
క్యాప్సికమ్ లేదా దొబ్బ మిరపకాయలు వివిధ రంగుల్లో లభిస్తాయి. అయితే ఆకుపచ్చ, ఎరుపు రంగుల మధ్య పోషకపరంగా గణనీయమైన తేడాలు ఉన్నాయి.
పచ్చ క్యాప్సికమ్ (Green Capsicum):
ఇవి పూర్తిగా పండకముందే కోతకు వస్తాయి. అందుకే వీటిలో క్లోరోఫిల్ శాతం ఎక్కువగా ఉండి ఆకుపచ్చగా కనిపిస్తాయి. రుచిలో కొంచెం చేదుగా, పచ్చిగా ఉంటుంది. కానీ, ఇందులో విటమిన్-కె, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. క్యాలరీలు చాలా తక్కువగా ఉండటం వల్ల డైటింగ్‌లో ఉండేవారికి ఇది ఉత్తమమైనది. ఇవి త్వరగా పండుతాయి. కాబట్టి మార్కెట్లో చౌకగా లభిస్తాయి.
ఎర్ర క్యాప్సికమ్ (Red Capsicum):
ఆకుపచ్చ క్యాప్సికమ్ పూర్తిగా పండిన తర్వాత ఎరుపు రంగులోకి మారుతుంది. ఈ క్రమంలో దానిలోని పోషకాలు రెట్టింపు అవుతాయి. రుచి పరంగా చూస్తే ఇది తియ్యగా, జ్యూసీగా ఉంటుంది. సలాడ్లలో దీనిని ఎక్కువగా వాడుతుంటారు. ఎర్ర క్యాప్సికమ్‌లో విటమిన్-సి, విటమిన్-ఎ అత్యధికంగా ఉంటాయి. ముఖ్యంగా బీటా-కెరోటిన్, లైకోపీన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో ఎక్కువగా ఉండటం వల్ల ఇది క్యాన్సర్ కారకాలతో పోరాడుతుంది. ఇది చర్మ సౌందర్యానికి, కంటి చూపు మెరుగుపడటానికి, గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
ఏది ఎంచుకోవాలి?:
మీరు విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్ల కోసం చూస్తున్నట్లయితే ఎర్ర క్యాప్సికమ్ ఉత్తమమైనది. కానీ, బరువు తగ్గడానికి, రోజువారీ వంటకాల్లో వాడటానికి పచ్చ క్యాప్సికమ్ సరిపోతుంది. ఆరోగ్య నిపుణుల ప్రకారం, ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి రకరకాల పోషకాలు అందుతాయి. రంగు ఏదైనా క్యాప్సికమ్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మీ అవసరానికి, బడ్జెట్‌కు తగినట్లుగా వీటిని ఎంచుకుని ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..