
ఒకే సినిమాతో గొప్ప పేరు సంపాదించుకున్న ఒక నటి కొద్ది రోజుల్లోనే ఆమె జీవితం తలకిందులు అయ్యింది. ఒకే ఒక్క ప్రమాదం ఆమె మొత్తం సినీ కెరీర్‌ను ముగించింది. తన జీవితంలో తీవ్రమైన పోరాటాన్ని ఎదుర్కొన్న ఒక నటి గురించి మీకు తెలుసా. ఆమె పేరు అను అగర్వాల్. బాలీవుడ్ ఇండస్ట్రీలో తోపు హీరోయిన్. ‘తిరుడ తిరుడ’ అనే సినిమాతో తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. 1969లో ఢిల్లీలో జన్మించిన అను అగర్వాల్‌కు తన కళాశాల రోజుల్లో మోడలింగ్‌పై ఆసక్తితో వీజేగా మారారు. 1990లో ‘ఆషిఖీ’ అనే హిందీ చిత్రంతో నటిగా బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఇందులో అను అగర్వాల్ యాక్టింగ్, గ్లామరస్ లుక్స్ చూసి అప్పట్లో యూత్ ఫిదా అయిపోయారు. దీంతో ఓవర్ నైట్ స్టార్ డమ్ సంపాదించుకుంది. ఈ చిత్రంలో వర్గీస్ అనే పాత్రలో నటించిన ఆమె.. ప్రేక్షకుల హృదయాల్లోనూ ఆ పాత్రతోనే స్థానం సొంతం చేసుకుంది.
ఆషిఖీ సినిమాతో ఇండస్ట్రీలో ఆమె పేరు మారుమోగింది. ఆ తర్వాత అను అగర్వాల్‌కు అవకాశాలు వెల్లువెత్తాయి. కానీ కాలం ఒక్క రోజులోనే అను అగర్వాల్ భవిష్యత్తును పూర్తిగా నాశనం చేసింది. 1999లో అను అగర్వాల్ కారు ప్రమాదానికి గురయ్యారు. ఆ ఘటనతో ఆమె దాదాపు 29 రోజుల పాటు కోమాలో ఉండిపోయారు. కోమా నుంచి బయటకు వచ్చిన తర్వాత అను పూర్తిగా తన జీవితాన్ని మర్చిపోయింది. తాను ఒక హీరోయిన్ అనే విషయాన్ని మర్చిపోయింది. అలాగే ఆ ప్రమాదంలో ఆమె ముఖం పూర్తిగా మారిపోయి దారుణంగా కనిపించింది. ఆమె తన జ్ఞాపకశక్తిని కోల్పోయింది. ఆమె శరీరంలో సగం భాగం పక్షవాతానికి గురైంది.
ఆ తర్వాత చికిత్స తీసుకుని నెమ్మదిగా కోలుకుంది. ప్రతి విషయాన్ని తెలుసుకుని, నేర్చుకునే చిన్న పిల్లలా మారిపోయింది. చాలా కాలం పాటు ఆమె బయటకు రాలేదు. కొన్నేళ్లు ఇంట్లోనే ఉండిపోయింది. ఆ తర్వాత తన మానసిక స్థితిని మెరుగుపర్చుకోవడానికి ధ్యానం, యోగ చేయడం ప్రారంభించారు. ప్రస్తుతం ఆమె సామాజిక సేవలో ఉన్నారు.