అదే జరిగితే పెను వినాశనం తప్పదా.! చంద్రుడి మీద హక్కుల కోసం అమెరికా, చైనా పోటాపోటీ అడుగులు ఎటువైపు?

|

Dec 19, 2020 | 11:11 AM

అమెరికా, చైనా.. ఈ రెండు దేశాలు ఇప్పుడు చంద్రుడి మీద హక్కుల కోసం పోటాపోటీగా అడుగులు వేస్తున్నాయి. వాస్తవానికి ఇతర గ్రహాలు, చంద్రుడివంటి..

అదే జరిగితే పెను వినాశనం తప్పదా.! చంద్రుడి మీద హక్కుల కోసం అమెరికా, చైనా పోటాపోటీ అడుగులు ఎటువైపు?
Follow us on

అమెరికా, చైనా.. ఈ రెండు దేశాలు ఇప్పుడు చంద్రుడి మీద హక్కుల కోసం పోటాపోటీగా అడుగులు వేస్తున్నాయి. వాస్తవానికి ఇతర గ్రహాలు, చంద్రుడివంటి ఉపగ్రహాలపై హక్కులు ఎవరూ నిర్ణయించలేదు. కానీ ఈ రెండు దేశాలు మాత్రం పోటీపడుతున్నాయి. 1958లో అమెరికా తొలిసారి మూన్‌ మిషన్‌ చేపట్టింది. అదే ఏడాది సోవియట్‌ యూనియన్‌ కూడా మూన్‌ మిషన్‌ చేపట్టింది. ఆ రోజుల్లో చైనా పేదదేశం. కానీ తాము కూడా శాటిటైల్స్‌ తయారుచేస్తామని ఆధునిక చైనా నిర్మాత మావో జెడాంగ్‌ చెప్పారు. 1970లో చైనా తన శాటిలైట్‌ను పంపింది. అమెరికా నీడలో ఆర్థికంగా ఎదిగిన చైనా.. 40 ఏళ్లలో అదే అగ్రరాజ్యానికి పోటీ ఇచ్చే స్థాయికి ఎదిగింది. చంద్రుడిపై అన్వేషణ కోసం అమెరికా సుమారు 70 ఏళ్లుగా పరిశోధనలు చేస్తోంది. చంద్రడిపై ఉన్న వనరులన్నీ ఒక్కొక్కటిగా స్వాధీనం చేసుకోవడానికి అమెరికా ప్రయత్నిస్తోంది. భవిష్యత్తులో చంద్రుడిపై ఉన్న వనరులను గుర్తించి వెలికితీసే పనులను ప్రైవేటు రంగానికి అప్పగించాలని అంకుల్‌సామ్‌ ఆలోచన.

అక్కడ లభించే ఖనిజ సంపదలో భాగంగా- శాంపిల్ సేకరణకు నాసా నాలుగు కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. 2024నాటికి చంద్రుడిపైకి ఇద్దరు వ్యోమగాములను పంపాలని నాసా టార్గెట్‌గా పెట్టుకుంది. ఈ ప్రోగ్రామ్‌ పేరు ఆర్టెమిస్‌ మిషన్‌. ఇందుకోసం రెండు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. చంద్రుడిపై స్వంతంగా నీరు, గాలి, ఇంధనాన్ని ఉత్పత్తి చేసే ఆలోచనతో ఇప్పుడు పరిశోధనలు సాగుతున్నాయి. చంద్రుడిపైకి పోయి రావడమేకాదు, అంతకుమించి అంటోంది అమెరికా. 2030నాటికి చంద్రుడిపై స్థావరాన్ని ఏర్పాటు చేయాలనేది అమెరికా ఆలోచన. చైనా కూడా ఇదే టార్గెట్‌తో ప్రయోగాలు చేస్తోంది. అగ్రరాజ్యంకన్నా ఒక అడుగు ముందుగానే, అంటే 2029కల్లా చంద్రుడిపై తిష్టవేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే చైనా వేస్తున్న అడుగులు చూస్తుంటే ప్రపంచానికి భయం వేస్తోంది. ఎందుకంటే చైనా అవసరమనుకుంటే, తన శతృదేశాల శాటిలైట్లను ధ్వంసం చేయడానికి కూడా వెనుకాడదు. అదే జరిగితే పెను వినాశనం తప్పదని అమెరికా నిపుణులు హెచ్చరిస్తున్నారు.