తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తి, బిక్కవోలు మండలాల్లో పొలిటికల్ వార్ జరుగుతోంది. అవినీతి నీదా… నాదా తేల్చుకోవడానికి ఆలయాన్నే వేదికగా చేసుకున్నారు. బిక్కవోలు గణపతి ఆలయం రాజకీయ సవాళ్లకు కేంద్రమైంది. అనపర్తి ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి దంపతులతో సహా గుడికి వచ్చి ప్రమాణాలు చేశారు. అయినా పంచాయితీ మాత్రం తేలలేదు. ఆలయంలోనూ ఎవరికి వారే తమ వాదనను వినిపించారు.
హైఓల్టేజ్ టెన్షన్ మధ్య బిక్కవోలు గణపతి ఆలయంలో ప్రమాణాలు జరిగాయి. నేను అవినీతి చేయలేదంటే… నేను అవినీతి చేయలేదని… గణపతిపై ప్రమాణం చేశారు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే. మూడు నిమిషాల వ్యవధిలోనే ఆలయానికి చేరుకున్నారు సూర్యనారాయణరెడ్డి, రామకృష్ణారెడ్డి దంపతులు. ప్రదక్షిణలు చేసిన తర్వాత ఇరువురు నేతలు సతీ సమేతంగా లోపలకు వెళ్లారు.
నేతలతో పాటు అతికొద్ది మందిని మాత్రమే పోలీసులు లోపలకు అనుమతించారు. ప్రమాణ సమయంలో వాగ్వాదం నడిచింది. ప్రమాణం చేసేటప్పుడు నల్లమిల్లి సతీమణి చేయి తీసేశారని ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి చెబితే… అదంతా పచ్చి అబద్ధమని, తాను ప్రమాణం చేశానని క్లారిటీ ఇచ్చారు మాజీ ఎమ్మెల్యే భార్య. మరోవైపు ఎమ్మెల్యేనే ఊగిపోతూ దుర్బాషలాడారని ఆరోపించారు నల్లమిల్లి. ఎన్నిసార్లు ప్రమాణం చేయడానికైనా సిద్దమని మరో సవాల్ విసిరారు.