
సాధారణంగా హీరోల అభిమానుల మధ్య గొడవలు జరుగుతుంటాయి. సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటారు. అయితే ఎవరికైనా కష్టమొస్తే తామంతా ఒక్కటేనని నిరూపించారు పల్నాడు జిల్లాకు చెందిన ఎన్టీఆర్ ఫ్యాన్స్. వివరాల్లోకి వెళితే.. కోలీవుడ్ సూపర్ స్టార్ సూర్య పుట్టిన రోజు (జులై 23) సందర్భంగా పల్నాడు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. నర్సరావుపేట మోపువారిపాలెంకి చెందిన పోలూరు సాయి, నక్కా వెంకటేష్ సూర్య ఫ్లెక్సీలు కడుతుండగా ప్రమాదవశాత్తూ కరెంట్ షాక్ కొట్టడంతో మరణించారు. మరో అభిమానికి తీవ్ర గాయాలయ్యాయి. ఇక్కడే తమ గొప్ప మనసును చాటుకున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఈ విషాదం గురించి సూర్యకు తెలిసేలా చేశారు. తద్వారా అభిమానుల కుటుంబానికి ధైర్యం చెప్పించారు. దీని తర్వాత సూర్య స్వయంగా చనిపోయిన అభిమానుల కుటుంబ సభ్యులతో వీడియో కాల్లో మాట్లాడారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ విషయాన్ని చనిపోయిన అభిమాని స్నేహితుడు ఒకరు సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
‘ సూర్య వీడియోకాల్ మాట్లాడుతున్న వీడియోలను ట్విట్టర్లో షేర్ చేసిన ఆ అభిమాని ‘ స్పందించినందుకు థాంక్యూ సూర్య అన్నా. అలాగే నెల్లూరు ఎన్టీఆర్ ఫ్యాన్స్ క్లబ్ కి ప్రత్యేక ధన్యవాదాలు. జీవితం మొత్తం మీకు రుణపడి ఉంటాం బ్రో. నా ఫ్రెండ్ వాళ్ల కుటుంబ సభ్యులను సూర్య గారితో మాట్లాడించి చాలా మంచి పనిచేశారు. తద్వారా వారి కుటుంబానికి సపోర్టుగా నిలిచారు. చాలా థ్యాంక్యూ బ్రో’ అని ఎమోషనల్ అయ్యాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అభిమానులంటే ఇలాగే ఉండాలంటూ పలువురు నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..