International Women’s Day 2022: తెలిసీ, తెలియని వయస్సు, అందరిలా సాధారణ జీవితం గడపాల్సిన అమ్మాయి జోగినిగా మారింది. జీవితాంతం నరకం చూసింది. అలా ఏళ్లు గడిచాయి. ఇప్పుడు మరొకరు తనలా అవమానాలు పడకూడదంటూ మహిళల హక్కుల కోసం పోరాడుతోంది. తనకు బలవంతంగా వేసిన సంకెళ్లను తెంచుకుని తనలాంటి అభాగ్యులకు అండగా నిలుస్తోంది మహబూబ్‌నగర్ జిల్లా ఉట్కూరు గ్రామానికి చెందిన చందన్‌కోటి హాజమ్మ. పాలమూర్ జిల్లాలో రోజురోజుకు మూఢనమ్మకాలు పడగవిప్పుతోన్న నేపథ్యంలో నేను సైతం ఈ సమాజాన్ని మార్పులో భాగమవుతానంటూ అనేక మంది మహిళలను జోగిని వ్యవస్థలోకి వెళ్లకుండా చైతన్యపరిచింది హాజమ్మ.. ఈక్రమంలో జోగిని నిర్మూలన పోరాట కమిటీ అధ్యక్షురాలిగా.. పాలమూరు పల్లెల నుంచి అంతర్జాతీయ వేదికల వరకు ఈ దురాచారంపై గళమెత్తారామె. అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా హాజమ్మపై ప్రత్యేక కథనం మీకోసం..
వికసించిన తామరలా..
మనది అద్భుతమైన సమాజం.. అందమైన సంస్కృతి. కానీ అందులో అక్కడక్కడ కాస్త బురద ఉంటుంది. ఉండకూడని ఊబి కూడా ఉంటుంది. అది స్త్రీని తనవైపు లాగి ఉక్కిరిబిక్కిరి చేసి జీవచ్ఛవంలా మార్చాలని చూస్తుంది. ఆమెను కట్టుబాట్ల అనే కట్టుగొయ్యకు కాటేసి బాధపడేలా చేస్తుంది. కానీ హాజమ్మ ఆ బురదలో నుంచి వికసించిన తామర అయింది. ఆత్మ విశ్వాసం, తెగింపు అనే ఊడలను బలంగా చేత పట్టుకొని జోగిని అనే ఊబి నుంచి బయటపడిన విజేత ఆమె. అలాంటి సంకెళ్లకు ఏ బంగారు తల్లీ బలి కాకుండా పోరాటాలు చేస్తోంది. జోగినీలుగా మారబోయే ఎంతో మంది ఆడపిల్లల నుదిటి రాతను మార్చుతోంది. ఎక్కడో మారు మూల ప్రాంతమైన ఊట్కూర్‌లో పుట్టి జోగిని వ్యవస్థ నిర్మూలనే లక్ష్యంగా పని చేస్తున్న హాజమ్మ మహిళల పట్ల జరుగుతున్న అన్యాయాలను.. జోగినీలుగా మారుతున్న, మారుస్తున్న పేదవారిని చైతన్యపరిచి ఆ దిశగా వెళ్లకుండా చేస్తోన్నారు. దాదాపు 15 ఏళ్ల నుంచి మహిళలపై జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా జోగిని పోరాటాల్లో ముందున్నారు. సామాజిక చైతన్య స్పృహ కలిగిన హాజమ్మ ప్రభుత్వం నుంచి వస్తున్న అనేక కార్యక్రమాల ద్వారా జోగినీలకు వర్తింపజేసే విధంగా పోరారు. 2000 సంవత్సరం నుంచి ఎంతో మంది కలెక్టర్ల చేతుల మీదుగా సత్కారాలు, సన్మానాలు పొందారు. 2004 సంవత్సరంలో బెస్ట్ వాలంటరీ అవార్డు, 2007 లో నవీన అవార్డు, 2010లో సామాజిక సేవ అవార్డు, మదర్ థెరిస్సా స్టేట్ లెవల్ అవార్డులను అందుకున్నారు. మాసన్న మెమో రియల్ సామాజికసేవా అవార్డును సైతం ఆమె అందుకున్నారు. జిల్లాలో ఎక్కడ మూఢనమ్మకాలు, మూఢవిశ్వాసాలు జరిగానా… అక్కడికి వెళ్లి చైతన్య కార్యక్రమాలు నిర్వహించారు. దీనికి గాను 2015 సామాజిక కార్యకర్తగా ప్రశంస పత్రం, 2016లో అంబేద్కర్ మెమోరియల్ అవార్డు, దళిత రత్న అవార్డు,ఢిల్లీలో కేంద్రమంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్ చేతుల మీదుగా సావిత్రిబాయి పూలే జాతీయ అవార్డును తీసుకున్నారు.
అడుగడుగునా అవమానాలు..
వలసలకు నిలయమైన పాలమూరు జిల్లాలో సామాజిక సేవా దృక్పథంతో పని చేస్తూ ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులకు ఎంపికైన హాజమ్మ జీవితంలో ఎన్నో కన్నీటి గాథలున్నాయి. మూఢనమ్మకాలకు నిలయమైననటువంటి జిల్లాలో ఇప్పటికీ జోగినీలు చాలామంది ఉన్నారు. ప్రభుత్వ అధికారుల లెక్కల ప్రకారం 2500 మంది జోగినాలున్నారని సమా చారం. వారి పిల్లలకు తండ్రు లెవ్వరో తెలియదు. సమాజం కానీ, ప్రభుత్వం కానీ చెప్పగలదా..? జోగినీల పిల్లలను స్కూ ళ్లో చేర్పించడానికి వెళి తే నీకు నాన్న లేడా? అయితేఎలా పుట్టావు? అంటూ ప్రశ్నించిన టీచర్లు కూడా ఉన్నరని ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు హాజమ్మ. ఇంతకంటే దారుణం ఇంకోటి వుంటుందా? జోగినీలకే కాదు వారి పిల్లలకు కూడా అడుగడుగునా అవమానాలు తల్లెతుతున్నాయి. ఇలాంటి పరిస్థితి ఎదురుకాకుండా ఉండేందుకు హాజమ్మ ఉద్యమించిన తరుణంలో ప్రభుత్వం జీఓ నంబర్ 139ని జారీ చేసింది. దాని ప్రకారం సర్టిఫికెట్లలో తండ్రి పేరుకు బదులు తల్లి పేరు నమోదు చేసుకోవచ్చు. అయినా ఇప్పటికీ ఎక్కడో ఒకచోట అమ్మాయిలను జోగినీలుగా మార్చే ప్రయత్నాలు జరుగు తున్నాయి. ఇలాంటి వ్యవస్థను అడ్డు కునేందుకు వెళితే… గ్రామ కట్టుబాట్లను అడ్డుకుంటారా… అని కొందరు ఆమెపై దాడులకు తెగబడుతున్నారు. ‘జోగిని వ్యవస్థ వేల సంవత్సరాలుగా వస్తున్న దురాచారం. ఎంత వద్దనుకున్నా.. ఎంత దూరం వెళ్లినా.. ఈ సంకెళ్లు మమ్మల్ని వెంటాడుతూనే ఉన్నాయి. ఎన్నో దురాచారాలను రూపుమాపిన నాటి సంఘ సంస్కర్తలు జోగిని వ్యవస్థ పై ఆనాడే పోరాటం చేసి ఉంటే.. నేడు మాకీ దుస్థితి దాపరించి ఉండేది కాదు’ అని పేరు చెప్పుకోవడం ఇష్టం లేని ఓ జోగిని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక పిన్న వయస్సులో తాను జోగినీగా మారిన పరిస్థితిని కన్నీటితో వివరించారు హాజమ్మ. ‘జోగిని అంటే… నగ్నంగా మార్చి వేపాకులు కట్టి, దేవుడికిచ్చి పెళ్లి చేస్తారని మాత్రమే నాకు తెలుసు. కానీ…జీవితాంతం నరకం ఉంటుందని చిన్న వయస్సులో నాకు తెలీదు. హాజమ్మ నువ్వు ఇక్కడే ఉంటే.. నిన్ను కూడా జోగినిగా మార్చేస్తారు. ఎక్కడికైనా పారిపో అని నన్ను కూతురులా చూసుకునే ఓ మహిళా హెచ్చరించింది. ఐదో తరగతి చదువుతున్న నాకు ఆ మాటలు అర్థమయ్యేవి కావు. అవి అర్థం చేసుకునేలోపే ఆరో తరగతిలో ఉండగా నన్ను జోగినిగా మార్చేశారు. అప్పటి నుంచి నన్ను బలవంతంగా అలా మార్చిన వారిపై తిరగబడి, ఎక్కడికైనా పారిపోవాలని నిర్ణయించుకున్నాను . తాళితో బడికి వెళ్తే అందరూ ఎగతాళి చేసేవారు. కాస్త పెద్దయ్యాక.. మళ్లీ పెళ్లి చేసుకుని నన్ను జోగినిగా మార్చిన వారికి తగిన బుద్ధి చెప్పాలనకున్నాను. అప్పుడే నా తండ్రి చనిపోవడంతో బతుకుదెరువు కోసం ముంబైకి వెళ్లాను. అక్కడే అక్కవాళ్లతో ఉంటూ, కూలీ పనులు చేసుకుంటూ కొంతకాలం ఉన్నాను. జోగినీలకు ఉపాధి కల్పిస్తామని, ఇళ్లు కట్టిస్తామని ఒక సంస్థ ప్రకటించడంతో తిరిగి 1989లో ఊరికి వచ్చాను. తరువాత కొన్నాళ్లకు నేను పెళ్లిచేసుకుంటానని చెబితే… దేవుడిని చేసుకున్నాక మళ్లీ పెళ్లేంటని అందరూ ప్రశ్నించారు. అది ఊరికి అరిష్టమని నా గొంతు నొక్కే ప్రయత్నం చేశారు. నా పై భౌతిక దాడులకు దిగారు. అప్పుడే నా లాంటి పరిస్థితి మరే ఆడదానికి రాకూడదని జోగిని నిర్మూలన పోరాట కమిటీ ఏర్పాటు చేశాను. ఈ నేపథ్యంలో నా మనసుకు నచ్చిన వ్యక్తితో పెళ్లికి సిద్ధమయ్యాను. నా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన ఆ ఊళ్లోనే వివాహం చేసుకోవాలని హాజమ్మ నిర్ణయించుకున్నారు. దీన్ని అడ్డుకోవడానికి ఊళ్లో పెద్దలు ఎన్నో ఆటంకాలు సృష్టించారు. నా పెళ్లికి హాజరైన వారికి వెయ్యి రూపాయల జరిమానా విధిస్తామని చాటింపు కూడా వేయించారు. ఇన్ని అడ్డంకుల నడుమ అప్పటి ఆర్డీవో అనితారామచంద్రన్ అండతో 1995లో ఎమ్మార్వో, పోలీసు అధికారుల సమక్షంలో నా పెళ్లి జరిగింది’ అని అప్పటి చేదు అనుభవాలను గుర్తు తెచ్చుకున్నారు హాజమ్మ.
నా పోరాటం ఆగదు..
ఇక జోగిని నిర్మూలన పోరాట కమిటి తరఫున గ్రామగ్రామాలు తిరిగారు హాజమ్మ. అభం శుభం తెలియని అమ్మాయిల్ని జోగినిలుగా మార్చకుండా ఎన్నోసార్లు అడ్డుకున్నారు. ఆ క్రమంలో ఆమె పై దాడులు కూడా జరిగాయి. దేవరకద్రలో 2010లో ఒక అమ్మాయికి ఆ ఊరి సర్పంచే తాళి కట్టి జోగినిగా మార్చేందుకు ప్రయత్నించాడు. విషయం తెలిసి అక్కడికి హాజమ్మ వెళ్లింది. కౌన్సెలింగ్ ఇచ్చినా అతడు ఎవరి మాట వినలేదు. రాత్రిపూట మన్యంకొండకు వెళ్లి ఆలయంలో అమ్మాయికి తాళి కట్టాడు. అయిదు రోజులు అక్కడే ఉండి హాజమ్మ పోరాటం చేసి ఆ జోగిని వ్యవస్ధ నుంచి ఆ చిన్నారిని విడిపించారు. తరువాత ఆమె వేరే పెళ్లి చేసుకుని హాయిగా జీవిస్తోంది. ‘కర్ణాటకలో జోగిని వ్యవస్థ నిర్మూలనకు, వారి సంక్షేమానికి అక్కడి ప్రభుత్వం ప్రత్యేకంగా శాఖను ఏర్పాటు చేసింది. ఇక్కడ కూడా అలాంటి ప్రయత్నం జరగాలి. కనీసం ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి’ అని హాజమ్మ డిమాండ్ చేస్తున్నారు. వయసుతో నిమిత్తం లేకుండా జోగినిలకు ప్రత్యేక కోటా ద్వారా పింఛన్లు ఇవ్వాలని, వారి కుటుంబాలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఇచ్చి, పిల్లలకు ఉచిత విద్య ఉపాధికి ప్రత్యేక పథకాలు అమలు చేయడంతో పాటు గతంలో నియమించిన జస్టిస్ పురుషోత్తమరావు కమిటీ నివేదికను అమలు చేయాలని హాజమ్మ కొరుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో జోగినీ అనే మాట వినిపించనంత వరకు తన పోరాటం కొనసాగుతూనే ఉంటుందని చెబుతున్నారు.
–సమీ, మహబూబ్ నగర్, టీవీ9
Also Read:Viral Video: చేతిపై 18 గుడ్లను బ్యాలెన్స్ చేసిన యువకుడు.. శెభాష్ అంటున్న నెటిజన్లు
Russia Ukraine War: అప్పుడు అలా.. ఇప్పుడిలా.. విదేశాల్లోని భారతీయుల తీరు ఇదే..
Hyderabad: సండే రోజు ప్రశాంతత కోసం గుడికి వెళ్తే.. భక్తుడిని చితక్కొట్టిన పూజారి