ఆ గ్రామంలో ప్రతి ఇంటి నుంచి వేద మంత్రాల ధ్వనులు. పిల్లలు, పెద్దలు అందరూ ధోతీలో వీధుల్లో.. రోడ్లపై విహరిస్తూ ఉంటారు. తలపై పిలకను ధరిస్తారు. అలనాటి గురుకుల సంప్రదాయాన్ని అనుసరిస్తూ.. గురుకులంలో పిల్లలు చదువుకుంటారు. ఇక్కడ ప్రజలు మాట్లాడే ప్రధాన భాష సంస్కృతం. ఈ గ్రామస్థుల జీవితాన్ని చూస్తే ఏ వేద కాలం గ్రామాలను చూస్తున్నట్లు అనిపిస్తుంది. అంతేకాదు ఇక్కడ గ్రామానికి విదేశీయలు సంస్కృతాన్ని అభ్యసించడానికి వస్తారు. భారతదేశంలో వెరీ వెరీ స్పెషల్ అనే ఈ గ్రామానికి చేరుకున్నప్పుడు.. మీరు కొన్ని వేల సంవత్సరాల క్రితంనాటి జీవనానికి చేరుకున్నట్లు అనిపిస్తుంది. ఈ గ్రామం పేరు మత్తూర్. ఈ గ్రామం కర్ణాటకలోని షిమోగా జిల్లాలో ఉంది. బెంగళూరు నుండి దాదాపు 320 కి.మీ.లో ఉన్న గ్రామం గురించి ఈరోజు తెలుసుకుందాం.
‘సంస్కృత గ్రామం’
కర్ణాటకలోని మత్తూర్ గ్రామాన్ని ‘సంస్కృత గ్రామం’ అని కూడా అంటారు. ఊరిలో చిన్నపిల్లలైనా, వృద్ధులైనా అందరూ సంస్కృతంలోనే మాట్లాడతారు. ఎవరైనా ఈ గ్రామానికి చేరుకుంటే నమో నమః, నమస్కారం వంటి పదాలతో స్వాగతం పలుకుతారు. దాదాపు తొమ్మిది వేల జనాభా ఉన్న ఈ గ్రామంలో నాలుగు దశాబ్దాలుగా సంస్కృతంలోనే మాట్లాడుకుంటున్నారు. గ్రామంలోని ప్రతి ఒక్కరూ సంస్కృతం నేర్చుకోవడం తప్పనిసరి.
చిన్నప్పటి నుంచి వేదాలు బోధించేవారు
ఈ ఊరి పిల్లలందరికీ చిన్నప్పటి నుంచి సంస్కృతంతో పాటు వేదాలు కూడా నేర్పుతారు. యోగా కూడా నేర్పిస్తారు. ఈ గ్రామస్థులు సంస్కృతం మాట్లాడటం 1981లో ప్రారంభించారు. సంస్కృత భారతి అనే సంస్థ.. ఇక్కడ సంస్కృతంలో మాట్లాడే ఉద్యమాన్ని ప్రారంభించింది. ప్రజలంతా సంస్కృతంలోనే మాట్లాడాలని.. వేదకాలం నాటి జీవితాన్ని గడపాలని నిర్ణయించుకున్నారు. అప్పటి నుంచి మొత్తం గ్రామ జనాభా సంస్కృతంలో మాత్రమే మాట్లాడుతున్నారు.
విదేశాల నుంచి సంస్కృతం నేర్చుకోవడానికి వస్తుంటారు
గ్రామంలో సంస్కృతం బోధించడానికి ఎటువంటి రుసుము వసూలు చేయరు. దేశంలోని అనేక నగరాల నుండి ప్రజలు ఈ గ్రామానికి సంస్కృతం నేర్చుకోవడానికి వస్తుంటారు. భారతదేశంలోని నగరాల నుండి మాత్రమే కాదు విదేశాల నుండి కూడా ప్రజలు సంస్కృతం, వేదాలను నేర్చుకోవడానికి ఇక్కడకు వస్తారు. ఈ గ్రామంలో నివసిస్తున్న గురువులు ఒక నెలలోపు సంస్కృతం బోధించగలరని పేర్కొంటున్నారు. అయితే ఇలా సంస్కృతం నేర్చుకునే సమయంలో అక్కడే గురుకులంలో గడపవలసి ఉంటుంది.
ప్రతి ఇంటిలోనూ ఇంజనీర్-డాక్టర్?
మీడియా నివేదిక ప్రకారం.. ఈ గ్రామంలో ప్రతి ఇంటి నుండి ఒక ఇంజనీర్ ఉన్నారు. ఈ గ్రామంలో చాలా మంది యువ వైద్యులు కూడా ఉన్నారు. సంస్కృతం నేర్చుకోవడం వల్ల గణితం, లాజిక్ పరిజ్ఞానం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ రెండు అంశాలను సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడి యువతరం క్రమంగా ఐటీ ఇంజినీరింగ్ వైపు వెళ్లడంతో ఇక్కడ చాలా ఇళ్లల్లో యువ ఇంజనీర్లు ఉన్నారు.
ఈ గ్రామానికి చెందిన ఇంజనీర్ మధుకర్ మాట్లాడుతూ.. వేద గణితం నేర్చుకున్న తరువాత.. ఇక్కడ యువతకు కాలిక్యులేటర్ కూడా అవసరం లేదని చెప్పారు. మరోవైపు, సంస్కృతం నేర్చుకోవడం వలన కంప్యూటర్ కోడ్ భాషలను ఈజీగా నేర్చుకుంటున్నారు. గ్రామానికి చెందిన చాలా మంది యువకులు ఎంబీబీఎస్, ఇంజినీరింగ్ కోసం విదేశాలకు కూడా వెళ్తున్నారు.
గ్రామం ఏ విషయంలోనూ వెనుకబడి లేదు
సంస్కృతం మాట్లాడే వారికి ఇతర భాషలు తెలియవని కాదు. ఇక్కడి ప్రజలకు అనర్గళంగా ఇంగ్లిష్ లో మాట్లాడతారు. ఈ గ్రామంలో హోటల్ లేదా గెస్ట్ హౌస్ కనిపించదు. అతిథులను ఇంట్లోనే ఉంచుకుని ఆతిధ్యం ఇచ్చే సంప్రదాయం ఇక్కడ కొనసాగుతోంది. వైదిక సంప్రదాయాలు ఉన్న ఈ గ్రామంలో 21వ శతాబ్దానికి చెందిన అన్ని సాంకేతికత పరిజ్ఞానం ఉన్నాయి. యువత మొబైల్ , ఇంటర్నెట్ ద్వారా ప్రపంచ పరిజ్ఞానాన్ని అన్వేషించడం కూడా కనిపిస్తుంది.
మరిన్ని జాతీయ వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి..