శాంతి సూచనా ? చైనా విదేశాంగ మంత్రితో దోవల్ చర్చలు

భారత-చైనా దేశాల  మధ్య ఉద్రిక్తతలు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్.. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ఈ తో వీడియో కాల్ ద్వారా జరిపిన చర్చలే ఇందుకు నిదర్శనంగా..

శాంతి సూచనా ? చైనా విదేశాంగ మంత్రితో దోవల్ చర్చలు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 06, 2020 | 5:20 PM

భారత-చైనా దేశాల  మధ్య ఉద్రిక్తతలు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్.. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ఈ తో వీడియో కాల్ ద్వారా జరిపిన చర్చలే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. నిన్న సాయంత్రం సుమారు రెండు గంటల పాటు ఈ చర్చలు  సుహృద్భావ వాతావరణంలో.. సామరస్యపూర్వకంగా జరిగినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. భవిష్యత్తులో ఉభయ దేశాల మధ్య మళ్ళీ ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా.. శాంతి, సౌమనస్యాలను పునరుధ్ధరించాలని ఈ చర్చల సందర్భంగా ఇద్దరూ ఓ అంగీకారానికి వచ్చినట్టు తెలుస్తోంది. లదాఖ్ లో నియంత్రణ రేఖ పొడవునా  రెండు దేశాల దళాల ఉపసంహరణ త్వరగా జరగాలని వీరు అభిప్రాయపడినట్టు సమాచారం. ఇటీవలి కాలంలో ఉన్నత స్థాయిలో.. భారత జాతీయ భద్రతా సలహాదారుకి, చైనా  విదేశాంగ శాఖ మంత్రికి మధ్య  ఇంతసేపు సుదీర్ఘంగా చర్చలు జరగడం ఇదే మొదటిసారి.

గాల్వన్ లోయలో ముందువైపున్న తమ దళాలను వెనక్కి రప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఈ ఉదయం చైనా తెలిపింది. తమ దేశ దళాలు పెట్రోలింగ్ పాయింట్-14 వద్ద టెంట్లను తొలగిస్తున్నారని, సైనిక శకటాలను వెనుకకు మళ్లిస్తున్నారని చైనా పేర్కొంది. తమ దళాలు దాదాపు ఒకటిన్నర కిలోమీటర్ల దూరం వెనక్కి వఛ్చినట్టు స్పష్టం చేసింది. ఉద్రిక్తతల సడలింపునకు ఈ విధమైన చర్యలు తోడ్పడుతాయని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్ తెలిపారు. కమాండర్ల స్థాయిలో ఉభయదేశాల మధ్య గత జూన్ 30 న చర్చలు జరిగిన విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ.. అంతకుముందు  పలు దఫాలుగా జరిగిన చర్చల సందర్భంగా కుదిరిన ఏకాభిప్రాయాన్ని అమలు చేయాలని అభిప్రాయపడ్డారన్నారు. భారత దళాల నుంచి కూడా పాక్షిక ఉపసంహరణ జరుగుతుందని ఆశిస్తున్నట్టు  ఆయన పేర్కొన్నారు.

Latest Articles