
మగాళ్లు ఒట్టి మాయగాళ్లు పాట పాడేటప్పుడు తనకు కలిగే భయాన్ని గీతా మాధురి సరదాగా వెల్లడించారు. ఈ పాట పాడుతున్నప్పుడు పురుషుల హక్కుల కార్యకర్తలు ఎవరైనా వచ్చి తనను నిందించే అవకాశం ఉందని, అప్పుడు ఈ పాట నేను రాయలేదు, ఒక అబ్బాయి రాశాడు, మరొక అబ్బాయి కంపోజ్ చేశాడు అని చెప్పాల్సి వస్తుందని నవ్వుతూ అన్నారు. మగవాళ్లను ఉద్దేశించి ఎప్పుడూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం నాకు ఇష్టం ఉండదు. ఆడవాళ్లను తక్కువ చేసి మాట్లాడాలంటే ఎలా భయం వేస్తుందో, ఈ పాట పాడాలంటే కూడా అలాగే భయం వేస్తుంది అని ఆమె చెప్పుకొచ్చారు. ఈ పాట పట్ల తనకు ఒకరకమైన అభద్రతా భావం ఉంటుందని ఆమె అన్నారు. మగాళ్లు పాట కాకుండా తనకు బాగా నచ్చిన, మనసుకు హత్తుకున్న పాటల గురించి మాట్లాడుతూ, “బాహుబలి” చిత్రంలోని “జీవనది” పాట తనకు చాలా ఇష్టమని తెలిపారు. అలాగే, “మనసారా” చిత్రంలోని ఒక పాటలోని సాహిత్యం తనను ఎంతగానో ప్రభావితం చేసిందని చెప్పారు. “ఉంగరాల జుట్టే లేదా, రంగు కాస్త తక్కువ ఉన్నా పర్లేదు. మసిలాగా ఉంటుందని తిడతావా రాతిరిని, తనలోనే కనలేమా మెరిసేటి సొగసులని. అందంగా లేవు అని నిన్నెవరూ చూడరని, నీకెవ్వరు చెప్పారు? ఎంత మంచి మనసో నీది, దాని కన్నా గొప్పది లేదు. నల్లగా ఉన్నానని కోకిల కొమ్మల్లో దాగుండిపోదు” అనే ఈ పాటలోని పంక్తులు వర్ణ వివక్షకు వ్యతిరేకంగా అద్భుతమైన సందేశాన్ని ఇస్తాయని ఆమె అన్నారు.
ఎవరైనా రంగు గురించి నెగటివ్ కామెంట్స్ చేసినప్పుడు, ఈ పాటను వినిపించాలని తనకు అనిపిస్తుందని గీతా మాధురి చెప్పారు. డార్క్ స్కిన్ ఉన్నవారు తరచుగా తామే తమ రంగును నిందించుకుంటారని, ఇతరులు ఆ పరిస్థితిని ఎదుర్కోకూడదని అనుకుంటారని ఆమె అభిప్రాయపడ్డారు. “రంగు ముఖ్యం కాదు, మంచి మనసు ముఖ్యం” అనే ఆలోచన సమాజంలోకి వెళ్లాలని ఆమె ఆకాంక్షించారు. తన భర్త నందుతో ప్రేమకథ గురించి మాట్లాడుతూ, తమ రిలేషన్ మర్యాదపూర్వకంగా “మీరు” అని పిలుచుకోవడంతో ప్రారంభమైందని తెలిపారు. పెళ్లి ఫిక్స్ అయ్యే వరకు కూడా “మీరు” అనే సంబోధించుకున్నామని, ఆ తర్వాత అది “ఒరే” ఆపై “బుజ్జి”గా మారిందని వివరించారు. చాలా నెమ్మదిగా, అంచెలంచెలుగా తమ బంధం బలపడిందని, అదే తమ బంధంలో ఉన్న ప్రత్యేకత అని అన్నారు.
పిల్లల పెంపకం, కెరీర్ బ్యాలెన్సింగ్ గురించి మాట్లాడుతూ, తన తల్లి, అత్తగారు, ఆడపడుచు నుంచి తనకు లభించే మద్దతు ఎంతో కీలకమని గీతా మాధురి స్పష్టం చేశారు. వారి పూర్తి సహకారం వల్లే తాను బయటకి వచ్చి పని చేసుకోగలుగుతున్నానని, లేకపోతే పిల్లలను చూసుకుంటూ ఇంట్లోనే ఉండాల్సి వచ్చేదని తెలిపారు. పిల్లలు తల్లిదండ్రుల ప్రతిబింబాలనే మాటను అంగీకరిస్తూనే, వారికి సొంత వ్యక్తిత్వం ఉంటుందని అన్నారు. వారికి పేరెంట్స్‌గా తాను నేర్పించాలనుకున్నది “ఓపిక” అలాగే “వైఫల్యాలను ఎలా ఎదుర్కోవాలి” అన్నది అని ఆమె అన్నారు. ఈ రెండు విషయాలపైనే తనకు ఎక్కువ భయం ఉందని, అందుకే వీటిని పిల్లలకు అలవాటు చేయడానికి నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటానని గీతా మాధురి అన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి