
పుట్టగొడుగులు త్వరగా పాడైపోయే, బూజు పట్టే గుణాన్ని కలిగి ఉంటాయి. వీటిని సరిగ్గా నిల్వ చేయకపోతే త్వరగా నల్లబడి, మెత్తగా మారిపోతాయి. మష్రూమ్స్‌ను ఎక్కువ రోజులు తాజాగా ఉంచడానికి వాటిని ఎప్పుడూ ప్లాస్టిక్ కవర్లలో ఉంచకూడదు.. దీనికి బదులుగా వాటిని ఎలా స్టోర్ చేయాలి..ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం..
మార్కెట్ నుండి తెచ్చిన ప్లాస్టిక్ కవర్లలోనే మష్రూమ్స్‌ను ఫ్రిజ్‌లో పెట్టడం పెద్ద పొరపాటు. ప్లాస్టిక్ వల్ల లోపల తేమ పెరిగి బూజు పడుతుంది. అందుకే మష్రూమ్స్‌ను ప్లాస్టిక్ కవర్ నుండి తీసి ఒక పేపర్ బ్యాగ్ లో ఉంచి ఫ్రిజ్‌లో పెట్టాలి. కాగితం అదనపు తేమను పీల్చుకుని, గాలి ఆడేలా చూస్తుంది.
వండే ముందు మాత్రమే కడగాలి: చాలామంది మష్రూమ్స్ తెచ్చిన వెంటనే కడిగి ఫ్రిజ్‌లో పెడుతుంటారు. మష్రూమ్స్ స్పాంజిలాగా నీటిని పీల్చుకుంటాయి, దీనివల్ల అవి త్వరగా కుళ్ళిపోతాయి. కాబట్టి వీటిని నిల్వ చేసే ముందు కడగకూడదు. వండే కొద్ది నిమిషాల ముందు మాత్రమే శుభ్రం చేసుకోవాలి.
టిష్యూ పేపర్, ఎయిర్ టైట్ కంటైనర్: ఒక ప్లాస్టిక్ లేదా గ్లాస్ కంటైనర్ తీసుకొని, దాని అడుగున టిష్యూ పేపర్ పరచాలి. దానిపై మష్రూమ్స్ ఉంచి, పైన మరొక టిష్యూ పేపర్ కప్పి మూత పెట్టాలి. ఈ టిష్యూ పేపర్లు తేమను పీల్చుకుని మష్రూమ్స్ పాడవకుండా కాపాడతాయి.
ఫ్రీజర్‌లో నిల్వ చేసే పద్ధతి: మష్రూమ్స్‌ను వారం కంటే ఎక్కువ రోజులు ఉంచాలనుకుంటే, వాటిని చిన్న ముక్కలుగా కోసి, కొద్దిగా నూనెలో 2-3 నిమిషాలు వేయించి చల్లారబెట్టాలి. ఆ తర్వాత జిప్‌లాక్ బ్యాగ్‌లో ఉంచి ఫ్రీజర్‌లో పెడితే నెల రోజుల వరకు పాడుకాకుండా ఉంటాయి.
ఈ చిన్న చిన్న చిట్కాలను పాటించడం ద్వారా మష్రూమ్స్ బూజు పట్టకుండా, వాటి రుచి మరియు పోషకాలు దెబ్బతినకుండా ఎక్కువ రోజులు ఉపయోగించుకోవచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..