Who lives longer, an Indian or a Chinese? Here’s the answer: ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశాల్లో చైనా, భారతదేశం మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. ప్రపంచ జనాభాలో 40 శాతం మంది ఈ రెండు దేశాల్లోనే నివసిస్తున్నారు. పక్కపక్కనే ఉన్న ఈ పొరుగు దేశాల ఆయుర్ధాయంలో 8 ఏళ్ల తేడా ఉందని తాజా పరిశోధనల్లో వెల్లడైంది. చైనా ప్రజలు 77 ఏళ్లకు పైగా జీవిస్తుండగా, భారతీయుల సగటు ఆయుర్ధాయం 70 ఏళ్ల కంటే తక్కువ ఉన్నట్లు పరిశోధకులు వెల్లడించారు. చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ (NHC) మంగళవారం (జులై 5)న విడుదల చేసిన నివేదిక ప్రకారం.. చైనా పౌరుల సగటు వయస్సు 77.93కి పెరిగింది. అంటే అక్కడి ప్రజలు సగటున 77 ఏళ్ల 9 నెలలు జీవిస్తున్నారు.1949లో అక్కడ కమ్యూనిస్టు పార్టీ పాలన ప్రారంభమైనప్పుడు చైనా ప్రజల సగటు ఆయుర్ధాయం 35 ఏళ్లు ఉండగా.. అప్పట్లో భారతీయుల సగటు ఆయుర్ధాయం 32 యేళ్లు ఉంది. ఇటీవల చేపట్టిన పరిశోధనల్లో భారతీయుల కంటే చైనా ప్రజలు 8 ఏళ్లు ఎక్కువ కాలం జీవిస్తున్నట్లు బయటపడింది. అందుకు గల కారణాలను ఎన్‌హెచ్‌సీ డైరెక్టర్ మావో కునాన్ ఈ విధంగా తెలిపాడు.
చైనా కంటే మన ఆయుర్ధాయం మరీ ఇంత తక్కువా? కారణాలేంటంటే..
చైనా ప్రజలు తమ ఆరోగ్యంపై మరింత శ్రద్ధ కనబరుస్తున్నారని, మంచి ఆహారం తినడం, ఫిట్‌నెస్, మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతున్నారని ఆయన అన్నారు. చైనా పౌరుల్లో గుండె, మెదడుకు సంబంధించిన వ్యాధులు, క్యాన్సర్, మధుమేహం వంటి వ్యాధులు అదుపులో ఉన్నట్లు మావో కునాన్ తెలిపారు.2020 జనాభా లెక్కల ప్రకారం 37.2% మంది క్రమం తప్పకుండా శారీరక వ్యాయామం చేస్తున్నట్లు మావో పేర్కొన్నారు. ఇది 2014 కంటే 3% ఎక్కువ. గతంలో కంటే చైనాలో వ్యాయామ సౌకర్యాలు పెరిగాయని, ఒక వ్యక్తికి వ్యాయామం చేయడానికి దాదాపు రెండున్నర చదరపు మీటర్ల స్థలం ఉంటుందని, 2025 నాటికి సగటు వయస్సు 78.3 ఏళ్లకు చేరుకోవడే లక్ష్యంగా ఉన్నట్లు మావో అన్నారు. అంతేకాకుండా 2025 నాటికి చైనాలో వృద్ధుల కోసం వృద్ధాశ్రమాల్లో కోటి పడకలు తయారు చేయనున్నారు. పట్టణ ప్రాంతాలు, నివాస కమ్యూనిటీల్లో వృద్ధులకు ఆరోగ్య సౌకర్యాలు, 95% వృద్ధులకు జీవిత బీమా అందించనుందట. వీటన్నింటితో పాటు ప్రతి వ్యక్తికి ఆటల సౌకర్యాల కోసం 2.6 చదరపు మీటర్ల స్థలాన్ని అందించాలని కూడా అక్కడి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందట.
మన దేశంలో ఆయుక్షీణం ఎందుకు ఈ స్థాయిలో ఉంది?
మన దేశ జనాభాకు సరిపడినంత మంది వైద్యులు లేరు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. మన దేశంలో ప్రతి 10,000ల మందికి 11.7 మంది వైద్యులు ఉన్నారు. ఐతే చైనాలో ప్రతి 10,000ల మంది జనాభాకు 22 మందికి పైగా వైద్యులు ఉన్నారని ప్రపంచ బ్యాంకు గణాంకాలు చెబుతున్నాయి.
సైన్స్ జర్నల్ లాన్సెట్ 2018 అధ్యయనం ప్రకారం.. భారతదేశంలో తగినన్ని ఆరోగ్య సౌకర్యాలు అందుబాటులో లేవు. హెల్త్‌కేర్ యాక్సెస్ అండ్ క్వాలిటీ ఇండెక్స్‌లో 195 దేశాల్లో భారత్ 145వ స్థానంలో ఉండగా, చైనా 48వ స్థానంలో ఉంది. ఈ జాబితాలో శ్రీలంక (71), బంగ్లాదేశ్ (133), భూటాన్ (134) ఆ తర్వాత స్థానంలో భారత్ ఉంది. ఆరోగ్యంపై మన ప్రభుత్వ వ్యయం కూడా చాలా తక్కువగా ఉందని అధ్యయనాలు తెల్పుతున్నాయి. దేశ GDPలో ఆరోగ్యంపై కేవలం 2.1% మాత్రమే ఖర్చు చేస్తుంది. ఇందుకు వ్యతిరేకంగా చైనా 7% కంటే ఎక్కువ ఖర్చు చేస్తుంది. నేషనల్ హెల్త్ ప్రొఫైల్ 2020 ప్రకారం.. 2017-18లో దేశంలోని ప్రతి వ్యక్తి ఆరోగ్యంపై ఒక ఏడాదిలో ప్రభుత్వం చేసిన ఖర్చు రూ.1,657 మాత్రమే. అంటే రోజుకు 5 రూపాయల లోపేనన్నమాట.
భారతీయులు చైనీయుల కంటే మరింత సోమరితనంగా ఉండటం కూడా ఒక కారణమని 2017లో స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయ అధ్యయనాలు తెల్పుతున్నాయి. వీరి డేటా ప్రకారం భారతీయులు ప్రతిరోజూ సగటున 4,297 అడుగులు నడుస్తుండగా, చైనీయులు మాత్రం ప్రతిరోజు 6,880 అడుగులు నడుస్తున్నట్లు తెలిపారు. ఎక్కువసేపు కూర్చోవడం, తక్కువగా నడవడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే అకాల మరణాలకు దారితీస్తున్నట్లు వీరి గణాంకాలు తెలిపాయి.
మన దాయాది దేశంలో జనాభా ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్నా.. అక్కడి ప్రభుత్వ విధానాలు, ప్రజల జీవన శైలి వారి ఆయుర్ధాయాన్ని పెంచుకుంటున్నాయి. మన దేశ పరిస్థితి ఎప్పటికి మెరుగవుతుందో..?