బీహార్‌లో పెరుగుతోన్న ఎన్నికల వేడి , ఒంటరిగానే బరిలో దిగాలనుకుంటున్న ఆర్‌జేడీ

|

Sep 12, 2020 | 2:55 PM

బీహార్ అసెంబ్లీకి ఈ ఏడాది చివ‌ర్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఏ క్షణంలోనైనా ఎన్నికల తేదీల ప్రకటన రావచ్చు.. ఈ క్రమంలో ప్రధానపార్టీన్నీ ఎన్నికలపై దృష్టి పెట్టాయి.. భావ సారూప్యత కలిగిన పార్టీలు పొత్తుల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాయి..

బీహార్‌లో పెరుగుతోన్న ఎన్నికల వేడి , ఒంటరిగానే బరిలో దిగాలనుకుంటున్న ఆర్‌జేడీ
Follow us on

బీహార్ అసెంబ్లీకి ఈ ఏడాది చివ‌ర్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఏ క్షణంలోనైనా ఎన్నికల తేదీల ప్రకటన రావచ్చు.. ఈ క్రమంలో ప్రధానపార్టీన్నీ ఎన్నికలపై దృష్టి పెట్టాయి.. భావ సారూప్యత కలిగిన పార్టీలు పొత్తుల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాయి.. కూటమి కట్టేందుకు ఉత్సాహపడుతున్నాయి. అధికారంలో ఉన్న ఎన్‌డీఏ కూటమి ఎన్నికలకు సర్వసన్నద్ధమయ్యింది.. సీట్ల ఖరారు విషయాన్ని తేల్చేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్‌ నడ్డా పాట్నాకు వచ్చారు.. ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ ఇంట్లో సమావేశం కూడా అయ్యారు.. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేంద్రయాదవ్‌లు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.. ముఖ్యంగా సీట్ల పంపిణీపైనే చర్చ జరిగిందని తెలుస్తోంది.. జనతాదళ్‌ యునైటెడ్‌, బీజేపీ, లోక్‌ జనశక్తి పార్టీ కూటమిగా ఏర్పడి ఎన్నికలలో పోటీ చేస్తున్నాయి.. మరోవైపు బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి, హిందూస్థానీ అవామ్‌ మోర్చా పార్టీ అధినేత జితన్‌రామ్‌ మాంఝీ కూడా ఎన్‌డీఏ వైపుకు వచ్చేశారు.. రేపోమాపో మాంఝీకి ఇచ్చే సీట్ల విషయమూ తేలిపోతుంది.. అధికారపక్షం సంగతి సరేకానీ, ప్రతిపక్షాలే ఇంకా మీనమేషాలు లెక్కిస్తూ కూర్చున్నాయి.. ఎన్‌డీఏ కూటమిని ఢీ కొట్టాలంటే మహాగడ్బంధన్‌ అవసరమని బయటకు విపక్షాలన్నీ చెబుతున్నా లోపల మాత్రం వ్యక్తిగత అభిలాషలు వేరేగా ఉన్నాయి.. 2015లో జరిగిన ఎన్నికల్లో లాలూ ప్రసాద్‌ యాదవ్‌ నేతృత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్‌ అత్యధిక సీట్లను గెల్చుకుంది కానీ మహాఘట్‌బంధన్‌లో ఒప్పందం మేరకు ముఖ్యమంత్రి పదవి నితీశ్‌కుమార్‌కు అప్పగించింది.. ఆర్‌జేడీ నుంచి తేజస్వీయాదవ్‌ డిప్యూటీ సీఎం అయ్యారు.. అయితే తదనంతర కాలంలో లాలూ ప్రసాద్‌ యాదవ్‌పై సీబీఐ దాడులు జరగడం, నితీశ్‌కుమార్‌కు ఆర్‌జేడీతో పొసగకపోవడంతో రాజకీయాలు పూర్తిగా మారాయి.. నితీశ్‌ మహాఘట్‌బంధన్‌ నుంచి బయటకు వచ్చి బీజేపీ మద్దతుతో మ్యాజిక్‌ ఫిగర్‌ను ఏర్పాటు చేసుకుని మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు.. బీజేపీకి చెందిన సుశీల్‌కుమార్ మోదీ ఈసారి డిప్యూటీ సీఎం అయ్యారు.. అయితే 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎన్‌డీఏ కూటమి కేవలం 17 సీట్లను మాత్రమే సాధించింది.. ఇక అప్పటి నుంచి ఆర్‌జేడీకి కొత్త ఉత్సాహం వచ్చింది.. ఇప్పుడు జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం మళ్లీ మహాఘట్‌బంధన్‌ను ఏర్పాటు చేయాలనుకుంటున్నాయి విపక్షాలు.. బీజేపీ భాగస్వామిగా ఉన్న ఎన్‌డీఏ దెబ్బ తీయాలంటే కలిసికట్టుగా పోటీ చేయడమే ఉత్తమమని విపక్షాలు భావిస్తున్నాయి. మహాఘట్‌బంధన్‌లో భాగస్వామి కావాలనుకుంటున్న పార్టీలలో కాంగ్రెస్‌ పార్టీనే పెద్దది.. ఉపేంద్ర కుశ్వాహా నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్‌సమతా పార్టీకి కానీ , వామపక్షాలకు కానీ ఎక్కువ సీట్లను డిమాండ్‌ చేసే స్కోప్‌ లేదు.. 243 స్థానాలున్న బీహార్‌ అసెంబ్లీలో ఆర్‌జేడీకి 82 సీట్లు ఉన్నాయి.. కాంగ్రెస్‌కు 27 సీట్లు, ఆర్‌ఎల్‌ఎస్‌పీకి రెండు సీట్లు, సీపీఎంకు మూడు సీట్లు ఉన్నాయి. పప్పు యాదవ్‌ అధ్యక్షుడిగా ఉన్న జనత్‌ అధికార్‌ పార్టీకి అయితే ఒక్క సీటు కూడా లేదు.. ఇక ఎన్‌డీఏ విషయానికి వస్తే నితీశ్‌కుమార్‌ సారథ్యంలోని జేడీయూకు 73 సీట్లు, బీజేపీకి 53 సీట్లు, రామ్‌విలాస్‌పాశ్వాన్‌ లోక్‌ జనశక్తి పార్టీకి రెండు సీట్లు, జితన్‌ రామ్‌ మాంఝీకి ఒక సీటు ఉన్నాయి.
తమ ఓటు బ్యాంకును, ప్రజలలలో తమకున్న ఆదరణను సరిగ్గా అంచనా వేయని పార్టీలు గొంతెమ్మ కోరికలు కోరుతున్నాయి.. వామపక్షాలు తమకు 45 స్థానాలు ఇవ్వాల్సిందేనని మంకుపట్టుపడుతున్నాయి.. సీపీఐ ఎమ్‌ఎల్‌ కూడా 50 సీట్లు అడుగుతోంది.. ముఖేశ్‌ సాహ్ని నడుపుతున్న వికాస్‌శీల్‌ ఇన్సాన్‌ పార్టీ కూడా పాతిక సీట్లను కోరడం విశేషం.. అలాగే ఆర్‌ఎల్‌ఎస్‌పీ తమకు 49 సీట్లు ఇవ్వాల్సిందేనని అంటోంది.. 2015లో 43 స్థానాల నుంచి పోటీ చేసిన కాంగ్రెస్‌ ఇప్పుడు అంతకు రెట్టింపు డిమాండ్‌ చేస్తోంది.. అప్పుడైతే జేడీయూ కోసం త్యాగం చేశామని, ఇప్పుడా అవసరం లేదు కదా అని వాదిస్తోంది కాంగ్రెస్‌.. పోయినసారి ఎన్నికల్లో వంద సీట్ల నుంచి పోటీ చేసిన ఆర్‌జేడీ అందులో 82 స్థానాలను గెల్చుకుంది. అలాంటప్పుడు సహజంగానే ఈసారి ఘట్‌బంధన్‌లో ఎక్కువ సీట్లను డిమాండ్‌ చేసే అవకాశం ఉంటుందా పార్టీకి! ఆర్‌జేడీ డిమాండ్‌లో న్యాయం కూడా ఉంది.
విపక్షాల ఆలోచన అలా లేదు.. వారు ఇస్తున్న బీజేపీ హఠావో అన్న నినాదం బాగానే ఉంది కానీ అందుకు తగిన వ్యూహాలను పన్నలేకపోతున్నాయి. ఆర్‌జేడీకి 140 సీట్లను వదిలేసి మిగతా వంద సీట్లలో మిగతా పార్టీలన్నీ పోటీ చేయడం ధర్మం.. కానీ ఆర్‌జేడీయేతర పక్షాలు మాత్రం అలా అనుకోవడం లేదు.. లాలూ కుటుంబంపై ప్రజలలో తీవ్ర ఆగ్రహం ఉందని, తేజస్వీ యాదవ్‌ వ్యవహారశైలి ప్రజలకు నచ్చడం లేదని, కాబట్టి వంద సీట్లు ఆర్‌జేడీ ఉంచేసుకుని మిగతావి తమకు వదిలేయాలని అంటున్నాయి.. ఒకవేళ ఆర్‌జేడీ 140 స్థానాలకు పోటీ చేస్తే క్రితంసారిలా 80 నుంచి వంద సీట్లు గెల్చుకునే అవకాశం ఉంటుంది. ఎన్‌డీఏ ప్రధాన లక్ష్యమేమిటంటే ఆర్‌జేడీకి అత్యధిక సీట్లు రాకుండా అడ్డుకోవడం.. అలా జరిగితే భవిష్యత్తులో ఆర్‌ఎల్‌ఎస్‌పీ, వీఐపీ వంటి పార్టీలను చాలా ఈజీగా బ్రేక్‌ చేయవచ్చన్నది బీజేపీ ఆలోచన. ఆపరేషన్‌ కమల్‌ పేరిట మధ్యప్రదేశ్‌లో చేసింది ఇదేగా! ఇది ఎన్‌డీఏ ప్లాన్‌ ఏ! ప్లాన్‌ బీ కూడా ఉంది.. మహాఘట్‌బంధన్‌ విజయం సాధించినా ఆర్‌జేడీ అధికారంలోకి రావాలంటే కాంగ్రెస్‌ మద్దతు కావాలి.. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను భయపెట్టో బతిమాలో ఆ పని చేయకుండా అడ్డుకుంటే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా బీజేపీ చేస్తోంది.. వివిధ రాష్ట్రాలలో బీజేపీ ఇలాంటి వ్యూహాన్నే అమలు చేస్తున్నది..
వామపక్షాలు పూర్తిగా జవహర్‌లాల్ నెహ్రు యూనివర్శిటీ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్హయ్య కుమార్‌పైనే ఆధారపడ్డాయి. రాష్ట్రంలో ప్రధాన శక్తిగా కన్హయ్య కుమార్‌ అవతరించే అవకాశముందన్నది వామపక్షాల అభిప్రాయం. ఇక యశ్వంత్‌ సిన్హా ప్రభావం కూడా రాబోయే ఎన్నికల్లో అంతో ఇంతో కచ్చితంగా ఉంటుంది.. ఓ 16 చిన్నా చితక పార్టీలతో యునైటెడ్‌ డెమొక్రాటిక్‌ అలయెన్స్‌ను ఏర్పాటు చేసుకుని 243 స్థానాల నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు.. మరి ఎవరి ఓట్లను యుడీఏ చీలుస్తుందో చూడాలి.. ఈ సీట్ల పంపిణీ గొడవలు, పొత్తుల చికాకులు ఎందుకన్న ఉద్దేశంతో ఉన్న ఆర్‌జేడీ చివరి నిమిషంలో ఒంటరిగానే అన్ని స్థానాల నుంచి బరిలో దిగినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.. ఎందుకంటే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు కాబట్టి!