Supreme Court has Finally Decided : రాజకీయ నాయకులపై వేలల్లో క్రిమినల్ కేసులున్నాయి. దశాబ్ధాలుగా విచారణలు జరుగుతున్నా శిక్షలు పడినవి వేళ్లపై లెక్కించొచ్చు. వేలాది మంది స్టేలు, విచారణల పేరుతో సాగదీస్తున్నారు. నిజాయితీని నిరూపించుకోవాలన్న ఆలోచన నాయకులకు లేదు. ఉన్న కేసులతో కోర్టులకు సమయం దొరకడం లేదు. ఎట్టకేలకు నేతలపై ఉన్న కేసులను సత్వరం తేల్చాలని సుప్రీం ధర్మాసనం నిర్ణయించింది. కేంద్రం కూడా అంగీకరించడంతో లెక్కే తేల్చే పని మొదలుపెట్టింది.
రాజకీయాల్లో నేరస్తులు పెరిగారు. ఒకప్పులు సామాజికవేత్తలు, ప్రజాసేవకులు వచ్చేవారు. తర్వాత కుటుంబరాజకీయాలు, ఆ తర్వాత నేరస్తులు ప్రవేశిస్తూ వచ్చారు. ఎన్నికలు జరిగిన ఏడాదిలో చట్టసభల్లో నేరస్తులను ఏరివేసి.. క్లీన్ చేయాలన్నది మాలక్ష్యం అంటూ నరేంద్రమోదీ 2014 ఎన్నికలకు ముందు ప్రకటించారు.
కానీ ఆచరణలో ప్రధాని నరేంద్ర మోదీ మాటలు ఆలస్యమైనా.. ఇప్పుడు క్రిమినల్ నేతల పనిపట్టే ప్రయత్నం జరుగుతోంది. కేసుల్లో నిందితులుగా ఉన్న ప్రజాప్రతినిధులు, మాజీలపై కేసులు ఏడాదిలోగా తేల్చాలని సుప్రీంకోర్టు భావించింది. దీనికి కేంద్రం నుంచి కూడా సహకరిస్తామని చెప్పడంలో స్పీడందుకుంది. నేతల కేసులపై తేల్చే పనిలో పడ్డాయి కిందికోర్టులు. అవసరమైన చోట ప్రత్యేక కోర్టులు పెట్టేందుకు సిద్దమైంది న్యాయశాఖ.
పంజాబ్‌లో 1983కి సంబంధించి పురాతన క్రిమినల్ కేసు పెండింగ్‌లో ఉంది. కేసుల విచారణ ఆలస్యం వల్ల దేశంలో రాజకీయాలు మరింత నేరమయం కావటమే కాకుండా అధికారాన్ని ఉపయోగించి నిందితులు విచారణను ప్రభావితం చేసే అవకాశాలు ఉంటాయన్న ఉద్దేశంతోనే మేం త్వరగా విచారణ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ఇందుకోసం ప్రత్యేక కోర్టుల్లో విచారణలో ఉన్న కేసులన్నింటినీ ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ప్రతి హైకోర్టులో ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేయనున్నారు. ప్రజాప్రతినిధులపై నమోదైన క్రిమినల్, సివిల్ కేసులను సత్వరం విచారించేలా చర్యలు తీసుకోవాలని 2016లో అశ్వనీకుమార్ ఉపాధ్యాయ్ దాఖలైన పిటిషన్‌పై తీర్పు వెలువరించింది సుప్రీంకోర్టు.
దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులపై 4వేల 442 కేసులు విచారణలో ఉన్నాయని అమికస్ క్యూరీ హన్సారియా సుప్రీంకోర్టు ధర్మాసనానికి ఇప్పటికే వివరించారు. సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలపైనే 2వేల 556 కేసులు విచారణలో ఉన్నాయని తెలిపారు. తెలుగురాష్ట్రాల్లో కూడా పలువురు నేతలపై కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో కీలక పదవుల్లో ఉన్ననాయకులూ ఉన్నారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలున్నారు. మరి ఏడాదిలోగా కేసుల్లో స్పష్టత వస్తుందా? నేరమయ రాజకీయాలకు దేశవ్యాప్తంగా చరమగీతం పాడతారా?