నెల రోజుల క్రితం హైదరాబాద్ సిటీ చిరంజీవి యువత అధ్యక్షులు నూర్ మహ్మద్ గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే.
ఆ వార్త తెలిసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి సికింద్రాబాద్లోని వారి ఇంటికి స్వయంగా వెళ్ళి కుటుంబ సభ్యులను ఓదార్చి వచ్చారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నూర్ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి వచ్చారు. అప్పుడు విదేశాలలో ఉన్న రామ్చరణ్ తను హైదరాబాద్ రాగానే నూర్ మహ్మద్ కుటుంబాన్ని కలుస్తానని, ఆ కుటుంబాన్ని ఆదుకుంటానని మాట ఇచ్చారు. కాగా ఈ రోజు (ఆదివారం) ఉదయం నూర్ మహ్మద్ కుటుంబ సభ్యులకు రామ్ చరణ్ 10లక్షల రూపాయల చెక్కు అందజేశారు. ఈ సహాయం మరువలేనిదని, ఎన్నటికీ రుణపడి ఉంటామని వారు రామ్చరణ్కు తెలిపారు.
‘నూర్ మహ్మద్ తమ కుటుంబం పేరుతో చేసిన సేవలు ఎనలేనివి. ముఖ్యంగా ఆయన చేసే కార్యక్రమాలు మేము చూడాలని, మాకు తెలియాలని ఎప్పుడు కోరుకోకుండా మా పుట్టినరోజులకు, సినిమా ఫంక్షన్లకు అనేక సేవా కార్యక్రమాలు చేశారు’ అని రామ్ చరణ్ అన్నారు. దాదాపు 45 నిముషాలు నూర్ మహ్మద్ కుటుంబంతో చెర్రీ గడిపారు. ఆయన చేసిన సేవలను రామ్ చరణ్ విశేషంగా కొనియాడారు. నూర్ మహ్మద్ గారిని తిరిగి తీసుకొని రాలేనని, కానీ వారి ఇంటికి పెద్ద కొడుకులా అండగా ఉంటానని తెలిపారు. అదే విధంగా నూర్ మహ్మద్ కుమారుడికి మంచి ఉద్యోగం కూడా ఇప్పిస్తానని, అమ్మాయిల పెళ్లిళ్లకు తను స్వయంగా వస్తానని ఆ కుటుంబానికి చెర్రీ భరోసా ఇచ్చారు.