
కెప్టెన్ విజయ కాంత్ ఆరోగ్యంపై గత కొన్ని రోజులుగా వదంతులు వస్తున్నాయి. ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నప్పుడే రకరకాల కథనాలు, వార్తలు ప్రసారమయ్యాయి. వీటిని చూసి విజయ కాంత్ కుటుంబ సభ్యులు, అభిమానులు తల్లడిల్లిపోయారు. అయితే అవన్నీ వట్టి పుకార్లేనని కెప్టెన్ సతీమణి ప్రేమలతా విజయ్ కాంత్ కొట్టి పారేశారు. ఆయన క్షేమంగా ఉన్నారని కొన్ని ఫొటోలు షేర్ చేసుకోవడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అలాగే డీఎండీకే అధినేత ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని సతీమణి ప్రకటన విడుదల చేయడంతో ఫ్యాన్స్, పార్టీ కార్యకర్తలు ఫుల్ ఖుషి అయ్యారు. ఈ నేపథ్యంలో చాలా రోజుల తర్వాత బయటకు వచ్చారు విజయ కాంత్. డీఎండీకే పార్టీ జనరల్ కమిటీ సమావేశంలో కెప్టెన్ పాల్గొన్నారు. అయితే అక్కడ విజయ్ కాంత్ ను చూసి అభిమానులు డీఎండీకే కార్యకర్తలు షాక్ అయ్యారు. కెప్టెన్ ఆరోగ్య పరిస్థితిని చాలా మంది కన్నీళ్లు పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఇందులో కెప్టెన్ విజయ్ కాంత్ కనీసం నిలబడే స్థితిలో కూడా లేరు. కేవలం కుర్చీకే పరిమితమయ్యారు. ఒకానొక సందర్భంలో చేతులు కూడా పైకి ఎత్తలేని స్థితిలో కనిపించారు. పక్కనున్న అభిమానులు, కార్యకర్తలే కెప్టెన్ రెండు చేతులు పైకెత్తితే కానీ విక్టరీ సింబర్ చూపించలేకపోయారు. ఈ దృశ్యాలను చూసి అభిమానులు, డీఎండీకే కార్యకర్తలు తట్టుకోలేకపోయారు. దందడుకు మారుపేరైన కెప్టెన్ విజయ కాంత్ ను ఇలాంటి స్థితిలో చూడలేకపోతున్నామంటూ అందరూ కన్నీటి పర్యంతమయ్యారు. కాగా ఈ సమావేశంలో డీఎండీకే పార్టీ అభివృద్ధికి సంబందించిన విషయాలను చర్చించారు. అలాగే 15 తీర్మానాలను ఆమోదించారు. అందులో విజయకాంత్ ఆరోగ్యంపై వదంతులు ప్రచారం చేస్తున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.