
కాకి కేవలం ఒక పక్షి మాత్రమే కాదు. ఇది పక్షి ప్రపంచంలోనే అత్యంత తెలివైన జీవి కూడా. అవును.. ‘బ్రిటానికా’ పక్షి శాస్త్రవేత్తల అధ్యయనం ప్రకారం కాకి ఆయుర్దాయం అది నివసించే ప్రదేశంపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. అడవిలో లేదా నగరంలో స్వేచ్ఛగా జీవించే కాకులు సాధారణంగా 10 నుంచి 15 సంవత్సరాలు జీవిస్తాయి. ఈ వాతావరణంలో అవి ఆహారాన్ని వెతుక్కోవాలి, వాతావరణం, వేటాడే జంతువుల నుండి తమను తాము రక్షించుకోవాలి. జంతుప్రదర్శనశాలలో లేదా నిపుణుల సంరక్షణలో పెరిగే కాకి 20 నుంచి 30 సంవత్సరాల వరకు సులభంగా జీవించగలదు. కొన్ని అరుదైన కాకులు 40 సంవత్సరాల వరకు కూడా జీవిస్తాయి. సాధారణంగా కాకులు 10 నుండి 12 సంవత్సరాల వయస్సుకి చేరుకున్న తర్వాత వృద్ధాప్య లక్షణాలు ప్రారంభం అవుతాయి.
కాకికి వయసు పెరిగే కొద్దీ దాని గెంతు వేగం తగ్గుతుంది. దాని ఎగిరే వేగం కూడా ప్రభావితమవుతుంది. అది మునుపటిలా చురుకుగా ఉండదు. కాకికి ప్రత్యేకమైన ముదురు నల్లని, మెరిసే ఈకలు వయసుతో పాటు కాంతిహీనంగా మారడం ప్రారంభిస్తాయి. ఆ ఈకలు బలహీనపడి, రాలిపోతాయి లేదా చెల్లాచెదురవుతాయి. దీనివల్ల అవి చలి నుంచి తమను తాము రక్షించుకోవడం కష్టమవుతుంది. కాకులకు వయసు పెరిగే కొద్దీ, వాటి కంటిచూపు క్షీణిస్తుంది. ఫలితంగా వయసు పైబడిన కాకులు ఆహారాన్ని కనుక్కోవడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి. అవి తరచుగా ఇతరులు కనుగొన్న ఆహారంపై లేదా మానవ నివాసాల్లో దొరికే ఆహారాలపై ఎక్కువగా ఆధారపడతాయి.
కాకులు సామాజిక పక్షులు. వృద్ధాప్యంలో అవి రక్షణ పొందడం కోసం గుంపులుగా జీవించడానికి ఇష్టపడతాయి. అయితే చిన్న కాకులతో పోలిస్తే వాటి చురుకుదనం తక్కువగా ఉంటుంది. కానీ వాటి శారీరక బలం తగ్గినప్పటికీ, వృద్ధాప్యంలో కాకుల తెలివితేటలు తగ్గవు. దానికి విరుద్ధంగా అనుభవంతో అవి మరింత జాగ్రత్తగా, తెలివిగా తయారవుతాయి. వయసు పైబడిన కాకులు శత్రువులను గుర్తించడంలో, తమ సమూహాన్ని ప్రమాదం గురించి హెచ్చరించడంలో మరింత నేర్పరిగా ఉంటాయి.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.