
సినిమా ప్రపంచంలో బయోపిక్‌లకు ఎప్పుడూ ప్రత్యేకమైన ఆదరణ ఉంటుంది. ముఖ్యంగా తమ ప్రతిభతో చరిత్ర సృష్టించిన ప్రముఖుల జీవితాలను వెండితెరపై చూడాలని ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తుంటారు. ఈ క్రమంలో భారతీయ సంగీత ప్రపంచాన్ని తమ గాత్రంతో ఓలలాడించిన చేసిన ఇద్దరు మహోన్నత గాయనీమణుల జీవితాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఒకవైపు ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్ అధికారికంగా ప్రారంభం కాగా.. మరోవైపు గానకోకిల పి. సుశీల జీవిత కథ ఆధారంగా సినిమా రూపొందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. భారతరత్న పురస్కార గ్రహీత ఎం.ఎస్. సుబ్బులక్ష్మి జీవితాన్ని ఆధారంగా చేసుకుని రూపొందుతున్న చిత్రానికి ‘ఎంఎస్ – ఎ లెగసీ ఆన్ స్క్రీన్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా టైటిల్ రోల్ పోషిస్తున్నారు. ‘జెర్సీ’ లాంటి ఎమోషనల్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.
గీతా ఆర్ట్స్, రాక్‌లైన్ ఎంటర్టైన్మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2026 సెప్టెంబర్‌లో చెన్నైలోని మ్యూజిక్ అకాడమీలో ఘనంగా ప్రారంభించారు. ఈ వేడుకకు ప్రముఖ నటుడు కమల్ హాసన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎం.ఎస్. సుబ్బులక్ష్మి 110వ జయంతి సందర్భంగా ఈ ప్రాజెక్టును ప్రకటించడం విశేషం. నిర్మాత అల్లు అరవింద్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ సినిమా 2027 ఆగస్టు తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
సుబ్బులక్ష్మి సంగీత ప్రయాణంతో పాటు ఆమె వ్యక్తిగత జీవితం, ఎదుర్కొన్న సవాళ్లు, సాధించిన విజయాలు, చేసిన త్యాగాలను కూడా ఈ చిత్రంలో చూపించనున్నట్లు దర్శకుడు వెల్లడించారు. దీంతో ఈ బయోపిక్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే, దక్షిణ భారత సినీ సంగీత చరిత్రలో తనదైన ముద్ర వేసిన గాయని పి. సుశీల జీవితాన్ని కూడా సినిమాగా తెరకెక్కించనున్నారనే ప్రచారం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. తెలుగు, తమిళం సహా పలు భాషల్లో వేలాది పాటలు పాడి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న సుశీలమ్మ జీవితంలో ఎన్నో ఆసక్తికరమైన మలుపులు ఉన్నాయి. ఈ చిత్రంలో సుశీలమ్మ పాత్ర కోసం రుక్మిణి వసంత్ పేరును పరిశీలిస్తున్నట్లు సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ‘సప్త సాగరదాచే ఎల్లో’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ కన్నడ నటి, తన సహజమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అందుకే సుశీలమ్మ పాత్రకు ఆమె సరిపోతారని కొందరు సినీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఆమె ఎంపికపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ బయోపిక్కు సంబంధించి మరో ఆసక్తికరమైన ప్రచారం కూడా తెరపైకి వచ్చింది. ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ఆసక్తి చూపుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో సుశీలమ్మ తన జీవిత కథను సినిమాగా రూపొందించాలనే ఆకాంక్షను రెహమాన్‌తో పంచుకున్నట్లు కూడా కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ఆయన ఈ ప్రాజెక్టులో భాగస్వామి కావచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.