Telangana: గుండెపోటుతో చీతా మృతి.. విషాదంలో కవ్వాల్ టైగర్ జోన్ అటవీ శాఖ

| Edited By: Balaraju Goud

Jul 10, 2024 | 3:21 PM

డాగ్ స్క్వాడ్ చీతా.. ఆ పేరు వింటేనే స్మగ్లర్ల గుండెల్లో వణుకు మొదలవుతుంది. గంజాయి బ్యాచ్‌ను, కలప స్మగర్లకు ముచ్చెమటలు పట్టించే సత్తా దాని‌ సొంత. జర్మనీ షెఫర్డ్ జాతికి చెందిన ప్రత్యేక శిక్షణ పొందిన శునకమే ఈ చీతా. దురదృష్టవశాత్తు విధుల్లో ఉండగా గుండెపోటుతో మృతి చెందింది.

Telangana: గుండెపోటుతో చీతా మృతి.. విషాదంలో కవ్వాల్ టైగర్ జోన్ అటవీ శాఖ
Cheetah Dog
Follow us on

డాగ్ స్క్వాడ్ చీతా.. ఆ పేరు వింటేనే స్మగ్లర్ల గుండెల్లో వణుకు మొదలవుతుంది. గంజాయి బ్యాచ్‌ను, కలప స్మగర్లకు ముచ్చెమటలు పట్టించే సత్తా దాని‌ సొంత. జర్మనీ షెఫర్డ్ జాతికి చెందిన ప్రత్యేక శిక్షణ పొందిన శునకమే ఈ చీతా. దురదృష్టవశాత్తు విధుల్లో ఉండగా గుండెపోటుతో మృతి చెందింది. అటవీశాఖ అధికారులకు ఆరేళ్లు సేవలందించిన చీతా మృతితో కవ్వాల్ టైగర్ జోన్ అటవీశాఖ విషాదంలో మునిగిపోయింది. అధికార లాంచనాలతో చీతాకు సాంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించారు అటవీ సిబ్బంది.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల పులుల అభయారణ్యంలో అక్రమార్కుల భరతం పట్టేందుకు ఓ శునకాన్ని పెంచుతున్నారు అటవీ శాఖ అధికారులు. మంచిర్యాల జిల్లా జన్నారం డివిజన్ కు 2018 డిసెంబర్ 15న మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్‌లో ప్రత్యేక శిక్షణ పొందిన శునకాన్ని తీసుకువచ్చారు. స్థానిక అటవీ బీట్ అధికారులు శ్రీగాద శ్రీనివాస్, జాడి సత్యనారాయణ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జర్మనీ షెఫర్డ్ చీతా (కుక్క)ను ఇక్కడికి తీసుకొచ్చారు.

ఆ చీతా ప్రత్యేక చొరవతో ఉమ్మడి జిల్లాలోని అడవుల్లో వన్యప్రాణులను, చిరుతపులను వేటాడిన వేటగాళ్ళను పట్టుకుంది. కలప స్మగ్లర్లను కూడా ఆ శునకం ఎంతో చాకచక్యంగా గుర్తించగలిగింది. ఐదేళ్ల క్రితం జన్నారం డివిజన్‌లోని బొమ్మెనలో ఓ దుప్పిని వేటాడిన వేటగాళ్ళను పసిగట్టి చాకచక్యంగా పట్టుకోవడంతో దాని సత్తా బాహ్య ప్రపంచానికి తెలిసింది. ఈ సంఘటన అప్పుడు ఉమ్మడి జిల్లాలో సంచలనం రేపింది. ఆ తర్వాత లింగాపూర్ మండలంలోని మామిడిపెళ్లిలో చిరుతపులిని చంపిన వేటగాళ్ళను నిజామాబాద్ లో పసిగట్టి పట్టుకుంది.

మంచిర్యాలలోని ర్యాలీగడ్ పూర్ లో ఓ చిరుతపులిని చంపి, గోళ్లను ఎత్తుకెళ్ళిన వేటగాళ్లను పసిగట్టి పట్టుకుంది. అక్కడితో చీతా ఆగలేదు‌ గంజాయి బ్యాచ్ కు వెన్నులో వణుకుపుట్టించింది. చీతా రంగంలోకి దిగిందంటే చాలు, ఇక తమ బండారం బయటపడక తప్పదు. నిందితులుగా మారక తప్పద, తమంతట తాము లొంగిపోయిన నిందితులు కూడా ఉన్నారంటే చీతా పనితనం అర్థం చేసుకోవచ్చు. కానీ ‌దురదృష్టవశాత్తు విధుల్లో అకాల మరణం పొందింది చీతా.

చీతా సోమవారం మృతి చెందింది. వెటర్నరీ డాక్టర్ పోస్టుమార్టం నిర్వహించి గుండె పోటుతో మృతి చెందిందని ప్రాథమికంగా తేల్చారు. చీతా షాంపిల్స్ ను ల్యాబ్ కు తరలించారు. స్థానిక అటవీ శాఖ సంప్రదాయ పద్ధతిలో చీతా అంత్యక్రియలను నిర్వహించింది. ఈ అంత్యక్రియల్లో తాళ్ళపేట, జన్నారం ఇంచార్జ్ రేంజ్ ఆఫీసర్, ఇందన్ పెల్లి రేంజ్ అధికారులు పాల్గొన్నారు. కేర్ టేకర్లుగా చీతాతో విధులు నిర్వహించిన శ్రీగాద శ్రీనివాస్, జాడి సత్యనారాయణలు కుటుంబ సభ్యున్ని కోల్పోయామంటూ కన్నీరుమున్నీరయ్యారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..