Lifestyle: చలికాలంలో జలుబు రావొద్దంటే ఏం చేయాలి.? సింపుల్‌ చిట్కాలే..

|

Oct 23, 2024 | 8:29 AM

చలికాలం రాగానే రకరకాల వ్యాధులు దాడులు చేయడానికి సిద్దమవుతుంటాయి. ముఖ్యంగా జలుబు, దగ్గు వంటి సమస్యలు ఎక్కువుతాయి. అయితే కొన్ని రకాల చిట్కాలను పాటించడం ద్వారా ఈ సమస్యల బారిన పడకుండా ఉండొచ్చు. అలాంటి కొన్ని నేచురల్ చిట్కాలు ఇప్పుడు తెలుసుకుందాం...

Lifestyle: చలికాలంలో జలుబు రావొద్దంటే ఏం చేయాలి.? సింపుల్‌ చిట్కాలే..
Health
Follow us on

చలికాలం ప్రారంభమవుతోంది. ఇప్పుడిప్పుడే చలి మొదలవుతోంది. ఇక వాతావరణం మారిన ప్రతీసారి ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని తెలిసిందే. ముఖ్యంగా చలికాలం వచ్చిందంటే చాలు జలుబు, దగ్గు వంటి సమస్యలు వస్తాయి. అయితే ఈ సమస్య బారిన పడకుండా ఉండాలంటే చలి కాలం ప్రారంభంకాగానే కొన్ని రకాల చిట్కాలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. ఈ నేచురల్ చిట్కాల ద్వారా జలుబు బారిన పడకుండా ఉండొచ్చు. అదే విధంగా జలుబుతో బాధపడుతున్నవారికి ఉపశమనం లభిస్తుంది. ఇంతకీ ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* జలుబు నుంచి ఉపశమనం తగ్గించడంలో పసుపు కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు అంటున్నారు. పాలలో పసుపును కలిపి తీసుకోవడం వల్ల జలుబు తగ్గుతుంది. మరీ ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు తీసుకుంటే మంచి నిద్ర సొంతమవుతుంది.

* బార్లీ గింజలు తీసుకోవడం వల్ల కూడా జలుబు సమస్య దూరమవుతుంది. బార్లీ గింజలను నీళ్లలో వేసుకొని వేడి చేసుకోవాలి. అనంతరం ఆ నీటిలో నిమ్మరసం వేసుకొని తాగితే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో సీజనల్ వ్యాధులు తగ్గుతాయి.

* చలికాలంలో అల్లం టీని తీసుకోవడాన్ని అలవాటు చేసుకోవాలి. ఇది మంచి యాంటీ బ్యాక్టీరియల్‌గా ఉపయోగపడుతుంది. దీంతో జలుబు వచ్చే సమస్య తగ్గుతుంది. అదే విధంగా శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

* తులసి ఆకులతో చేసిన టీని తీసుకోవడం వల్ల కూడా జలుబు సంబంధిత సమస్యలు దూరమవుతాయని నిపుణులు అటంఉన్నారు. తులసి టీని క్రమంతప్పకుండా తీసుకోవడం వల్ల జలుబు తగ్గిపోతుంది. రాకుండా కూడా అడ్డుకుంటుంది.

* జలుబు, దగ్గు కంట్రోల్‌ చేయడంలో వాము ఎంతో ఉపయోగపడుతుంది. వామును వేడి నీటిలో వేసుకొని మరిగించి తీసుకోవాలి. వీటివల్ల జలుబు సమస్యలు దరిచేరకుండా ఉంటుంది.

* చలికాలంలో గోరు వెచ్చని నీటిని తాగాలని నిపుణులు చెబుతున్నారు. వేడి నీటిని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల జలుబు వంటి సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. అదే విధంగా వేడి నీళ్లలో నిమ్మకాయ, తేనె కలుపుకొని తీసుకోవడం వల్ల మరింత మెరుగైన ఫలితం పొందొచ్చు.

* చలికాలంలో క్రమంతప్పకుండా ఆవిరిపట్టుకోవడం అలవాటుగా మార్చుకోవాలి. ఇలా రెగ్యులర్‌గా ఆవిరిపట్టుకుంటుంటే జలుబు మొదలు శ్వాస సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. మరీ ముఖ్యంగా నీటిలో పసుపు వేసుకొని ఆవిరి పట్టుకుంటే మరింత మేలు జరుగుతుంది. ఇక జలుబుతో బాధపడేవారికి వెంటనే ఉపశమనం లభిస్తుంది.

నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..