Siddharth Shukla: నటుడు సిద్ధార్థ్ శుక్లా గుండెపోటుతో మరణించారు. అకస్మాత్తుగా వచ్చిన ఈ వార్తను ఎవరూ నమ్మలేకపోయారు. దీనికి కారణం సిద్ధార్థ్ శుక్లా వయసు. అలాగే..ఫిట్ బాడీ, హ్యాపీ లైఫ్.. కానీ, 40 ఏళ్ల వయసులోనే గుండెపోటు సిద్ధార్ద్ ను మరణానికి నెట్టేసింది. భారతదేశంలో చిన్న వయస్సులోనే గుండెపోటు చాలా సాధారణం అవుతోంది. అంటే ప్రపంచంలో మిగిలిన దేశాల ప్రజల కంటే 8-10 సంవత్సరాల ముందుగానే భారతీయులలో గుండెపోటు వస్తుంది. ఇప్పుడు ఈ యువనటుడి అకస్మిక మరణం అందరిలోనూ పలు ప్రశ్నలు రేకెత్తిస్తోంది. ఫిట్ గా ఉన్నప్పటికీ.. యువకులకు ఎందుకు గుండెపోటు వస్తుంది? ఎందుకు యువత కూడా చనిపోతున్నారు? ఇవే ఆ ప్రశ్నలు. వీటికి జవాబులు నిపును ఏమి చెబుతున్నారో తెలుసుకుందాం.
గుండెపోటు అంటే ఏమిటి?
మన గుండెకు రక్త సరఫరా మూడు వైపుల నుండి వస్తుంది. శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడం వలన, గుండె సిరల్లో అడ్డంకులు రావడం మొదలవుతుంది. 40% వరకు అడ్డంకి ఎక్కువ సమస్యను కలిగించదు. ఈ అడ్డంకి 70%కంటే ఎక్కువ పెరిగినప్పుడు, గుండెకు రక్త ప్రసరణ మందగిస్తుంది. రక్తం పంపడం ఆగిపోతుంది. దీన్నే గుండెపోటు అంటారు. గుండెపోటు సమస్య ప్రధానంగా కొలెస్ట్రాల్ పెరగడం వల్ల వస్తుంది. మధుమేహం, రక్తపోటు, ఊబకాయం, అతిగా తినడం, ధూమపానం వంటి అంశాలు కొలెస్ట్రాల్‌కు కారణమవుతాయి. చాలా సందర్భాలలో ఇది జన్యుపరంగా కూడా ఉంటుంది. ఇది కాకుండా, ఊపిరితిత్తులలో గడ్డకట్టడం వలన, మెదడులో రక్తస్రావం, ఔషధాల అధిక మోతాదు కారణంగా, వైరల్ ఇన్ఫెక్షన్ లేదా గుండెలో ఏదైనా వ్యాధి కారణంగా కూడా గుండెపోటు వస్తుంది.
యువతలో గుండెపోటు..
గుండె జబ్బులు ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 17 మిలియన్ల మందిని చంపుతున్నాయి. భారతదేశంలో ప్రతి సంవత్సరం 3 మిలియన్ల మంది ప్రజలు హృదయ సంబంధ వ్యాధులతో బాధపడుతున్నారు. ఇందులో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, దేశంలో మొత్తం గుండెపోటు కేసులలో 50% 50 ఏళ్లలోపు వారు..అలాగే, 25% మంది 40 ఏళ్లలోపు వారు. ఈ చిన్న వయస్సులో గుండెపోటు రేట్లు 2000 – 2016 మధ్య ప్రతి సంవత్సరం 2% పెరిగాయి.
అకాల గుండెపోటు లక్షణాలు ఏమిటి?
ప్రస్తుతం, భారతదేశంలో గుండె జబ్బులు.. మధుమేహం అంటువ్యాధిలా తాయారు అయిందనే చెప్పాలి. యువకులు కూడా దాని బారిన పడుతున్నారు. అనేక సందర్భాల్లో, ఎలాంటి లక్షణాలు లేకుండా అకస్మాత్తుగా గుండెపోటు సంభవించి, ఆసుపత్రికి చేరుకునే లోపే మరణం సంభవించినట్లు తెలుస్తుంది. చాలా సందర్భాలలో, గుండెపోటుకు ముందు లక్షణాలు కనిపిస్తాయి. ఉదాహరణకు, ఛాతీ నొప్పి, బరువు, బిగుతు, ఆమ్లత్వం వంటి అనుభూతి, ఎడమ భుజం లేదా ఎడమ చేతిలో నొప్పి అనుభూతి, శ్వాసలోపం.
యువతలో గుండెపోటుకు కారణాలు ఏమిటి?
పొగాకు వాడకం గుండె జబ్బులకు అతి పెద్ద ప్రమాద కారకాల్లో ఒకటి. 30 నుండి 44 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులలో, 26% గుండె జబ్బులు పొగాకు వాడకం వల్ల వస్తాయి. అలాగే, పేలవమైన నిద్ర విధానాలు, ఒత్తిడి ఈ పరిస్థితిని మరింత దిగజార్చాయి. భారతదేశంలో 70 మిలియన్లకు పైగా ప్రజలు మధుమేహం కలిగి ఉన్నారు. ఇందులో చాలా మంది యువకులు కూడా ఉన్నారు. ఇది భారతీయ జనాభాలో గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది.
యువతలో గుండెపోటు నివారణ ఎలా?
జీవనశైలి మార్పులు అకాల గుండెపోటు ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తాయి. వాకింగ్, సైక్లింగ్, జాగింగ్, స్విమ్మింగ్ ద్వారా గుండెపోటు ప్రమాదాన్ని 30%వరకు తగ్గించవచ్చు. రోజూ కనీసం 10 వేల అడుగులన్నా నడవాలి.
జంక్ ఫుడ్‌కు బదులుగా, కూరగాయలు, పండ్లు, కాయలు, సోయా, తక్కువ కొవ్వు పాల ఉత్పత్తులు కలిగిన ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినండి. ఫాస్ట్ ఫుడ్, చిప్స్, బిస్కెట్లు మొదలైన వాటిలో ట్రాన్స్‌ఫాటీ ఆమ్లాలను ఉపయోగిస్తారు, కాబట్టి వాటిని నివారించాలి.
పొగాకు, మద్యం సేవించరాదు. సమయ నిర్వహణ నేర్చుకోవాలి. ఈ రోజుల్లో ప్రజలు ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌లపై ఎక్కువ సమయం గడుపుతున్నారు. కాబట్టి గుండె ఆరోగ్యానికి యోగా, వ్యాయామం చాలా ముఖ్యం. ఇది కాకుండా, ముందు జాగ్రత్త చాలా ముఖ్యం. యువకులు తమ గుండెను క్రమం తప్పకుండా తనిఖీ చేసుకోవాలి, తద్వారా అడ్డంకులు సకాలంలో గుర్తించడానికి అవకాశం ఉంటుంది.
Also Read: Covid 10-Kids: పొంచివున్న థర్డ్ వేవ్ ముప్పు.. మీ ఇంట్లో పిల్లలుంటే ఈ జాగ్రత్తలు తప్పక పాటించండి..
Skin Care: గర్భధారణ తరువాత చర్మ సమస్యలతో బాధపడుతున్నారా? అయితే, ఈ చిట్కాలు పాటించండి..