
జబర్దస్త్ కామెడీ షో నటి శ్రీవిద్య తన జీవితంలోని అనేక ఆసక్తికర విషయాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. విజయవాడకు చెందిన శ్రీవిద్య తన నేపథ్యాన్ని వివరిస్తూ, పాలిటెక్నిక్ ఫైనల్ ఇయర్ వరకు చదువుకున్నానని, ఆ తర్వాత బీటెక్ జాయిన్ అయినప్పటికీ, ఆర్థిక పరిస్థితులు అలాగే చదువుపై ఆసక్తి లేకపోవడం వల్ల దాన్ని కొనసాగించలేకపోయానని తెలిపారు. “మిడిమిడి జ్ఞానంతో బయటికి వచ్చేశా” అని సరదాగా చెప్పుకొచ్చింది. శ్రీవిద్య తన ప్రయాణం గురించి మాట్లాడుతూ.. లోకల్ ఛానెళ్లలో పబ్లిక్ ఇంటర్వ్యూలు చేస్తూ ప్రజల దృష్టిని ఆకర్షించినట్లు తెలిపింది. ముఖ్యంగా “నా ఫోన్ కి బ్యాలెన్స్ వేపించండి అయ్యా” అనే తన డైలాగ్‌తో ఆమెకు అనూహ్యమైన గుర్తింపు లభించిందని. ఈ వైరల్ వీడియోల ద్వారానే జబర్దస్త్ టీమ్ ఆమెను గుర్తించిందని, ఇమ్మాన్యుయేల్ అన్న ద్వారా తనకు జబర్దస్త్‌లో అవకాశం వచ్చిందని శ్రీవిద్య చెప్పుకొచ్చింది. ఈ ఫీల్డ్‌లోకి వస్తానని తాను ఎప్పుడూ అనుకోలేదని, మొబైల్ ఫోన్ కూడా 2022లో వచ్చిందని, రీల్స్ చేయడానికి కూడా ధైర్యం సరిపోలేదని ఆమె పేర్కొంది.
జబర్దస్త్‌లో తన ఏడాది కాలం ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ, తాను టీవీలో చూసిన ఫైమా, ఆది వంటి వారితో కలిసి పనిచేయడం అద్భుతమని, వాళ్లే ముందుగా పలకరించి మాట్లాడతారని తెలిపింది. తాను బయట చాలా సైలెంట్‌గా ఉంటానని, కానీ కెమెరా ముందు మాత్రం రెక్కలు వచ్చినట్లు చురుగ్గా ఉంటానని చెప్పుకొచ్చింది. తనకు యాటిట్యూడ్ లేదని, అది కేవలం భయం మాత్రమేనని తెలిపింది శ్రీవిద్య.. తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ, తన తండ్రి 2019లో చనిపోయారని, తన తల్లి ప్రైవేట్ స్కూల్ టీచర్‌గా పనిచేస్తున్నారని.. చదువులకంటే డబ్బు సంపాదించడమే ముఖ్యమని భావించి, కళాశాలను వదిలి పని చేయడం ప్రారంభించానని తెలిపింది. ఈ నిర్ణయం తనను ఈరోజు ఈ స్థానానికి తీసుకొచ్చిందని నమ్మకంగా చెప్పుకొచ్చింది. తన లుక్స్ గురించి వచ్చే విమర్శలను పట్టించుకోనని, పనికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని శ్రీవిద్య స్పష్టం చేసింది. జబర్దస్త్ సెట్లో కూడా తను మేకప్ వేసుకోనని, సహజంగా ఉండడానికే ఇష్టపడతానని ఆమె పేర్కొంది .
ఒక సినిమా ఆఫర్ వచ్చి చేజారిపోయిన అనుభవాన్ని కూడా శ్రీవిద్య పంచుకుంది. పది రోజుల పాటు సన్నాహాలు చేసిన తర్వాత, షూటింగ్ రోజున వేరొకరిని పెట్టుకున్నారని తెలిసి ఎంతో బాధపడ్డానని తెలిపింది. తన పరువు పోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. భవిష్యత్తులో బాలీవుడ్, హాలీవుడ్లలోకి వెళ్లాలనే ఆశ లేదని, ప్రస్తుతానికి టాలీవుడ్లోనే మంచి జీవితం ఉంటే చాలని సరదాగా చెప్పుకొచ్చింది. శ్రీవిద్య ఇటీవలే లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సిరీస్ లో నటించిన విషయం తెలిసిందే..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి