మానవ నాగరికతకు మూలమే ఖనిజం అంటే అతిశయోక్తి కాదు. తొలినాళ్లలో రాతి పనిముట్లు, ఆయుధాలను ఉపయోగించిన ఆది మానవుడు, ఆ తర్వాత ఇనుము, రాగి, బంగారం, వెండి లోహాలను ఆయుధాలుగా, ఆభరణాలుగా, పనిముట్లుగా వినియోగించిన విషయం తెలిసిందే. ఈ లోహాలను భూగర్భం నుంచి ముడి ఖనిజం రూపంలో వెలికితీసి, శుద్ధి చేసి పనిముట్లుగా మలచుకునేవారు. నేటి ఆధునిక యుగంలో ఇంకా అనేక రకాల ఖనిజాలను భూగర్భం నుంచి మాత్రమే కాదు, సముద్ర గర్భం నుంచి కూడా వెలికితీస్తూ నిత్యజీవితంలో వినియోగిస్తున్నాం. వంట చేసుకునే పాత్రల నుంచి మొదలుపెట్టి శరీరం లోపల అమర్చే ఇంప్లాంట్స్ వరకు మనిషి ఎన్నో రకాల ఖనిజాలను వినియోగిస్తున్నాడు. అయితే ఏ ముడి ఖనిజం నుంచి ఏ లోహం తయారు చేయవచ్చు.. ఏ మిశ్రమాలతో ఎలాంటి వస్తువులు తయారవుతాయి అన్న ఆసక్తి చాలా మందిలో ఉంటుంది. సామాన్యులు నిత్య జీవితంలో వినియోగించే వంట పాత్రలు (స్టీల్, అల్యూమినియం), ధరించే ఆభరణాలు (బంగారం, వెండి, ప్లాటినం, రాగి) అన్నీ వివిధ ఖనిజాలు, ఖనిజ మిశ్రమాల ద్వారానే ఏర్పడతాయి. “ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ (IITF-2024)”లో కేంద్ర గనుల శాఖ ఏర్పాటు చేసిన పెవిలియన్ వీటన్నింటి గురించి మరింత సమగ్రంగా తెలుసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది.
ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ (IITF) పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రతియేటా నవంబర్ నెలలో 2 వారాల పాటు అంతర్జాతీయ స్థాయిలో భారీ ప్రదర్శన ఏర్పాటు చేస్తుంది. దేశ రాజధాని న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ఈ ప్రదర్శన జరుగుతుంది. ఈ మధ్యనే ప్రగతి మైదాన్‌లో భారత మండపం పేరుతో అంతర్జాతీయ స్థాయి కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అందులోనే ఈ అంతర్జాతీయ ట్రేడ్ ఫెయిర్ ఏర్పాటైంది. ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి వివిధ మంత్రిత్వశాఖలు, విభాగాలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు పెవిలియన్లను ఏర్పాటు చేస్తాయి. వాటిలో అనేక వ్యాపార, వాణిజ్య సంస్థలు తమ స్టాళ్లను ఏర్పాటు చేస్తాయి. ఆయా సంస్థల వ్యాపార విస్తృతికి, కొత్త వినియోగ మార్కెట్‌ను సృష్టించుకోడానికి ఈ ట్రేడ్ ఫెయిర్ ఉపయోగపడుతుంది. అందుకే ఇక్కడ స్టాళ్లను ఏర్పాటు చేసేందుకు టాటా, బిర్లా, అంబానీ, అదానీ వంటి దిగ్గజ పారిశ్రామిక వేత్తల నుంచి మారుమూల ప్రాంతాల్లో కుటీర పరిశ్రమ ద్వారా వస్తువులను తయారు చేసే సహకార సంస్థల వరకు ఆసక్తి చూపుతుంటాయి. ఇక్కడ కేంద్ర గనుల శాఖ ఏర్పాటు చేసిన పెవిలియన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
మనకు బంగారం, వెండి, రాగి, అల్యూమినియం (రాతివెండి) వంటి లోహాల గురించి తెలుసు. వీటి ముడి ఖనిజాన్ని వెలికితీసి, శుద్ధి చేసి కరిగించడం ద్వారా వస్తువులు తయారు చేసుకుంటాం. ఇవే గాక నిత్య జీవితంలో ఇంకా అనేక రకాల లోహాలు, ఖనిజాలను మనకు తెలియకుండానే వినియోగిస్తున్నాం. ఉదాహరణకు నోట్లో ఊడిపోయిన పళ్ల స్థానంలో అమర్చే కట్టుడు పళ్లను జిర్కోనియం, టైటానియం వంటి లోహాలతో కూడా తయారు చేస్తారు. ఇలా శరీరంలో అమర్చే ఇంప్లాంట్స్ రూపంలోనే కాదు, చేతిలో ఉపయోగించే సెల్ ఫోన్ బ్యాటరీలలో ఉండే ‘లిథియం’ కూడా ఒక ఖనిజమే. కొన్ని ఖనిజాలను నేరుగా వెలికితీసి శుద్ధి చేసి వినియోగించుకోగల్గితే, కొన్నింటి తయారీకి మరికొన్ని ఖనిజాలతో మిశ్రమం చేయాల్సి ఉంటుంది. నేరుగా ముడి ఇనుము నుంచి ఇనుప లోహాన్ని తయారు చేయవచ్చు. దానికి మాంగనీసును కలిపితేనే ఉక్కు (స్టీల్) తయారవుతుంది. ఇనుము పెలుసుగా ఉంటుంది. ఉక్కుగా తయారు చేసినప్పుడే దానికి సాగే గుణం వస్తుంది. అలాగే బంగారంలోనూ కొంత రాగి మిశ్రమాన్ని కలిపితేనే సాగే గుణం వచ్చి ఆభరణాలు తయారవుతాయి. ఇలాంటి ఎన్నో విషయాలను తెలుసుకునే అవకాశం “మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ పెవిలియన్” కల్పిస్తోంది. లోపలికి అడుగు పెట్టగానే షోకేసులో పెట్టిన వివిధ రకాల ముడి ఖనిజాలు (జిప్సమ్, బారైట్, పైరైట్, హేమటైట్, క్వార్ట్‌జ్, డోలమైట్, బాక్సైట్ తదితర ముడి ఖనిజాలు) కనిపిస్తాయి.
Hon’ble Union Minister of Coal and Mines, Shri G. Kishan Reddy, took an virtual ride through India’s underground mines at the Ministry of Mines Pavilion at #IITF2024.
This immersive VR experience showcased the challenges and innovations in mining, offering a vivid look into the… pic.twitter.com/tTWiTbOKbC
— Ministry of Mines (@MinesMinIndia) November 14, 2024
పెవిలియన్ మధ్యలో క్యూబ్ ఆకారంలో స్క్రీన్, దానిపై వివిధ ఖనిజాలకు సంబంధించిన వివరాలు కనిపిస్తాయి. క్యూబ్‌కు ఇరువైపులా ఏర్పాటు చేసిన టచ్ స్క్రీన్ మీద మరింత సమగ్రమైన సమాచారం అందుబాటులో ఉంది. వాటిని టచ్ చేయడం ద్వారా ఫొటోలు, వీడియోల రూపంలో వివరాలు కనిపిస్తాయి. మరోవైపు ఖనిజాలను వెలికితీసే ప్రభుత్వరంగ సంస్థలతో పాటు ప్రైవేట్ సంస్థల స్టాళ్లు అక్కడ ఉన్నాయి. ఖనిజ నిక్షేపాలను గుర్తించే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI) వంటి సాంకేతిక సంస్థలు ఏర్పాటు చేసిన స్టాళ్లు కూడా ఉన్నాయి. అలాగే ఖనిజ నిక్షేపాలను గుర్తించి వెలికితీసే విషయంలో అంతర్జాతీయస్థాయిలో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం, వాటిని భారతదేశం ఏమేరకు అందిపుచ్చుకుంది అన్న సమాచారంతో డిజిటల్ ఇనీషియేటివ్ కింద వర్చువల్ రియాలిటీ ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేశారు. మొత్తంగా ఈ పెవిలియన్‌కి చేరుకుంటే మానవ నాగరికత పరిణామక్రమం, నేటి ఆధునిక జీవనంలో ఖనిజాల పాత్ర గురించి సమగ్ర అవగాహన కల్గుతుంది.
మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..