లడఖ్ లోని గాల్వన్ వ్యాలీలో భారత, చైనా దళాల మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు మరణించారు. చైనా దళాల్లో 45 మంది గాయపడడమో, మరణించడమో జరిగిందని ఇండియన్ ఆర్మీ చెబుతోంది. సుమారు అయిదు దశాబ్దాల అనంతరం ఇండో-చైనా దళాల మధ్య జరిగిన అతి పెద్ద ఘర్షణ ఇది.. 1967 లో నాథూ లా వద్ద కూడా ఇదే విధమైన ఘర్షణలు జరిగాయి. నాటి ఆ ఘటనలో 80 మంది భారత సైనికులు, సుమారు 300 మంది చైనా సైనికులు మృతి చెందారు. కాగా కోవిడ్-19 మీద పోరుపై ప్రభుత్వం దృష్టి సారించిన ఈ సమయంలో చైనా ఈ కవ్వింపు చర్యలకు దిగడం అనుమానాలకు తావిస్తోంది.
ఈ నెల 6 న లెఫ్టినెంట్ జనరల్ స్థాయిలో ఉభయ దేశాల దళాల మధ్య చర్చలు జరిగాయి. లడఖ్ తూర్పు ప్రాంతంలో నెలరోజులుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలను సడలించడానికి ఆ చర్చలు జరిగాయి. అప్పటికి పరిస్థితి సద్దు మణిగినట్టు కనిపించినా.. ఈ నెల రెండో వారంలో చైనా దళాలు తిరిగి వఛ్చి భారత భూభాగాల ప్రాంతాల్లో క్యాంపులను ఏర్పాటు చేశాయి. దీంతో వాటిని మన సైన్యం నాశనం చేసింది. ఆ సందర్భంలో రెండు దేశాల సైనికులు తలపడగా పలువురు గాయపడ్డారు. ఈ నెల 14 న చైనా సోల్జర్స్ పెద్ద సంఖ్యలో తిరిగి వఛ్చి భారత సైనికులపై రాళ్లు రువ్వారు. ఈ నెల 15 వ తేదీ సాయంత్రంఇదే వ్యాలీలో గాల్వన్ నది వద్ద మెల్లగా ఘర్షణలు ప్రారంభమయ్యాయి. ఆ ఘర్షణల్లో అనేకమంది భారత సైనికులను చైనా దళాలు నదిలోకి తోసివేశాయి. చైనా సైనికులు వెనక్కి మళ్ళక పోవడంతో కల్నల్ సంతోష్ ఆధ్వర్యాన నిరాయుధులైన ఓ సైనిక బృందం చైనీయులతో చర్చలకు సిధ్ధపడింది. కానీ ఈ చర్చలను నిరాకరించిన చైనా వారు పెద్ద పెద్ద బండరాళ్లు, ఇనుప తీగలు చుట్టిన రాడ్లు, కర్రలతో దాడులకు దిగారు. ఎవరూ కాల్పులకు దిగకపోయినప్పటికీ ఈ ఘర్షణల్లో అనేకమంది గాయపడ్డారు. సంతోష్ సహా గాయపడిన వారిని తీసుకుని భారత సైనికులు వెనక్కి తమ క్యాంపు వద్దకు తీసుకువచ్చాయి.
అనంతరం ఓ మేజర్ నేతృత్వాన మరికొందరు సైనికులు అదే స్పాట్ కి చేరుకొని చైనా సైనికులపై విరుచుకపడ్డారు. ఈ ఘర్షణల్లో సుమారు 56 మంది డ్రాగన్ కంట్రీ సైనికులు గాయపడ్డారు. ఈ సందర్భంలో మళ్ళీ అనేకమంది భారత సైనికులను ఓ కొండపై నుంచి చైనావారు గాల్వన్ నదిలోకి నెట్టివేశారు. ఈ ఘర్షణలు సుమారు మూడు గంటలపాటు కొనసాగాయి.