ఊహించిందే జరిగింది.. తెలుగు సినిమాకు అరుదైన గౌరవం దక్కింది. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ కు నామినేట్ అయ్యింది. చరిత్రలో ఎప్పుడూ.. ఎక్కడా.. కలవని ఇద్దరు వీరులను కలిపి ఫిక్షనల్ స్టోరీగా తెరకెక్కించి చరిత్ర సృష్టించారు రాజమౌళి. యంగ్ టైగర్ ను కొమురం భీమ్ గా మెగా పవర్ స్టార్ ను మన్యం దొర అల్లూరి సీతారామరాజుగా చూపించి ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు జక్కన్న. ఇటీవల అమెరికాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ అందుకున్న సంగతి తెలిసిందే. అలాగే క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్‌ను సొంతం చేసుకున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రం 95వ ఆస్కార్ అవార్డులో బరిలో పోటీపడుతుంది. బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో నాటు నాటు పాట నామినేట్ అయ్యింది.
కీరవాణి సంగీత సారథ్యంలో చంద్రబోస్ రచించిన ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ ఆలపించారు. తాజాగా ఈ పాట ఆస్కార్ నామినేషన్ లో ఉండటంతో సింగర్ రాహుల్ ఆనందం వ్యక్తం చేశారు. నామినేషన్స్ ను లైవ్ వీడియోలో వీక్షిస్తూ తన పాట పేరు రాగానే ఎంతో సంతోషించారు రాహుల్.
ఇప్పుడు దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాదాపు రూ.400 కోట్లతో నిర్మించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 1200 కోట్లకు పైగా వసూళ్లు చేసింది. ఇక ఈ సినిమాకు సిక్వెల్ తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట జక్కన్న. ఇప్పటికే ఈ సినిమా సీక్వెల్ స్క్రిప్ట్ స్టార్ చేశారని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ విదేశాల్లో ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్న జక్కన్న.. త్వరలోనే సూపర్ స్టార్ మహేష్ బాబుతో తన తదుపరి ప్రాజెక్ట్ ప్రారంభించనున్నారు.