ముక్కలు, అర స్పూన్ గసగసాలు, అర స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ధనియాలు వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత రెండు మీడియం సైజు టమాటాలను ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్‌లో వేయాలి. టమాటా ముక్కలతో సహా అన్నింటినీ మెత్తగా పేస్ట్‌లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి.

మీల్ మేకర్ మసాలా కర్రీ వండే విధానం:

స్టవ్ పై పాన్ పెట్టుకుని, మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక రెండు పెద్ద ఉల్లిపాయల ముక్కలు, చిటికెడు ఉప్పు, చిటికెడు పసుపు వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఉల్లిపాయలు మంచి రంగులోకి మారిన తర్వాత సిద్ధం చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్‌ను వేయాలి. మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి, 5 నుంచి 7 నిమిషాల పాటు మధ్యమధ్యలో కలుపుతూ వేగనివ్వాలి.

మసాలా పచ్చి వాసన పోయి, నూనె పైకి తేలడం మొదలయ్యాక సరిపడా ఉప్పు, రెండు స్పూన్ల కారం వేసి ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్‌లో వేగించాలి.ఇప్పుడు పావు కప్పు పెరుగు వేసి, గ్యాస్ ఫ్లేమ్‌ను ఆఫ్ చేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. తిరిగి స్టవ్ ఆన్ చేసుకుని, 3 నుంచి 4 నిమిషాల పాటు మధ్యమధ్యలో కలుపుతూ ఉడకనివ్వాలి. ఈ దశలో మసాలా బాగా ఉడికి మంచి రంగు వస్తుంది.అనంతరం రెండు కప్పుల నీళ్లు పోసి బాగా కలిపి, హై ఫ్లేమ్‌లో కర్రీని ఉడకనివ్వాలి. కర్రీ ఉడకడం ప్రారంభమయ్యాక నానబెట్టి పిండిన మీల్ మేకర్‌ను వేసి బాగా కలుపుకోవాలి.

తర్వాత మూత పెట్టి, మీడియం ఫ్లేమ్‌లో మధ్యమధ్యలో కలుపుతూ కర్రీ దగ్గరపడేంత వరకు ఉడికించాలి. సుమారు 10 నుంచి 15 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే నూనె పైకి తేలి, కర్రీ చిక్కబడి ఉంటుంది. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసి బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేయాలి. ఎంతో రుచికరమైన, మటన్‌కు ఏమాత్రం తగ్గని మీల్ మేకర్ మసాలా కర్రీ సిద్ధమవుతుంది. ఈ గ్రేవీ కర్రీని అన్నం, చపాతీ, రోటి, పూరి, పుల్కా, పులావ్, బగార రైస్‌తో తింటే రుచి అద్భుతంగా ఉంటుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us