మనషుల్లో మానవత్వం మంటగలుస్తోంది. అస్తికోసం కన్నకొడుకు అన్న కనికరం లేకుండా హతమార్చాడు ఓ కసాయి తండ్రి. ఈ ఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది. బంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా మారుతున్నాయి, ఆస్తి తగాదాలు, ఆర్థిక కారణాలతో కడుపులో పుట్టినవారినే కాదనుకుంటున్నారు. చినముషిడివాడ సత్యానగర్‌కాలనీ సమీపంలోని బంగారమ్మకాలనీకి చెందిన గొరిపాటి వీర్రాజు(72) మర్చంట్ నేవీలో పనిచేసి రిటైర్డ్ అయ్యారు. ప్రస్తుతం ఇంట్లోనే ఉంటున్నారు. అతనికి కుమారుడు జలరాజు(41), ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కుమార్తెలకు వివాహం అయింది. కుమారుడితో కలిసి బంగారమ్మకాలనీలో నివాసం ఉంటున్నారు. జలరాజు కూడా మర్చంట్ నేవీలో విధులు నిర్వహిస్తున్నాడు. అతనికి భార్య ఈశ్వరి, ఇద్దరు కుమారులు ఉన్నారు.
ఇదిలావుంటే, తండ్రీ కొడుకుల మధ్య కొద్దిరోజులుగా ఆస్తి పంపకం విషయంలో తరుచు తగాదాలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో బుధవారం మరోసారి ఘర్షణకు కారణమైంది. దీంతో జలరాజు సెల్లార్‌లో ఉండగా, తండ్రి వీర్రాజు సుత్తితో దాడి చేశాడు. జలరాజు తలపై నాలుగుసార్లు బలంగా మోదడంతో రక్తపు మడుగులో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. దీంతో జలరాజును కుటుంబసభ్యలు పెందుర్తి ఆసుపత్రికి తరలించేలోగా జలరాజు మృతి చెందాడు. ఈ హఠాత్తు పరిణామంతో షాక్ గురైన తండ్రి వీర్రాజు పెందుర్తి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పెందుర్తి పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి జలరాజు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. మృతుడి భార్య ఈశ్వరి ఫిర్యాదు మేరకు పోలీసులు వీర్రాజుపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.