
వెండితెరపై హీరో హీరోయిన్లతో పాటు తమ విలక్షణ నటనతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసిన క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎందరో ఉన్నారు. ఆ కోవకు చెందిన నటుడే కుమారన్ సేతురామన్. పలు చిత్రాల్లో విలన్ మెప్పించిన ఆయన, ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలోని రమణ లోడ్ ఎత్తాలిరా..! అనే ఒక్క డైలాగ్‌తో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కుమారన్, తన సినీ ప్రయాణం, మహేష్ బాబుతో ఉన్న అనుబంధం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలోని తన డైలాగ్ రీల్స్, మీమ్స్ రూపంలో సోషల్ మీడియాలో ఎంతలా వైరల్ అయ్యిందో కుమారన్ గుర్తుచేసుకున్నారు. ఈ క్రేజ్ వల్ల ఎదురైన ఓ సరదా అనుభవాన్ని పంచుకుంటూ.. “కోవిడ్ లాక్డౌన్ సమయంలో హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్లేందుకు ఈ-పాస్ కోసం కంట్రోల్ రూమ్‌కు వెళ్లాను. అక్కడి పోలీసులు నన్ను గుర్తుపట్టి, నాతో ఆ పాపులర్ డైలాగ్ చెప్పించుకుని సెల్ఫీలు దిగారు. ఈ హడావిడిలో నాకు పర్మిషన్ రావడానికి ఏకంగా నాలుగు గంటలు పట్టింది” అని నవ్వుతూ చెప్పారు. ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే పాత్రలను ఎంచుకోవడమే తన ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
ఓ సినిమా షూటింగ్ సమయంలో మహేష్ బాబుతో కలిసి ఫైట్ సీన్లో నటిస్తుండగా తనకు జరిగిన తీవ్ర ప్రమాదం గురించి కుమారన్ భావోద్వేగంతో వివరించారు. రోప్ సరిగ్గా లాగకపోవడం వల్ల తన కాలికి తీవ్ర గాయమైందని, ఆ సమయంలో మహేష్ బాబు వెంటనే స్పందించి తనను అపోలో ఆసుపత్రికి తరలించారని తెలిపారు. అంతేకాకుండా, చీఫ్ ఆర్థోపెడిక్ డాక్టర్‌తో మహేష్ స్వయంగా మాట్లాడి మెరుగైన చికిత్స అందించేలా చూశారని పేర్కొన్నారు. మహేష్ బాబు గారి సహాయ గుణాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. ఆయన నాకు దేవుడితో సమానం. ఆయన సమయానికి స్పందించబట్టే నేను ఈరోజు ఇలా నడవగలుగుతున్నాను అని కుమారన్ కృతజ్ఞతలు తెలిపారు.
ఆ ప్రమాదం తర్వాత వైద్యులు ఆరు నెలల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించినప్పటికీ, కుమారన్ తన పట్టుదలతో అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. ఇంటి వద్దే ఫిజియోథెరపీ యంత్రాల సాయంతో రోజుకు ఎనిమిది గంటల పాటు కఠోర సాధన చేసి, కేవలం 20 రోజుల్లోనే పూర్తిగా కోలుకున్నారు. తిరిగి సెట్స్‌లోకి అడుగుపెట్టి మిగిలిన ఫైట్ సన్నివేశాలను పూర్తి చేయడం చూసి స్వయంగా మహేష్ బాబు కూడా ఆశ్చర్యపోయారని కుమారన్ గర్వంగా చెప్పారు. ఇక భవిష్యత్ ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ, మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవాలని, ఆయన సినిమాలో నటించాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు కుమారన్ సేతురామన్ తన మనసులోని మాటను బయటపెట్టారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి