ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా బ్రెయిన్ స్ట్రోక్‌కు సంబంధించిన కేసులు భారీగా పెరుగుతున్నాయి. మారిన జీవన విధానం, ఒత్తిడితో కూడుకున్న లైఫ్ ఇలా బ్రెయిన్ స్ట్రోక్‌కు ఎన్నో కారణాలు ఉన్నాయి. ఒకప్పుడు వయసుమళ్లిన వారిలో మాత్రమే కనిపించిన ఈ వ్యాధి ఇటీవల తక్కువ వయసులో వారిలో కూడా రావడం ఆందోళన కలిగిస్తోంది. బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా పక్షవాతం మొదలు మనిషి ప్రాణాలే పోయే ప్రమాదం ఉంది.
అయితే సాధారణంగా బ్రెయిన్ స్ట్రోక్ అనగానే అనారోగ్యకరమైన జీవనశైలి, మద్యం, స్మోకింగ్ వంటి కారణాల వల్ల స్ట్రోక్ వస్తుందని చాలా మంది భావిస్తుంటారు. అయితే బ్రెయిన్ స్ట్రోక్‌కు మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. తాజాగా నిర్వహించిన అధ్యయనంలో పలు షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. జీవనశైలితో పాటు గాలి కాలుష్యం, అధిక ఉష్ణోగ్రతలు సైతం బ్రెయిన్ స్ట్రోక్‌కు కారణాలవుతాయని పరిశోధనల్లో వెల్లడైంది. ‘లాన్సెట్ న్యూరాలజీ జర్నల్’లో ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలను ప్రచురించారు.
బ్రెయిన్ స్ట్రోక్‌ను పెంచడానికి కారణమయ్యే అధిక బరువు, రక్తపోటు, శారీరక శ్రమలేకపోవటం వంటివి పెరగడానికి గాలి కాలుష్యం, అధిక ఉష్ణోగ్రతలు ముఖ్య కారణంగా నిలుస్తున్నాయని పరిశోధనల్లో తేలింది. 1990 తర్వాత నమోదైన బ్రెయిన్ స్ట్రోక్ మరణాలు 72 శాతం పెరగడానికి అధిక ఉష్ణోగ్రతలూ ఒక కారణమని నివేదికలో వెల్లడైంది. భవిష్యత్తులో ఈ సమస్య మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
బ్రెయిన్ స్ట్రోక్‌కు గాలి కాలుష్యానికి మధ్య సంబంధం ఉన్నట్లు తొలిసారి బయటపడింది. 1990లో 73 లక్షల మందికి తొలిసారి బ్రెయిన్ స్ట్రోక్ రాగా, వీరి సంఖ్య 2021నాటికి 1.19 కోట్లకు చేరుకుంది. బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడకుండా ఉండాలంటే.. గాలి కాలుష్యం లేని చోట ఉండడం, స్మోకింగ్‌ను పూర్తిగా మానేయాలని నిపుణులు చెబుతున్నారు. వీటితో పాటు శారీరక వ్యాయామం కూడా ముఖ్యమేనని సూచిస్తున్నారు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..