ఈసారి మిర్చి రైతు పంట పండిందన్నారు. ఈ ఏడాది వారి అప్పులు తీరిపోతాయన్నారు. మంచి గిట్టుబాటు ధర దొరుకుతుందని రైతులు కూాడా ఆనందపడ్డారు. వ్యాపారులు కూడా కల్లాల వద్దకు వచ్చి మరీ కొనుగోళ్లు జరపడం ప్రారంభించారు. ధర కూడా రూ. 15 వేల నుంచి రూ. 20 వేలకు ఎగబాకింది. సరిగ్గా ఇక్కడే అసలైన సమస్య మొదలైంది. చైనాలో విజృంభించిన కరోనా మహమ్మారి మిర్చి రైతుల ఆశలపై నీళ్లు చల్లింది. వాళ్లు జీవితాల్లో ఊహించని కన్నీరుని మిగిల్చింది.
తెలుగు రాష్ట్రాల నుంచి మిర్చి ఎక్కువగా(దాదాపు 30 శాతం) చైనా ఎగుమతి అవుతోంది. కరోనా ప్రభావంతో ఎక్స్‌పోర్ట్ ఆగిపోవడంతో..ధర అమాంతం తగ్గిపోయింది. అప్పటివరకు హడావిడి చేసిన బేరగాళ్లు..మార్కెట్ యార్డుకి తీసుకెళ్లినా కూడా పట్టించుకోకుండా మోహం చాటేశారు. ముఖ్యంగా ఆంధ్రలోని కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో…తెలంగాణలోని ఖమ్మం, నల్గొండ జిల్లాల్లోని రైతుల రోదనకు సమాధానం దొరకని పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రాంతాల్లో మిర్చి ఎక్కువగా సాగు చేస్తారు. ఊహించని పరిణామం ఏంటంటే..ఈ క్రమంలో పంట పండే వరకు బాగానే ఉన్న మిర్చి..కోత దశకు వచ్చేసరికి అధికభాగం తాలుగా మారిపోయింది. కొన్నిప్రాంతాల్లో అయితే నూటికి 70 నుంచి 80 శాతం తాలుకాయగా మారిపోయింది. ఒకవైపు కరోనాతో అనుకున్న రేటు దక్కక, మరోవైపు తాలుతో సతమతమవుతోన్న మిర్చి రైతు ప్రస్తుత పరిస్థితి వర్ణణాతీతం. ప్రభుత్వాలు దీనిపై స్పందించి తగు చర్యలు తీసుకోకపోతే..పరిస్థితి మరింత అదుపుతప్పే ప్రమాదం కనిపిస్తోంది.