బెంగళూరు: పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది జవాన్లు కన్నుమూయడంతో దేశ వ్యాప్తంగా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేశ ప్రధాని నుంచి సామాన్య మానవుడి వరకూ అంతా బాధపడుతున్నారు. దెబ్బకు దెబ్బ తీయాలని, మన జవాన్ల ప్రాణ త్యాగాలు వృధా కాకూడదని పలు కామెంట్లు వినిపించాయి. సోషల్ మీడియా అయితే కన్నీరు కర్చింది. అయితే ఈ నేపథ్యంలో జవాన్ల ప్రాణ త్యాగానికి పూర్తి వ్యతిరేకంగా కొందరు సోషల్ మీడియాలో పేట్రేగుతున్నారు.
అంలాంటి ఒక పోస్ట్ పెట్టిన యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అతన్ని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. ఇంతకీ ఏం జరిగిందంటే బెంగళూరుకు చెందిన ఒక యువకుడు అసలైన సర్జికల్ స్ట్రైక్ అంటే జవాన్లపై జరిగిన దాడే అని అన్నాడు. కశ్మీర్ సమస్యపై స్పందించకపోతే మరో 40 మంది సైనికులు మరణిస్తారని హెచ్చరించాడు. అతని పేరు అబిద్ మాలిక్ అని ఫేస్‌బుక్‌లో ఉంది. అతను ఒక ప్రైవేట్ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్‌గా పని చేస్తున్నట్టు ఫేస్‌బుక్‌లో ఉంది.