కంచుకోటలో కాంగ్రెస్‌కు ఘోర పరాభావం. అలాంటలాంటి ఓటమి కాదు. ఏకంగా పిసిసి అధ్యక్షుడినే గట్టి దెబ్బకొట్టారు హుజూర్‌నగర్ ఓటర్లు. ఒక్క చోటంటే ఒక్క మండలంలోనూ ప్రభావం చూపించలేని పరిస్థితి హస్తం పార్టీది. గెలిచేది మేమే… సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేది తామేనని చెప్పుకున్న కాంగ్రెస్ నేతల ప్రచారం ఏ మాత్రం పనిచేయలేదని రుజువు చేసింది హుజూర్‌నగర్ ఉప ఎన్నిక ఫలితం. కర్ణుడి చావుకి కారణాలు అనేకం అన్నట్లు… కాంగ్రెస్ ఓటమికి కారణాలు చాలానే ఉన్నాయి.
హుజూర్‌నగర్. నిన్నటి వరకు ఇది కాంగ్రెస్ కంచుకోట. ఇప్పుడు గులాబీ అడ్డా. ఉత్తమ్ ఇలాఖాలో గులాబీ జెండా ఎగురవేసి సైరా.. సైదిరెడ్డి అనిపించారు టీఆర్‌ఎస్ అభ్యర్థి. హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో రెండు లక్షలకు పైగా ఓట్లు పోలైతే… 69 వేల ఓట్లను మాత్రమే సాధించింది కాంగ్రెస్. 34.65 శాతంతో రెండో స్థానంతో సరిపెట్టుకుంది.
గతంలో ఇక్కడ హ్యాట్రిక్ కొట్టారు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. 2009లో 29 వేల 194 ఓట్ల రికార్డు మెజార్టీని సాధించారు. ఇప్పుడా రికార్డులన్నింటినీ బద్దలు కొట్టారు సైదిరెడ్డి. ఉప ఎన్నిక ప్రచారానికి ముందు నుంచే నియోజకవర్గంలో హడావిడి మొదలు పెట్టింది కాంగ్రెస్. అయినా ప్రయోజనం లేకపోయింది. టి.పీసీసీ చీఫ్ ఉత్తమ్ పూర్తి స్థాయిలో నియోకజవర్గంలోనే ఉండి వ్యూహాలను పన్నారు. అవన్నీ ఇప్పుడు చిత్తయిపోయాయి. దీనికి కారణాలు చాలానే కనిపిస్తున్నాయి.
హుజూర్‌నగర్ నియోజకవర్గంలో ఏడు మండలాలు ఉన్నాయి. 302 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. వీటిల్లో ఎక్కడా కాంగ్రెస్ ప్రభావం చూపించలేకపోయింది. మొదటి రౌండ్ నుంచి ఆ పార్టీ అభ్యర్థి పద్మావతి వెనుకంజలోనే ఉన్నారు. పార్టీకి బలం ఉన్న ప్రాంతాల్లోనూ వెనుకబడిపోవడంతో కాంగ్రెస్ శ్రేణులన్నీ డీలాపడిపోయాయి.
టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొని జనాన్ని ఆకట్టుకోవడంలోనూ, భారీ సభ పెట్టి బలం ఉందని నిరూపించుకోవడంలోనూ వైఫల్యం చెందింది కాంగ్రెస్. ఉత్తమ్ ఒక్కడే బాధ్యతలు మోయడం, నియోజకవర్గం మొత్తాన్ని సమన్వయం చేయడంలో ఆయన వైఫల్యం చెందారనే వాదనలు జరుగుతున్నాయి. పైగా మిగిలిన పార్టీలు మద్దతు ఇవ్వకపోవడం కాంగ్రెస్‌ను మరింత దెబ్బతీసింది. టీడీపీ పోటీ చేసినా ఉనికి చాటుకోలేకపోయింది. ఇక అంతోఇంతో బలం ఉందనుకున్న సీపీఎం, సీపీఐలు దూరం జరిగాయి. సో.. హుజూర్‌నగర్ ఓటమి కాంగ్రెస్ పార్టీది… మరీ ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ స్వయంకృతాపరాధమే.