మహేష్ బాబు ఇచ్చిన వాయిస్ ఓవర్ వెలకట్టలేనిది.. ఈ సినిమాతో నా కల నెరవేరింది : సత్యదేవ్

'రావు బహదూర్' తో నా కల నెరవేరింది. మహేష్ బాబు గారి వాయిస్ ఓవర్ వెలకట్టలేనిది. ఇది మునుపెన్నడూ చూడని సినిమా. ప్రేక్షకులు నన్ను 'రావు బహదూర్'కి ముందు, రావు బహదూర్‌కి తర్వాత అన్నట్టుగా చూస్తారని నమ్ముతున్నానని హీరో సత్యదేవ్ అన్నారు.

మహేష్ బాబు ఇచ్చిన వాయిస్ ఓవర్ వెలకట్టలేనిది.. ఈ సినిమాతో నా కల నెరవేరింది : సత్యదేవ్
Satya Dev

Updated on: Jul 05, 2026 | 1:05 PM

సూపర్‌స్టార్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్‌ జిఎంబి ఎంటర్‌టైన్‌మెంట్, ప్రముఖ దర్శకుడు వెంకటేష్ మహా దర్శకత్వంలో, వెర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ కథానాయకుడిగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ సైకాలజికల్ థ్రిల్లర్ ‘రావు బహదూర్’ చిత్రాన్ని సగర్వంగా సమర్పిస్తున్నారు. వెంకటేష్ మహా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏ+ఎస్ మూవీస్, శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి, అనురాగ్ రెడ్డి & శరత్ చంద్ర నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్, పాటలు, టీజర్లు సినిమాపై అంచనాలు పెంచాయి. ‘రావు బహదూర్’ చిత్రం జూలై 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో సత్యదేవ్ విలేకరలు సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

సినిమా చూసిన తర్వాత చాలా నమ్మకం వచ్చింది. మేము సినిమా మొదలుపెట్టినప్పుడు “మునుపెన్నడూ చూడని విధంగా తెలుగు సినిమా” అనే ట్యాగ్‌లైన్‌ను అనుకున్నాము. మహేష్ బాబు గారు ఈ సినిమా చూసిన తర్వాత కూడా అదే ట్యాగ్‌లైన్ చెప్పారు. ఇప్పటివరకు సినిమా చూసిన ఫిలిం మేకర్స్ కూడా “మునుపెన్నడూ చూడని తెలుగు సినిమా” అని చెబుతున్నారు. ఇదంతా మాకు సినిమా చూసిన తర్వాత వచ్చిన నమ్మకమే. ఇది కంప్లీట్ సైకాలజికల్ డ్రామా. మ్యాజికల్ రియలిజం, డార్క్ కామెడీ సబ్‌జానర్స్‌గా ఉంటాయి. ఏదైనా మెటాఫర్‌ను విజువల్‌గా చేసి చూపించడం మ్యాజికల్ రియలిజం. కాకపోతే, కొన్నిసార్లు ఇది హారర్‌లా అనిపించవచ్చు. టీజర్‌లో మీరు వేర్లు వెంటాడుతున్న విజువల్ ఒకటి చూసి ఉంటారు. మీరు థియేటర్‌లో చూస్తున్నప్పుడు అది ప్రేక్షకులకు చాలా క్లియర్‌గా అర్థమవుతుంది.

ఈ కథ అనుకున్నప్పుడే మీ క్యారెక్టర్ మేకప్ ఇంత ఛాలెంజింగ్‌గా ఉంటుందని అనుకున్నారా అన్న ప్రశ్నకు జవాబిస్తూ.. మనం మామూలుగా చేసే సినిమాల కంటే 300 శాతం ఎక్కువగా ఈ సినిమాకు కష్టపడాలని తెలుసు. అలాగే ఇది హెవీ మేకప్ సినిమా అని కూడా తెలుసు. కమల్ హాసన్ గారు, సూర్య గారు, విక్రమ్ గారు ఇలాంటి హెవీ మేకప్ సినిమాలు ప్రయత్నిస్తుంటారు. అది చూస్తున్నప్పుడు నేను కూడా ఎప్పుడైనా అలాంటి సినిమా చేయాలని అనుకునేవాడిని. నేను యాక్టర్ అయినప్పటి నుంచి అది నా డ్రీమ్. ఆ అవకాశం ‘రావు బహదూర్’తో వచ్చింది. మనం కోరుకున్నది మనకు వచ్చినప్పుడు కచ్చితంగా ఆనందంగా ఉంటుంది. ఇలాంటి సినిమాకు మేకప్ కంటే మైండ్ మేకప్ చాలా ఇంపార్టెంట్. ఈ సినిమాకు అలాంటి మైండ్ మేకప్ చాలా చేశాను. ప్రతిరోజూ వెళ్లి 16 గంటలు పని చేయాలని ముందే నిర్ణయించుకునేవాడిని. అలా ప్రతిరోజూ హ్యాపీగా వెళ్లి ఎంజాయ్ చేస్తూ చేశాను.

ఇవి కూడా చదవండి

ఇందులో నా క్యారెక్టర్‌కు మేకప్ వేయడానికి ఐదు గంటలు పట్టేది, తీయడానికి గంటన్నర పట్టేది. ఇలాంటి పాత్రలు చేయడానికి చాలా సహనం కావాలి. ఈ సినిమా చేసిన తర్వాత నాకు కూడా చాలా సహనం ఉందని అర్థమైంది. నా కెరీర్‌లో మోస్ట్ ఛాలెంజింగ్ క్యారెక్టర్ ఇదే.. మొన్నటి వరకు నా కెరీర్‌లో ‘జ్యోతిలక్ష్మి’కి ముందు, తర్వాత అని చూసుకునేవాడిని. ఇప్పుడు ‘రావు బహదూర్’కి ముందు, రావు బహదూర్‌కి తర్వాత అన్నట్టుగా చూస్తారని నమ్ముతున్నాను. నిజానికి రావు బహదూర్‌లో రామప్ప క్యారెక్టర్‌కు ఎలాంటి రిఫరెన్స్ లేదు. ఈ సినిమా చేస్తున్నప్పుడు రామప్ప క్యారెక్టర్ నన్ను ఆవహించాడేమో అన్నట్టుగా అనిపించింది. అంతలా ఆ పాత్రలో లీనమైపోయాను. నాని గారు నాతో మాట్లాడుతూ, “ప్రతి ఒక్కరూ డ్యూటీ చేస్తే సినిమా ‘రావు బహదూర్’లా ఉంటుంది” అని అన్నారు. అలాగే మహేష్ బాబు గారు, నమ్రత గారు కలిసి ఈ సినిమా చూశారు. దాదాపు 40 నిమిషాల పాటు ఈ సినిమా గురించి మాట్లాడారు. ఆయన టీజర్‌కు వాయిస్ ఓవర్ ఇచ్చారు. అలాగే సుకుమార్ గారు కూడా చూశారు. ఆయన కూడా మంచి రివ్యూ ఇచ్చారు. అందరూ కూడా “మునుపెన్నడూ చూడని తెలుగు సినిమా” అని చెప్పారు. ఎందుకు అలా చెప్పారో మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది. మహేష్ బాబు గారితో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా చేశాను. కాకపోతే అందులో నా సీన్ కట్ అయింది. అలాంటి మహేష్ బాబు గారు నా సినిమాకు వాయిస్ ఓవర్ ఇస్తూ “సత్యదేవ్ ఇన్…” అని చెప్పగానే చాలా ఆనందంగా అనిపించింది. మహేష్ బాబు గారు ఇచ్చిన వాయిస్ ఓవర్ వెలకట్టలేనిది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us