సెలబ్రిటీలే కాదు.. సామాన్యులు సైతం.. చిన్న వయస్సులోనే.. గుండెపోటుకు బలైపోతున్నారు. బాడీ బిల్డింగ్‌లో ఆరితేరిన వాళ్లలో ఎందరో… అర్ధాంతరంగా చనిపోయిన సందర్భాలున్నాయి. భారత్ యువతను గుండెపోటు టెన్షన్ పెడుతోంది. గుండెపోటు, కార్డియాక్ అరెస్టు వంటి ఆరోగ్య అత్యవసరపస్థితులు అనుకోకుండా దాడి చేస్తాయి. మనిషిని అపస్మారక స్థితిలోకి తీసుకెళ్తాయి. అలాంటప్పుడు రోగికి ప్రాథమిక చికిత్స అవసరం పడుతుంది. లేకుంటే కొన్ని నిమిషాల్లోనే మరణం సంభవించడం ఖాయం. అలాంటి ప్రాథమిక చికిత్సలో ప్రధానమైనది కార్డియో పల్మోనరీ రిససిటేషన్-CPR..ఆగిపోయిన గుండెను మళ్లీ బతికించే ప్రయత్నం చేయడమే సీపీఆర్.
మొన్న జింఖానా మైదానంలో భారత్- ఆసీస్ మ్యాచ్ టిక్కెట్ల కోసం ఒక్కసారిగా క్రికెట్ ఫ్యాన్స్ ఎగబడటంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ తొక్కిసలాటలో రజిత అనే మహిళ అపస్మారక స్థితికి చేరుకోగా, అక్కడే ఉన్న లేడి కానిస్టేబుల్ నవీన సమయస్ఫూర్తితో వ్యవహరించి.. సీపీఆర్ చేసి..ప్రాణాపాయస్థితి నుంచి కాపాడారు. క్షణాల వ్యవధిలోనే అపస్మారక స్థితిలో ఉన్న మహిళ గుండెపై ప్రెస్ చేస్తూ ఆమెకు సీపీఆర్ అందిస్తూ ప్రాణపాయ స్థితి నుంచి బయటకు తెచ్చారు. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించి.. ఆమె ప్రాణాలు కాపాడారు. తాజాగా తమిళనాడులో మరో ఘటన జరిగింది. చెన్నై విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడికి ఉన్నట్టుండి గుండెపోటు రావడంతో.. అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. దీంతో క్షణం కూడా ఆలస్యం చేయకుండా అక్కడే భద్రతా విధుల్లో ఉన్న సీఐఎస్‌ఎఫ్ జవాన్లు.. సీపీఆర్ చేసి అతడి ప్రాణాలు కాపాడారు. అతడి పల్స్ రేటు మెరుగు కావడంతో మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రికి తరలించారు. గుండెపోటుతో కుప్పకూలిన వ్యక్తికి సకాలంలో సీపీఆర్ చేసి అతడి ప్రాణాల్ని కాపాడారు జవాన్లు.
భారతదేశంలో చిన్న వయస్సులోనే గుండెపోటు చాలా సాధారణం అవుతోంది. సంపూర్ణ ఆరోగ్యంగా ఉండే.. యువకులు సైతం.. గుండెపోటుతో మరణించడం.. అందరిలోనూ.. ఎన్నో ప్రశ్నలు లేవనెత్తేలా చేస్తున్నాయి. ఫిట్‌గా ఉన్నప్పటికీ.. యువకులకు ఎందుకు గుండెపోటు వస్తోంది..? ఎందుకు యువత కూడా చనిపోతున్నారు..? ఈ ప్రశ్నలే.. కలవరం రేపుతున్నాయి. అయితే.. గుండెపోటు వచ్చిన వ్యక్తికి వెంటనే.. సీపీఆర్ చేస్తే.. ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువ..!! అందుకే సీపీఆర్‌పై ప్రతీఒక్కరూ అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. కార్డియోపల్మనరీ రీససిటేషన్‌ను షార్ట్‌గా సీపీఆర్ అంటారు. అంటే.. గుండె పనితీరు అకస్మాత్తుగా ఆగిపోయేటప్పుడు, ఆగిపోయిన వారికి వెంటనే పంప్ చేసేందుకు దోహదం చేయడం. గుండెకు పంపింగ్ చేస్తూ, అదే సమయంలో ఊపిరితిత్తులు ఫ్రెష్ ఆక్సిజన్ తీసుకునేలా చేయాలి. ఇందుకోసం పేషంట్ నోట్లో నోరు పెట్టి ఊదుతూ గాలి అందించాల్సి ఉంటుంది.
వైద్యుడు లేకపోతే వైద్య సంబంధిత వ్యక్తే సీపీఆర్ చేయాలని లేదు. సీపీఆర్ గురించి తెలిసిన, శిక్షణ తీసుకున్న వారెవరైనా చేయొచ్చు. కాకపోతే.. దీన్ని ఒక ప్రత్యేక పద్ధతిలో చేయాలి. గుండెపోటు లేదా కార్డియక్ అరెస్టుకు గురైన వ్యక్తిని నేలపై వెల్లకిలా పడుకోబెట్టాలి. రెండు చేతులతో ఛాతీ మధ్యలో బలంగా అదమాలి. అలా 30 సార్లు వరుసగా అదమాలి. మధ్యలో రెండుసార్లు నోటితో నోటిలోకి శ్వాసను ఇవ్వాలి. ఇలా ఆ వ్యక్తికి స్పృహ వచ్చేవరకు చేయాలి. పిల్లలకు మాత్రం ఛాతీ మధ్యలో ఒక చేతితోనే అదమాలి. ఇక శిశువుల విషయానికి వస్తే.. కేవలం ఛాతీ మధ్యలో రెండు వేళ్లతో మాత్రమే అదమాలి.
సీపీఆర్ చేయడం వల్ల ప్రపంచంలో చాలా మంది ప్రాణాలు నిలిచాయి. సీపీఆర్ ఆగిపోయిన శరీరభాగాలకు తిరిగి రక్తం పంపిణీ అయ్యేలా చూస్తుంది. మెదడుకు కూడా రక్త సరఫరా జరిగేలా చూస్తుంది. ఈలోపు ఆసుపత్రికి చేరుకుంటే ప్రాణాపాయం తప్పుతుంది. అందుకే.. అన్ని ఎమర్జెన్సీ సర్వీసుల్లో పనిచేస్తున్న వారికి సీపీఆర్‌పై శిక్షణ ఇవ్వాలి. ప్రజల్లో దీనిపై అవగాహన తీసుకువాల్సిన అవసరం ఉంది. గుండెపోటు.. ప్రస్తుతం భారతీయ యువతను టెన్షన్ పెడుతున్న వ్యాధి. ఉరుకుల పరుగుల జీవితంలో తీరిక లేకుండా గడుపుతున్న జీవైనశైలి యువ హృదయాల్లో చిచ్చుపెడుతోంది. పట్టుమని పాతికేళ్లు కూడా లేనివారు సైతం గుండెపోటుతో చనిపోతున్నారు. అస్తవ్యస్తమైన జీవనశైలితో పాటు వృత్తిపరమైన వ్యక్తిగతమైన టెన్షన్లు.. కాస్త కూడా శారీరక శ్రమ లేకపోవడం.. పొగతాగడం మద్యం సేవించడం జంక్ఫుడ్ కొలెస్ట్రాల్ షుగర్ వంటివి గుండెపోటుకు దారి తీస్తున్నాయి.
ఆర్థిక జీవనశైలితో పాటు… ఒత్తిడి కారణంగా చిన్న వయసులోనే గుండెపోటు తలెత్తడం వంటివి జరుగుతున్నాయని హెచ్చరిస్తున్నారు వైద్యులు. శారీరక దాడృత్యంతో పాటు మానసిక ప్రశాంతత కూడా ఎంతో ముఖ్యమని సూచిస్తున్నారు.
మరిన్ని హెల్త్ టిప్స్ కోసం క్లిక్ చేయండి