ఎంత లౌకిక దేశం అని మనం చెప్పుకున్నా దేశంలో రాజకీయాలు మతం, కులం ఆధారంగానే జరుగుతున్నాయి. గత పదిహేను రోజులుగా ఏపీ రాజకీయాల్లో మతం, కులం అనే మాటలు తరచూ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా జనసేన, వైసీపీల మధ్య హిందుత్వం ఆధారంగా మాటల తూటాలు పేరాయి. తిరుమల క్షేత్రంలో అన్యమత ప్రచారానికి వైసీపీ ప్రభుత్వం అండ వుందన్న కామెంట్లు కూడా పెద్ద ఎత్తున వచ్చాయి.
ఈ నేపథ్యంలో మతం ముద్ర పోగొట్టుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు వైసీపీ నేతలు. ఇందులో భాగంగా కడప జిల్లా నేతలు తిరుమల మహా పాదయాత్ర పేరిట ఓ యాత్ర ప్రారంభించారు. ఆకేపాటి అమర్నాథరెడ్డి ఈ మహా పాదయాత్రను చేపట్టారు. కాగా.. ఈ యాత్రకు వైసీపీ నేతలు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో శనివారం క్లియర్‌గా వెల్లడైంది.
శనివారం పల్లంపేట మండలం అప్పయ్యరాజు పేటవద్ద ఆకేపాటి అమర్నాథరెడ్డి తిరుమల మహా పాదయాత్రలో ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, కడప పార్లమెంటరీ కమిటీ అధ్యక్షుడు సురేష్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిరుమల యాత్రలో పాల్గొనడం ఆనందంగా వుందని అంజాద్ బాషా అన్నారు.
500 సంవత్సరాల క్రితం అన్నమయ్య తిరుమలకు నడిచిన కాలిబాటను త్వరలో భక్తులకు సులువైన మార్గంగా మారుస్తామని బాషా ప్రకటించారు. అన్నమయ్య కాలిబాటను సులువైన మార్గంగా మార్చడానికి సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా సుముఖంగా ఉన్నారని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా అన్నారు.