కేంద్ర బడ్జెట్‌పై తెలుగు రాష్ట్రాలు గంపెడాశలు పెట్టుకున్నాయి. విభజన హామీలు ఇప్పటికీ నెరవేరలేదు.. చాలా హామీలు కాగితాలకే పరిమితమయ్యాయి. ఇచ్చిన వాగ్దానాలు నెరవేరలేదు. పోలవరం అటు ఇటు కాకుండా మధ్యలోనే ఆగింది. నీతిఆయోగ్ సిఫార్సులనూ కేంద్రం అసలు పట్టించుకోలేదు. ఉభయ రాష్ట్రాలు ఆర్ధిక కష్టాలతో కొట్టుమిట్టాడుతున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్- తెలంగాణ రాష్ట్రాలు కేంద్రం సాయాన్ని మరింతగా కోరుతున్నాయి.
గత నాలుగేళ్లుగా తెలుగు రాష్ట్రాలకు కేంద్రం ఆశించిన స్థాయిలో నిధులు అందించలేదన్నది వాస్తవం.. విభజన చట్టం ప్రకారం తమకు ఇవ్వాల్సిన నిధులు ఇప్పటికీ ఇవ్వలేదని ఏపీ ప్రభుత్వం చెబుతోంది.. వెనుకబడిన జిల్లాలకు ఏడాదికి 50 కోట్ల రూపాయల చొప్పున ఇవ్వాల్సి వుంది.. మొదటి మూడేళ్లు కొంత సొమ్ము ఇచ్చినా.. నాలుగో ఏడాది ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి తీసుకుంది.. రాజధాని లేని ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మించుకోవాలి.. ఇందుకు కేంద్రం సహకారం ఎంతో అవసరం.. అయితే ఈ విషయంలో ఇటు రాష్ట్రంలో.. అటు కేంద్రంలో గందరగోళం కొనసాగుతోంది.
ఇక నీతిఆయోగ్ సిఫార్స్ చేసిన 666 కోట్ల రూపాయలు కేంద్రం ఇవ్వనే లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతోంది.. లాస్టియర్ డిసెంబర్‌లో కేంద్ర ఆర్ధిక సంఘం పర్యటించినప్పుడు రాజధాని కోసం ప్రభుత్వం రూ. 47, 424 కోట్లు ఇవ్వాల్సిందిగా విన్నవించుకుంది.. ఆ మేరకు నిధులు విడుదలయ్యేలా చూడాలని కోరింది.. దీనిపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో.
ఇక పోలవరం ప్రాజెక్టుపైనా అనిశ్చితి కొనసాగుతోంది.. పోలవరం ప్రాజెక్టుకు జాతీయహోదా కట్టబెట్టినప్పటికీ పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి.. జలాశయం నిర్మాణ వ్యయం మొత్తం బాధ్యత కేంద్రానికి.. దీనిపై ఇప్పటికీ క్లారిటీ లేదు.. కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం నడుస్తూనే ఉంది.. ఇక పన్నుల వాటా కింది గత అయిదేళ్లలో రాష్ట్ర అంచనాలకు అటు ఇటుగా వస్తున్నట్టు ఏపీ ప్రభత్వం చెబుతోంది.. మాంద్యం కారణంగా రాష్ట్రంలో ఆర్ధిక కార్యకలాపాలు కొంతమేర తగ్గిన నేపథ్యంలో అంచనా వేసిన స్థాయిలో పన్నులు వసూలు కాలేదని తెలుస్తోంది.
తెలంగాణ విషయానికి వస్తే ఇక్కడా పూర్తి కాని ప్రాజెక్టులు చాలా ఉన్నాయి. కేంద్రం నుంచి రావలసిన బకాయిలు చాలా కాలం నుంచి పెండింగ్‌లో ఉన్నాయి. ఈ బడ్జెట్‌లోనైనా బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ.. గిరిజన విశ్వవిద్యాలయం వస్తాయని. ఆదిలాబాద్‌లో సిమెంట్ పరిశ్రమ పునరుద్ధరణ జరుగుతుందని ప్రభుత్వం నమ్మకంతో ఉంది.
కొత్తగా రైల్వే మార్గాలను, రోడ్డు మార్గాలను కూడా ఆశిస్తోంది. ఆర్ధిక మాంద్యం నేపథ్యంలో సంక్షేమ పథకాలు ముందుకు తీసుకెళ్లేందుకు రాష్ట్రం కష్టాలు పడుతోంది.. దీంతోపాటు ఇప్పటి వరకు కేంద్రం నుంచి తెలంగాణకు రావలసిన బకాయిలు రాలేదు. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు దక్కాల్సినవి తక్షణం ఇవ్వాలని కేంద్రాన్ని అడుగుతూ వస్తోంది ప్రభుత్వం.. బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు.. పాల్వంచలో ఇంటిగ్రేటెడ్ ప్లాంట్ ఏర్పాటుపై సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు.
అయితే ఇప్పటి వరకు నిధులు.. అనుమతులు మంజూరు చేయలేదు.. విభజన చట్టంలో ఎయిమ్స్ ప్రకటించినా అనుమతులు, కేటాయింపులు జరగలేదు. అలాగే కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో కదలికే లేదు నీతిఆయోగ్ సిఫార్సు చేసిన మొత్తాన్ని వెంటనే విడుదల చేయాలని కేంద్రానికి పలుమార్లు విజ్ఞప్తి చేసింది తెలంగాణ ప్రభుత్వం. అలాగే మిషన్ భగీరథ.. మిషన్ కాకతీయ పథకాలకు సాయం చేయాలని అభ్యర్థించింది.. ఈసారి బడ్జెట్ లో తగినన్ని నిధులు, సహకారం ఉంటే ఆర్ధిక మాంద్యం నుండి గట్టెక్కుతామని అంటోంది తెలంగాణ సర్కార్. ఇక కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించి, ఒక భారీ రైల్వే ప్రాజెక్టును మంజూరు చేయాలని కోరుతోంది.