
దీపావళి పండుగ అనగానే దీపాలు, పటాకులు, స్వీట్లతో పాటు లక్ష్మీ పూజలో ఉపయోగించే వరి పేలాలు ప్రత్యేకంగా నిలుస్తాయి. పూజ అయిన తర్వాత చాలా ఇళ్లలో ఈ మరమరాలు మిగిలిపోతుంటాయి.. ఏం చేయాలో తెలియక చాలామంది వాటిని పక్కన పడేస్తుంటారు. అయితే, ఈ బద్ధకాన్ని వదిలేసి ఆ మిగిలిన వాటితో ఎంతో రుచికరమైన, నోట్లో వెన్నలా కరిగిపోయే మరమరాల బర్ఫీని తయారు చేసుకోవచ్చు. ప్రత్యేకత ఏమిటంటే, దీనికి గ్యాస్ స్టవ్ వెలిగించాల్సిన అవసరం కూడా లేదు. కేవలం రెండు నిమిషాలలో ఎటువంటి ఖోవా, పాకం లేకుండా దీన్ని సులభంగా తయారు చేయవచ్చు.
మిగిలిపోయిన వరి పేలాలు – 2 కప్పులు
పంచదార – అర కప్పు
యాలకులు – 2 లేదా 3
మిల్క్ పౌడర్ – అర కప్పు
ఎండు కొబ్బరి పొడి – పావు కప్పు
తాజా మీగడ – 3 నుండి 4 టేబుల్ స్పూన్లు
మొదటగా మిక్సీ జార్‌లో అర కప్పు పంచదార, 2-3 యాలకులు వేసి మెత్తటి పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత అదే జార్‌లో రెండు కప్పుల మరమరాలు వేసి మెత్తగా పౌడర్ చేసి జల్లెడ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకుని అందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న పంచదార పొడి, మరమరాల పౌడర్, మిల్క్ పౌడర్, కొబ్బరి పొడి వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ పొడి మిశ్రమంలో కొద్ది కొద్దిగా తాజా మీగడను కలుపుతూ చపాతీ పిండిలా లేదా సాఫ్ట్ ముద్దలా కలుపుకోవాలి. మిశ్రమం మరీ గట్టిగా లేదా మరీ పల్చగా కాకుండా చూసుకోవాలి.
తయారైన ఈ మిశ్రమాన్ని ఒక కేక్ టిన్ లేదా ట్రేలో వేసి సమానంగా ఒత్తుకోవాలి. పైన కొద్దిగా సన్నగా తరిగిన పిస్తా లేదా బాదం ముక్కలు చల్లుకోవాలి. ఆ తర్వాత దీన్ని 5 నుండి 10 నిమిషాల పాటు ఫ్రిజ్‌లో సెట్ అవ్వడానికి ఉంచాలి. సరిగ్గా గడ్డకట్టిన తర్వాత మీకు నచ్చిన ఆకారంలో లేదంటే డైమండ్ షేప్ కట్ చేసుకుంటే సరిపోతుంది.
ఈ స్వీట్ చూడటానికి మార్కెట్లో కొనే ఖరీదైన బర్ఫీలా కనిపిస్తుంది. తింటుంటే అచ్చం మిల్క్ కేక్, కలాకండ్ స్వీట్ కలగలిపిన అద్భుతమైన రుచిని అందిస్తుంది. పండుగ పూట మిగిలిపోయిన వస్తువులతో ఇలాంటి సరికొత్త రెసిపీ ట్రై చేయడం ద్వారా మీ ఇంటి సభ్యులందరి ప్రశంసలు అందుకోవచ్చు. ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి!