విశాఖ నేవీ ఉద్యోగుల హనీట్రాప్ ఎపిసోడ్‌లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎన్ఐఏ దర్యాప్తులూ అధికారులే షాక్ తినే న్యూస్ బయటపడుతోంది. మనదేశ రహస్యాలను చెప్పినందుకు పాక్ ముడుపులు బాగానే ముట్టజెప్పినట్లు విచారణలో తేలింది. మరి ఆ ముడుపులు ఎలా అందించారు…ఏ రూపంలో ఇచ్చారు…ఉద్యోగులను మగువ..మనీతో ఎలా వల వేశారు…?
పాక్ పాపాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఎలాగూ డైరెక్ట్‌గా ఎదురుకునే దమ్ములేక, అడ్డదారులు వెతికింది. నేవీ ఉద్యోగులను తమ ఉచ్చులో వేసుకుంది. కానీ అనుభవజ్ఞులైన ఆఫీసర్స్ తమ వలలో పడరని గ్రహించిన పొరుగుదేశం…నేవీలో కొత్తగా చేరిన వారిపై ఫోకస్ పెట్టింది. డైరెక్ట్‌గా వెళ్తే పనికాదని గ్రహించి…వారిపై వలపు వల విసిరింది. అందరూ పాతికేళ్ల లోపు యువకులే కావడంతో తమ పని ఈజీగా అవుతుందని పాక్ ఊహించింది..అనుకున్నట్లే చేసింది. తన ప్లాన్‌ను అమలు చేసింది..ఎప్పటికప్పుడు నేవీ కదలికలకు సంబంధించిన సమాచారం తమకు అందేలా స్కెచ్ వేసింది. కానీ మన భద్రతా బలగాలు ఆదిలోనే పాక్ కుట్రలకు చెక్ పెట్టారు. హనీట్రాప్ ఉచ్చులో చిక్కుకున్నవారిని అదుపులోకి తీసుకుని విచారించారు.
మన దేశ భద్రతా రహస్యాలను చేరవేసినందుకు ఉద్యోగులకు పాక్ భారీగానే ముట్టజెప్పినట్లు సమాచారం . ఇందుకు నేవీ ఉద్యోగుల వేతన ఖాతాలు, వారి బంధువులు, సన్నిహితుల బ్యాంకు ఖాతాల్లో ఎప్పటికప్పుడు పెద్ద ఎత్తున నిధులు జమయ్యేవని ఎన్‌ఐఏ దర్యాప్తులో తేలింది. ఇందుకు ముంబైకి చెందిన హవాలా ఆపరేటర్లు ఇంతియాజ్ సయ్యద్, షేక్ సహిస్థాలు పాకిస్థాన్ హ్యాండ్లర్ల నుంచి వచ్చే ఆదేశాల మేరకు సంబంధిత నౌకాదళ ఉద్యోగుల ఖాతాల్లో ఈ సొమ్ములు వేసేవారని గుర్తించింది. ఉగ్రదాడుల సన్నాహాక కార్యక్రమాల్లో భాగస్వాములమవుతున్నామని నిందితులందరికీ తెలుసని నిగ్గు తేల్చింది.
ఈ నెల 18, 22 మధ్య ఎన్‌ఐఏ కస్టడీకి తీసుకుని విచారణ నిర్వహించిన సందర్భంలో ఈ కేసులో వారి ప్రమేయాన్ని, నేరపూరిత చర్యలను నిందితులే అంగీకరించినట్లు సమాచారం. నిందితులు ఫేస్‌బుక్, ఈ-మెయిల్ ఖాతాల ద్వారా పాక్‌కు చెందిన ఐఎస్‌ఐ ప్రతినిధులతో సంభాషణలు జరిపినట్లు ఎన్‌ఐఏ గుర్తించింది. సాంకేతిక నిపుణుల సాయంతో వారి ఖాతాల్లోకి లాగిన్ అయ్యి అందులోని సమాచారాన్ని విశ్లేషించింది. వాటిలో ఎక్కువ భాగం నేరపూరిత అంశాలే ఉన్నట్లు తేల్చింది. కొన్ని కీలక డాక్యుమెంట్లనూ డౌన్‌లోడ్ చేయించి స్వాధీనం చేసుకుంది. సంభాషణల సారాంశమేంటి? ఎప్పుడెప్పుడు ఎలాంటి సమాచారం పాక్‌కు చేరింది? అనే అంశాలపై మరింత లోతుగా దృష్టి సారించింది.
ఈ కేసులో ఇప్పటివరకూ 13 మంది నిందితులను ఎన్‌ఐఏ అరెస్టు చేసింది. వీరిలో ఇద్దరు హవాలా ఆపరేటర్లు, 11 మంది నౌకాదళ ఉద్యోగులున్నారు. వీరంతా పాతికేళ్లలోపు యువకులే. ఎన్‌ఐఏ అదుపులో ఏ1 అదాన్..ఇతను పాకిస్తాన్ నివాసి. ఐఎస్‌ఐ ఏజెంట్‌గా అనుమానిస్తున్నారు. ఏ2- ఇంతెజర్ సయ్యద్, ఏ6- స్వామికుమార్, ఏ7-అశోక్ కుమార్, ఏ8-సంజయ్‌కుమార్ డెగె, ఏ9-అశోక్ కుమార్, ఏ10-సంతోష్ సంజయ్ ఇకడే, ఏ11-సంజయ్ కుమార్, ఏ12- ఐకాస్ కుమార్, ఏ13- సోనుకుమార్, ఏ15-షేక్ సహిష్థ, ఏ16- అపర్ష్ సింగ్ రజ్వత్, ఏ17- కల్పవల్లి కొండబాబు, ఏ18- అవినాష్ సోనల్‌లు ఉన్నారు. వీరంతా వాట్సప్ ద్వారా యుద్ధనౌకలు, సబ్‌మెరైన్ల కదలికల సమాచారాన్ని, నౌకాదళ కార్యకలాపాల వివరాలను ఎప్పటికప్పుడు పాక్ నిఘా విభాగం అధికారులకు పంపించేవారని దర్యాప్తులో తేలింది. కీలక స్థావరాలకు సంబంధించిన చిత్రాలు, వీడియోలను పంపించినట్లు ఎన్‌ఐఏ గుర్తించింది.