కరప్షన్.. ప్రభుత్వ పనుల దగ్గర నుంచి ప్రైవేట్ వ్యవహారాలన్నింటికీ కూడా ఇదే ఆయుధం. ఈ స్మార్ట్ యుగంలో పనులు కావాలంటే తప్పకుండా లంచం ఇవ్వాల్సిందే. ఇప్పుడు ఇదంతా పక్కన పెడితే.. తెలుగు రాష్ట్రాల్లో ఏమేరకు అవినీతి జరుగుతుందో తెలుసుకోవాలని తాజాగా ఇండియా కరప్షన్ 2019 పేరుతో ఓ సర్వే నిర్వహించారు. 2018 అక్టోబర్ నుంచి 2019 నవంబర్ మధ్య ఎంత మేరకు రాష్ట్రాల్లో కరప్షన్ జరిగిందనే దానిపై.. సుమారు 20 రాష్ట్రాల్లోని 248 జిల్లాల్లో 1.9లక్షల మంది స్థానిక ప్రజలను అడిగి తెలుసుకుని వివరాలు సేకరించారు. ఇక ఈ సర్వేలో రెండు తెలుగు రాష్ట్రాల గురించి విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి.
ఊహించని రీతిలో తెలంగాణ అవినీతిలో ఐదో స్థానంలో ఉన్నట్లు సర్వే పేర్కొంది. అంతేకాక రాష్ట్రంలో వందకు 67% మంది ప్రజలు తమ పనులకు లంచం ఇస్తున్నట్లుగా గుర్తించారు. తెలంగాణతో పోలిస్తే.. ఆంధ్రప్రదేశ్ చాలా బెటర్ అని చెప్పొచ్చు. జగన్మోహన్ రెడ్డి.. గ్రామ వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చిన తర్వాత.. అవినీతి స్థాయి 50 శాతానికి తగ్గిందని తెలుస్తోంది. అటు దేశంలోనే అత్యంత అవినీతి రాష్ట్రంగా రాజస్థాన్ మొదటి ప్లేస్‌లో నిలిస్తే.. బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్‌లు తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
ఇక తెలంగాణ విషయానికి వస్తే.. 67 శాతంలో 56% మంది రెండుసార్ల కంటే ఎక్కువగా లంచాలు ముట్టచెప్పినట్లు తెలుస్తోంది. కొందరు నేరుగా అధికారులకే ఇవ్వగా.. మరికొందరు పరోక్షంగా చెల్లించారు. అంతేకాక భూముల రిజిస్ట్రేషన్ల విషయంలో 40 శాతం మంది లంచం ఇచ్చినట్లు గుర్తించారు. అటు గతేడాది(43%)తో పోలిస్తే.. ఈ ఏడాది తెలంగాణలో గణనీయంగా అవినీతి స్థాయి 67 శాతానికి పెరిగినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ 13వ స్థానంలో ఉంది. ఇకపోతే అవినీతి తక్కువ ఉన్న రాష్ట్రంగా కేరళ నిలిచింది. అక్కడ 10 శాతం మాత్రమే ఉంది. గోవా (20), ఒడిశా (40), ఢిల్లీ (46)ల్లో ఇలా అవినీతి నమోదైంది.