Vettaiyan Movie Review: వేట్టయన్ మూవీ ఫుల్ రివ్యూ.. సూపర్ స్టార్ రజినీకాంత్ హిట్ కొట్టారా.?

| Edited By: Rajeev Rayala

Oct 10, 2024 | 2:54 PM

జైలర్ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత రజినీకాంత్ నటించిన సినిమా వేట్టయన్. కాకపోతే తెలుగు టైటిల్ పెట్టలేదని ఈ సినిమాపై ముందు నుంచి కూడా పెద్దగా అంచనాలు లేవు. పైగా జ్ఞానవేల్‌పై ఎక్స్‌పెక్టేషన్స్ కూడా లేవు. ఇలాంటి సమయంలో వేట్టయన్ రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ఎలా ఉంది..? రజినీకాంత్ మరోసారి మాయ చేసాడా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం..

Vettaiyan Movie Review: వేట్టయన్ మూవీ ఫుల్ రివ్యూ.. సూపర్ స్టార్ రజినీకాంత్ హిట్ కొట్టారా.?
Vettaiyan
Follow us on

మూవీ రివ్యూ: వేట్టయన్

నటీనటులు: రజినీకాంత్, అమితాబ్ బచ్చన్, మంజు వారియర్, రితికా సింగ్, ఫహాద్ ఫాజిల్, కిషోర్, రానా దగ్గుబాటి, దుషారా విజయన్ తదితరులు

సినిమాటోగ్రఫీ: SR కథిర్

ఎడిటర్: ఫిలోమాన్ రాజ్

కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: టిజే జ్ణానవేల్

నిర్మాత: సుభాస్కరన్

జైలర్ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత రజినీకాంత్ నటించిన సినిమా వేట్టయన్. కాకపోతే తెలుగు టైటిల్ పెట్టలేదని ఈ సినిమాపై ముందు నుంచి కూడా పెద్దగా అంచనాలు లేవు. పైగా జ్ఞానవేల్‌పై ఎక్స్‌పెక్టేషన్స్ కూడా లేవు. ఇలాంటి సమయంలో వేట్టయన్ రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ఎలా ఉంది..? రజినీకాంత్ మరోసారి మాయ చేసాడా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం..

కథ:

అథియ‌న్ (ర‌జ‌నీకాంత్‌) ఓ సన్సియర్ పోలీస్ ఆఫీసర్. క్రిమినల్స్ తప్పించుకుంటే అస్సలు తట్టుకోలేడు.. అవసరం అయితే ఎన్‌కౌంట‌ర్ చేసి న్యాయం చేయాలనుకుంటాడు. ఈ క్రమంలోనే గవర్నమెంట్ టీచర్ శరణ్య (దుషారా విజయన్)తో పరిచయం అవుతుంది. గంజాయి ముఠాకు వ్యతిరేకంగా ఆమె చేసిన పోరాటంతో ఇంప్రెస్ అవుతాడు అథియన్. ఆ అమ్మాయి సాయంతో గంజాయి ముఠా నాయ‌కుడిని ఎన్‌కౌంట‌ర్ చేస్తాడు. అయితే అది జరిగిన కొన్ని రోజులకే అతి దారుణంగా శరణ్యను రేప్ చేసి చంపేస్తాడు ఓ వ్యక్తి. ఆ కేసులో నిందితుడిని ప‌ట్టుకోవ‌డానికి ఎస్‌పీ హ‌రీష్‌కుమార్ (కిషోర్‌)తో పాటు ఏఎస్‌పీ రూపా (రితికా సింగ్‌)ల‌తో రంగంలోకి దిగుతారు. కానీ వాళ్లు ఫెయిల్ అవ్వడంతో.. సీన్‌లోకి ఎంట్రీ ఇస్తాడు అథియన్. ఆయన వచ్చిన 48 గంటల్లోనే గుణ అనే కుర్రాడిని పట్టుకుని ఎన్‌కౌంటర్ చేస్తారు. అథియ‌న్ చేసిన ఎన్‌కౌంట‌ర్‌పై సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తి స‌త్య‌దేవ్ పాండే (అమితాబ్‌ బ‌చ్చ‌న్‌) ఆధ్వ‌ర్యంలో ఓ విచార‌ణ క‌మిటీని ఏర్పాటు చేస్తారు. నిజానిజాలు తెలుసుకోకుండా అమాయకుడిని చంపారంటూ విచారణకు పిలుస్తారు. అప్పుడే తను చేసిన ఎన్‌కౌంటర్ గురించి.. అసలు శరణ్య ఎలా చనిపోయింది అనే విషయంపై రీ ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు. అసలు ఈ కేసులోకి ప్యాట్రిక్ (ఫ‌హాద్ ఫాజిల్‌), న‌ట‌రాజ్‌(రానా ద‌గ్గుబాటి) ఎలా వ‌చ్చారు అన్న‌దే అసలు కథ..

కథనం:

రజనీకాంత్ సినిమా నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం..? కాస్త స్టైల్.. కాస్త స్వాగ్.. కుదిరితే మంచి కథ.. చాలా ఏళ్ళ తర్వాత జైలర్ తో ఇది బ్యాలెన్స్ చేశాడు నెల్సన్. ఇప్పుడు జ్ఞానవేల్ దానికి మించి ఇచ్చాడు. రజీనిలోని హీరోనే చాలా మంది దర్శకులు చూశారు. కానీ చాన్నాళ్ళ తర్వాత ఆయనలోని నటుడికి పని చెప్పాడు జ్ఞానవేల్. సూపర్ స్టార్ ఇమేజ్‌కు సరిపోయే సరైన కథ రాసుకున్నాడు దర్శకుడు. మొదటి నుంచీ స్క్రీన్ ప్లే ఆకట్టుకుంటుంది. ఓ పక్క ఫ్యాన్ మూమెంట్స్ ఇస్తూనే.. మరో పక్క స్ట్రాంగ్ కంటెంట్ ఇచ్చాడు. ఫస్ట్ ఆఫ్ చాలా వేగంగా వెళ్ళిపోతుంది. మన దగ్గర జరిగిన సెన్సేషనల్ దిశ కేసు గుర్తుకొస్తుంది. అలాగే మలయాళ చిత్రం జనగణమన కూడా గుర్తొస్తుంది. సెకండాఫ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది. రజిని ఇమేజ్ కోసం కథను ఎక్కడా పక్కదారి పట్టించలేదు జ్ఞానవేల్. తను చెప్పాలనుకున్న కథలోనే మాస్ మూమెంట్స్ ఇవ్వడం గొప్ప విషయం. రజనీకాంత్, అమితాబ్ మధ్య వచ్చే సీన్స్ చాలా బాగున్నాయి. ఈ ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ఆలోచనత్మకంగా ఉంటాయి. ఫేక్ ఎన్ కౌంటర్స్‌తో పాటు.. చదువు పేరుతో జరుగుతున్న దోపిడీని కూడా ఈ సినిమాలో చూపించాడు జ్ఞానవేల్. ఈ రెండు విషయాల్ని చాలా చక్కగా బ్యాలెన్స్ చేశాడు. ఈ సినిమాలోనూ మైనస్‌లు ఉన్నాయి.. కానీ కంటెంట్‌లో పడి అవి కనుమరుగు అయిపోతాయి.

నటీనటులు:

సూపర్ స్టార్ గురించి ఏం చెప్తాం.. జస్ట్ ఆయన స్వాగ్ స్క్రీన్ మీద ఎంజాయ్ చేయడమే. చాలా రోజుల తర్వాత రజినీలోని ఎమోషనల్ యాంగిల్‌ను ఎక్కువగా టచ్ చేసాడు దర్శకుడు. అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ చాలా బాగుంది. ఆయన తప్ప ఇంకెవరూ ఆ పాత్ర చేయలేరు. ఫహాద్ ఫాజిల్ రోల్ సినిమాలో హైలైట్. ఆయన బ్యాటరీ పాత్ర నెక్ట్స్ లెవల్ అంతే. మరో కీలక పాత్రలలో దుషార విజయన్, రితిక సింగ్ చాలా బాగా నటించారు. రానా దగ్గుబాటి తన పాత్రకు న్యాయం చేశాడు. మిగిలిన వాళ్లు ఓకే..

టెక్నికల్ టీం:

రజినీకాంత్ అనేసరికి అనిరుధ్‌కు పూనకాలు వస్తాయేమో..? అందుకే వెంటనే డ్యూటీ ఎక్కేసాడు. పాటలు అంతంతమాత్రంగానే ఉన్నా.. ఆర్ఆర్ మాత్రం అదిరిపోయింది. ముఖ్యంగా హంటర్ వంటర్ సాంగ్‌ను బ్యాగ్రౌండ్ స్కోర్ కింద వాడుకున్న తీరు అదిరింది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్లేదు. ఇక నిర్మాణ విలువల గురించి చెప్పనక్కర్లేదు. దర్శకుడు జ్ఞానవేల్ గురించి చెప్పాల్సిందే. రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్ దొరికినప్పుడు..
రొటీన్ కమర్షియల్ సినిమా కాకుండా ఆయన ద్వారా సందేశం ఇవ్వాలని చూశాడు ఈయన.

పంచ్ లైన్:

ఓవరాల్‌గా వేట్టయన్.. గురి తప్పలేదు.. ఇంట్రెస్టింగ్ ఇన్వెస్టిగేషన్ డ్రామా..