అన్ని రకాల పరిమితులు దాటిపోయి…రికార్డు స్థాయి టెంపరేచర్లతో భూగోళం వేడెక్కిపోతోంది. పర్యావరణ విధ్వంసంతో పాటు…ఎడాపెడా పెరిగిపోతున్న కాలుష్యంతో భూమి భగభగా మండిపోతోంది. ఫ్యాక్టరీల నుంచి వెలువడే కాలుష్యం…భూమి పాలిట శాపంగా మారింది. క్రూడాయిల్ లాంటి శిలాజ ఇంధనాలను విపరీతంగా ఉపయోగించడం, అడ్డూఅదుపు లేని కాలుష్యంతో…వాతావరణంలోకి కార్బన్ డయాక్సైడ్, ఇతర గ్రీన్‌హౌస్ గ్యాసెస్ విడుదల ఎక్కువైపోయింది. దీంతో భూగోళం కాస్తా నిప్పుల కుంపటిగా మారిపోయింది. 1850లో భూ ఉష్ణోగ్రతలను నమోదు చేయడం మొదలు పెట్టినప్పటి నుంచి…అత్యంత ఉష్ణోగ్రతలు నమోదయిన సంవత్సరంగా 2023 రికార్డులు సృష్టించింది. ఇక ఆ రికార్డులను 2024 బద్దలు కొట్టింది.
గ్లోబల్ వార్మింగ్‌తో వార్నింగ్ బెల్స్
భూమిని నిప్పుల కొలిమిగా మార్చేస్తున్న ఉష్ణోగ్రతలపై….ప్రపంచ వాతావరణ సంస్థ-డబ్ల్యూఎంవో…ఓ నివేదిక విడుదల చేసింది. భూమిపై గత 1,25,000 సంవత్సరాల్లో…గడిచిన పదేళ్లే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయిన సంవత్సరాలని యూరప్, బ్రిటన్, జపాన్ దేశాల వాతావరణ సంస్థలు నిర్ధారించాయి. బొగ్గు, చమురు ఆధారిత పారిశ్రామిక విప్లవం వచ్చినప్పటి నుంచి భూ ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తున్నాయని ఆ నివేదిక పేర్కొంది. ఈ గ్లోబల్ వార్మింగ్‌తో వార్నింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే…పెనుముప్పు తప్పదంటున్నారు సైంటిస్టులు.
పెరుగుతున్న ఉష్ణోగ్రతలో ప్రకృతి వైపరీత్యాలు
ఈ ఉష్ణోగ్రతలు పెరుగుదల 1.5 డిగ్రీల సెల్సియస్‌కు మించకుండా చూడాలని 2015లో జరిగిన ప్యారిస్ వాతావరణ సభ తీర్మానించింది. కానీ గత ఏడాది భూ తాపం ఆ పరిమితిని మించిపోయి, 1.6 సెంటిగ్రేడ్‌ను టచ్ చేసిందని యూరప్‌కు చెందిన కొపర్నికస్ వాతావరణ విభాగం తెలిపింది. జపాన్ ఈ పెరుగుదలను 1.57 డిగ్రీలుగా, బ్రిటన్ 1.53 డిగ్రీలుగా లెక్కగట్టాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో వాతావరణంలో విపరీతమైన మార్పులు వస్తున్నాయి. దీంతో భారీ వరదలు, పెను తుఫాన్లు, అనావృష్టి తలెత్తి గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా 14,000 కోట్ల డాలర్ల నష్టం జరిగింది.
170 లక్షల కోట్ల డాలర్ల నష్టం
ఇక శిలాజ ఇంధనాలైన బొగ్గు, చమురు, సహజ వాయువులను మండించడం వల్ల, వాతావరణంలో కర్బన ఉద్గారాలు పెరిగి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి. గత కొన్ని దశాబ్దాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన అమెరికా, యూరప్ దేశాలు విడుదల చేసిన గ్రీన్‌హౌస్ గ్యాసెస్‌తో ప్రపంచానికి 170 లక్షల కోట్ల డాలర్ల నష్టం వాటిల్లిందని లెక్కలు చెబుతున్నాయి. ఈ నష్టాలను అధిగమించడానికి వర్ధమాన దేశాలకు లక్షల కోట్ల డాలర్ల సహాయం చేయాల్సిన సంపన్న దేశాలు కేవలం 30,000 కోట్ల డాలర్లను అదీ 2035 కల్లా విదిలిస్తామని ప్రతిపాదించాయి. భూతాపం ఇలాగే పెరుగుతూ పోతే….మనుషులు పశ్చాత్తాపం చెందాల్సిన రోజు వస్తుందంటున్నారు నిపుణులు.