
సినీ తారల ఫొటోలు, వీడియోలు, వాయిస్ ఉపయోగించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో డీప్‌ఫేక్‌లు, మార్ఫింగ్ కంటెంట్ రూపొందించడం ఇటీవల పెద్ద సమస్యగా మారింది. ముఖ్యంగా సెలబ్రిటీలకు సంబంధించిన నకిలీ ఫొటోలు, వీడియోలు, ఆడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో స్టార్ హీరోయిన్ సమంత దాఖలు చేసిన పిటిషన్‌పై బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సమంత అనుమతి లేకుండా ఆమె పేరు, ఫొటోలు, లుక్ , గొంతును ఉపయోగించి రూపొందించిన కంటెంట్‌పై కోర్టు మధ్యంతర రక్షణ కల్పించింది. AI ప్లాట్‌ఫారమ్‌లు, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా సంస్థలు, ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో తన ఫోటోలను పర్మిషన్ లేకుండా ఉపయోగిస్తున్నారంటూ సమంత కోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన జస్టిస్ మాధవ్ జామ్దార్ ధర్మాసనం.. అభ్యంతరకరమైన, పర్మిషన్ లేని కంటెంట్‌ను తొలగించాలని సంబంధిత సంస్థలను ఆదేశించింది.
తన పేరు, ఇమేజ్, వాయిస్, వ్యక్తిత్వాన్ని తన అనుమతి లేకుండా AI ద్వారా కంటెంట్‌లో ఉపయోగిస్తున్నారని సమంత తన పిటిషన్‌లో పేర్కొన్నారు. మార్ఫింగ్ చేసిన ఫొటోలు, డీప్‌ఫేక్ వీడియోలు, ఆడియో క్లిప్‌లు, ఇతర డిజిటల్ కంటెంట్ ద్వారా తన వ్యక్తిత్వ హక్కులు, గోప్యతకు భంగం కలుగుతోందని ఆమె పిటీషన్ లో తెలిపారు. అంతేకాదు.. తన గుర్తింపును ఉపయోగించి యాడ్స్ చేసి ప్రమోషన్ చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని, దీనివల్ల తన ప్రతిష్ఠ, గుడ్‌విల్‌పై ప్రభావం పడే అవకాశం ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు సమంత. ఈ కేసులో గుర్తింపు లేని వ్యక్తులు, టెక్నాలజీ సంస్థలు, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు, AI డెవలపర్లు, ఈ-కామర్స్ సంస్థలను ప్రస్తావించారు.
విచారణ సందర్భంగా సమంత వ్యక్తిత్వ హక్కులు, పబ్లిసిటీ హక్కులు, గోప్యతకు సంబంధించిన అంశాలను కోర్టు పరిశీలించింది. సమంతకు సంబంధించిన మార్ఫ్డ్, డీప్‌ఫేక్, అభ్యంతరకరమైన కంటెంట్‌ను తొలగించడంతో పాటు భవిష్యత్తులో ఆమె పేరు, ఫొటో, వాయిస్ ను పర్మిషన్ లేకుండా ఉపయోగించకుండా మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. అలాగే AI ఉపయోగించి ఒక వ్యక్తి గుర్తింపును మార్చడం లేదా రూపం, గొంతును అనుమతి లేకుండా వినియోగించడం వల్ల తీవ్రమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, ఇలాంటి కంటెంట్‌పై ఫిర్యాదులు వచ్చినప్పుడు సోషల్ మీడియా, ఆన్‌లైన్ మీడియటింగ్ సంస్థలు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ఉందని కోర్టు పేర్కొంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.