AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manchu Manoj: నేను ఓ ప్రేమ జంటకు దగ్గరుండి పెళ్లి చేశా.. అప్పుడే ఆ హీరో గ్యాంగ్ అమ్మాయిని తీసుకెళ్లిపోయి..

టాలీవుడ్ రాక్ స్టార్ మంచు మనోజ్ రీ ఎంట్రీలో అదరగొడుతున్నాడు. హీరోగానే కాకుండా విలన్ గానూ మెప్పిస్తున్నాడు.తాజాగా ఈ హీరో యాంకర్ గానూ అవతారమెత్తాడు. సర్దార్ ప్రమోషన్స్ లో భాగంగా హీరో కార్తీ, విలన్ ఎస్ జే సూర్యలను ఇంటర్వ్యూ చేశాడు.

Manchu Manoj: నేను ఓ ప్రేమ జంటకు దగ్గరుండి పెళ్లి చేశా.. అప్పుడే ఆ హీరో గ్యాంగ్ అమ్మాయిని తీసుకెళ్లిపోయి..
Manchu Manoj
Basha Shek
|

Updated on: Sep 09, 2026 | 8:48 PM

Share

టాలీవుడ్ రాక్ స్టార్ మంచు మనోజ్ రీఎంట్రీలో వరుసగా సినిమాలు చేస్తున్నాడు. కేవలం హీరోగానే కాకుండా విలన్ గానూ మెప్పిస్తున్నాడు. ఇప్పటికే మనోజ్ విలన్ గా చేసిన మిరాయ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న దాదాలోనూ మనోజ్ ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తోన్న ఈ స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకుంది .ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా దాదా సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా తాజాగా యాంకర్ గానూ అవతారమెత్తాడు మనోజ్. కార్తీ హీరోగా నటించిన ‘సర్దార్ 2’ సినిమా సెప్టెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తెలుగు ప్రమోషన్స్ లో టాలీవుడ్ హీరో మంచు మనోజ్ కూడా భాగమయ్యారు. ఇందులో భాగంగానే ఇటీవల కార్తీ, ఎస్.జె సూర్యలతో స్పెషల్ ఇంటర్వ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా సినిమా విషయాలతో పాటు తన పర్సనల్ లైఫ్ కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు మనోజ్ . ఇదేక్రమంలో కార్తీ సోదరుడు సూర్యతో తనకున్న అనుబంధాన్ని మంచు మనోజ్ షేర్ చేసుకున్నారు.

”నేను సూర్య అన్నని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. నేను 9వ తరగతి వరకూ చెన్నైలో చదువుకున్నా. పదో తరగతి నుంచి తిరుపతిలో చదివా. కాలేజ్ చదువులు పూర్తి చేసుకొని మళ్లీ చెన్నై వెళ్లాను. అప్పుడు చెన్నైలో నాకు తెలిసిన ఓ ప్రేమ జంటకు దగ్గరుండి పెళ్లి చేశాను. వాళ్లింట్లో పెద్దలు ఒప్పుకోకపోవడంతో నేనే పెళ్లి పెద్దగా మారి వారిద్దరినీ ఒకటి చేశాను. అయితే ఈ మ్యాటర్ కాస్తా సూర్య దగ్గరకు వెళ్లింది. అన్న గ్యాంగ్ వచ్చి ఆ అమ్మాయిని తీసుకెళ్లి పోయారు. ఆ అబ్బాయి ఏమో నా దగ్గరకు వచ్చి ఏడ్చాడు. దాంతో నేను నేరుగా సూర్య అన్న ఇంటికి వెళ్లాను. ‘హాయ్ అన్నయ్య.. ఎలా ఉన్నారు?’ అని అడిగాను. నేనెందుకు వచ్చానో అప్పటికే సూర్య అన్నకి తెలుసు. వాళ్లకి పెళ్లి చేసింది నేనే అని ఆయనకు ఆల్రెడీ తెలుసు. అయినా ఏమీ తెలియనట్లు.. ‘ఏంటి మనోజ్.. ఇలా వచ్చావ్?’ అని సూర్య అడిగారు. ‘ఆ అమ్మాయిని ఇస్తే నేను తీసుకెళ్లిపోతాను’ అని అన్నాను. ‘రేయ్.. నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతోందా?. అక్కడ ఉన్నది రెండు పెద్ద ఫ్యామిలీస్ రా. నువ్వొచ్చి పుసుక్కున ఇలా చేస్తే.. నీ వల్ల మధ్యలో నన్ను పెట్టారు. ఇప్పుడు ఆ రెండు కుటుంబాలకు నేను ఏమీ చెప్పలేకపోతున్నాను. నా మాట విని కొద్ది రోజులు ఈ విషయంలో సైలెంట్ గా ఉండరా మనోజ్. అన్నీ సర్దుకుంటాయి’ అని సూర్య అన్నారు. అన్న చెప్పినట్టే నేను కొన్నాళ్లు సైలెంట్ గా ఉన్నాను. ఆ అమ్మాయి ఎవరితో ఉండాలని కోరుకుందో, హ్యాపీగా అతనితోనే కలిపాడు. ఈరోజుకీ వాళ్లిద్దరూ సంతోషంగా కలిసి జీవిస్తున్నారు’ అని మంచు మనోజ్ చెప్పుకొచ్చారు.

కాగా తాను చేసిన ఘన కార్యాల్లో ఇదొకటని మనోజ్ చెప్పగా.. పక్కనే ఉన్న కార్తీ, ఎస్.జె సూర్య పగలబడి నవ్వారు. ప్రస్తుతం మనోజ్ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us