Telugu states fighting against Covid-19: కేంద్రం హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలు కరోనా వైరస్‌పై పోరాటాన్ని వేగవంతం చేశాయి. అమరావతిలో జగన్, హైదరాబాద్‌లో కేసీఆర్ హై లెవల్ అధికారులతో సమీక్షలు ఏర్పాటు చేసుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. శనివారం సాయంత్రం రెండు తెలుగు రాష్ట్రాల కేబినెట్లు భేటీ అయి.. పరిస్థితికి అనుగుణంగా చర్యలను వేగవంతం చేసేందుకు రెడీ అవుతున్నారు.
తెలంగాణలో బడ్జెట్ సమావేశాలు జరుగుతుండగా.. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల జోరు నడుస్తోంది. బడ్జెట్ సమావేశాల సందర్భంగా శనివారం రాష్ట్రంలో కరోనా ప్రభావంపై సుదీర్ఘంగా ప్రకటన చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్.. తెలంగాణలో కరోనా నియంత్రణకు పక్కా చర్యలను తీసుకున్నట్లు చెప్పుకున్నారు. అదే సమయంలో శనివారం సాయంత్రం రాష్ట్ర కేబినెట్ ప్రత్యేక భేటీని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి వైద్య, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీని ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ క్రమంలో కేసీఆర్ ప్రభుత్వం కరోనా నియంత్రణకు మరిన్ని కీలక నిర్ణయాలను తీసుకునే అవకాశం వుందని తెలుస్తోంది.
మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలతో బిజీగా వున్న ఏపీ ముఖ్యమంత్రి రాష్ట్రంలో తొలి కరోనా పాజిటివ్ కేసు నెల్లూరులో గుర్తించడంతో అప్రమత్తమయ్యారు. మరికొందరికి కరోనా వుందన్న ప్రచారం జోరందుకోవడంతో ఆయన శనివారం హైలెవెల్ సమీక్ష నిర్వహించారు. ఏపీలోను శనివారం సాయంత్రం ప్రత్యేక మంత్రివర్గం సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత విమానాశ్రాయాలతోపాటు పెద్ద నగరాలలోని ఆసుపత్రిల్లో తీసుకోవాల్సిన ప్రత్యేక చర్యలపై ఓ నిర్ణయానికి రానున్నట్లు తెలుస్తోంది.