మహారాష్ట్రలో రాజకీయాలు రోజుకి కాదు. క్షణ క్షణానికీ రంగులు మారుతున్నాయంటే అతిశయోక్తి కాదు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయంలో ఏ పార్టీ కూడా తన బలాన్ని నిరూపించుకోలేకపోయిన నేపథ్యంలో గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీకి కూడా ఇది సమస్యగా మారింది. మొదట ఆయన బీజే[పీని ఆహ్వానించగా.. ఆ పార్టీ చేతులెత్తేసింది. మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆధ్వర్యంలో బీజేపీ-శివసేన కూటమి ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని వార్తలు వచ్చాయి. ముఖ్యమంత్రి అభ్యర్థి అంటూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేరును ప్రతిపాదిస్తూ బీజేపీ నూతన ప్రతిపాదన తెరపైకి తెచ్చింది. ఆయన తానేమీ ముఖ్యమంత్రి అభ్యర్థిని కానని, ఫడ్నవీసే సీఎం అని ఆ మధ్య ప్రకటించారు. పైగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ని కూడా నాగ పూర్ లో కలిసి వచ్చారు. అయితే అధికారాన్ని చెరి సగం పంచుకోవలసిందేనని శివసేన పట్టుబట్టడంతోను, ఇందుకు కమలనాథులు అంగీకరించకపోవడంతోను రెండు పార్టీల మధ్య సంబంధాలు తెగిపోయాయి. ఇక సేన.. ఎన్సీపీ, కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటుకు సిధ్ధపడింది. ఇందుకు సేన నేతలు ఒక సందర్భంలోను, ఎన్సీపీ సీనియర్ నేత శరద్ పవార్ మరొక సందర్భంలోను ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ నాయకత్వంతో చర్చలు జరిపారు. మొదట ఈ ఏర్పాటుకు కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ సుముఖత వ్యక్తం చేసినప్పటికీ.. ఆ తరువాత వెనక్కి తగ్గారు.. పునరాలోచనలో పడ్డారు. మరో వైపు ఎన్సీపీ నేత శరద్ పవార్ కూడా పవర్ కోసం తహతహలాడారు. బీజేపీ, సేన తరువాత మూడో అతి పెద్ద పార్టీగా అవతరించిన ఈ పార్టీని గవర్నర్ కోష్యారీ ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించారు. అయితే ఇది కూడా తమ బల నిరూపణవిషయంలో సందేహంగానే ఉంది. అందువల్లే తాము ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీతో సంప్రదిస్తామని, మంగళవారం రాత్రి ఎనిమిదిన్నర గంటల లోగా గవర్నర్ కు తమ నిర్ణయం తెలియజేస్తామని మహారాష్ట్ర శాఖ ఎన్సీపీ ప్రెసిడెంట్ జయంత్ పాటిల్ చెప్పారు. అంటే ఎన్సీపీ కూడా దాదాపు వెనకడుగు వేసినట్టే..
కాగా- సేనకు మద్దతు విషయంలో సోనియా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. సేనకు సపోర్ట్ ఇఛ్చి.. ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ.. కొంతకాలం అనంతరం కర్ణాటక తరహా రాజకీయాలు ఇక్కడ కూడా పునరావృతమవుతాయేమోనని ఆమె భయపడుతున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు. భవిష్యత్ పరిణామాలపై ఆమె ఇప్పుడే అంచనా వేస్తున్నట్టు కనిపిస్తోంది. కర్ణాటకలో గత జులైలో కాంగ్రెస్=జేడీ-ఎస్ కూటమి కుప్ప కూలిన విషయాన్ని ఆమె మరచిపోలేదు. కుమారస్వామి ప్రభుత్వంపై రెబల్ ఎమ్మెల్యేల తిరుగుబాటుకు బీజేపీయే కారణమని భావిస్తున్న సోనియా..ఆ పార్టీ కొద్దికాలానికే తన ‘ చాతుర్యాన్ని ‘ ప్రయోగించి.. ఇక్కడ కూడా సేన-కాంగ్రెస్ కూటమి ప్రభుత్వ పతనానికి కారణం కావచ్ఛునని ఆమె భావిస్తున్నట్టు తెలుస్తోంది. పైగా శివసేనకు మద్దతునిచ్చిన పక్షంలో తమ పార్టీ హిందుత్వ
పాలిటిక్స్ కి చోటునిచ్చినట్టు అవుతుందని అది.. యాంటీ కాంగ్రెసిజం అనే ముద్ర పడుతుందని సోనియా ‘ ఆందోళన ‘ పడుతున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు.