
ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు హవా నడుస్తుంది. చిన్న పెద్ద అని తేడా లేకుండా అన్ని సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో విడుదలై ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడే కాదు ఎప్పుడో పాన్ ఇండియా సినిమాల సందడి మొదలైంది. 1970లోనే ఓ సినిమా ఏకంగా 50 దేశాల్లో విడుదలై సంచలనం సృష్టించింది. ఆ సినిమా ఎదో తెలుసా.? అది సూపర్ స్టార్ కృష్ణ నటించిన సినిమా. 1971లో విడుదలైన మోసగాళ్లకు మోసగాడు తెలుగు సినిమా చరిత్రలో ఒక సువర్ణాధ్యాయంగా నిలిచిపోయింది. సూపర్‌స్టార్ కృష్ణ హీరోగా నటించిన ఈ చిత్రం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తొలి కౌబాయ్ చిత్రంగానే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా 50 దేశాలలో విడుదలైన తొలి పాన్ వరల్డ్ తెలుగు చిత్రంగానూ రికార్డు సృష్టించింది. ఈ రికార్డును ఇప్పటివరకు ఏ సినిమా కూడా బీట్ చేయలేకపోయింది. సూపర్‌స్టార్ కృష్ణ ప్రయోగాలకు పెట్టింది పేరు. తెలుగు సినిమాకు అనేక నూతన టెక్నాలజీలను, జానర్‌లను పరిచయం చేశారు. తొలి కౌబాయ్ సినిమా, తొలి జేమ్స్ బాండ్ సినిమాలను చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది.
అప్పట్లో మద్రాసులో విపరీతంగా ఆడే కొన్ని ఇంగ్లీష్ చిత్రాల నుండి స్ఫూర్తి పొంది, అలాంటి సినిమాలు తెలుగులో ఎందుకు చేయకూడదని కృష్ణ ఆలోచించారు. తక్షణమే రచయిత ఆరుద్రను పిలిపించి, ద గుడ్, ద బ్యాడ్ అండ్ అగ్లీ వంటి హాలీవుడ్ మూవీ స్ఫూర్తితో తెలుగు నేటివిటీకి తగిన కథను రాయమని కోరారు. ఆరుద్ర అద్భుతమైన కథను అందించగా, కృష్ణ తన సొంత బ్యానర్ పద్మాలయ స్టూడియోస్‌పై ఈ సినిమాను నిర్మించారు. అప్పట్లోనే కనీవినీ ఎరుగని రీతిలో 8 లక్షల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. కె.ఎస్.ఆర్. దాస్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా రాజస్థాన్ ఎడారి నేపథ్యంలో జరిగింది. బొబ్బిలి యుద్ధం తర్వాత బ్రిటిష్ వారికి దక్కకుండా జమీందార్లు దాచిన నిధిని కాపాడుకోవడమే ప్రధాన కథాంశం. ఈ రహస్యం తెలిసిన కొత్వాల్ (గుమ్మడి)ను విలన్లు చిత్రహింసలు పెట్టి చంపేయగా, అతని కొడుకు కృష్ణప్రసాద్ (కృష్ణ) తన తండ్రిని చంపిన వారిపై పగ తీర్చుకోవడానికి, నిధిని సాధించడానికి బయలుదేరుతాడు. దారిలో దొంగ నక్కజిత్తుల నాగన్న (నాగభూషణం), రాధ (విజయనిర్మల) అతనికి తోడుగా నిలుస్తారు. విలన్లను వేటాడుతూ, నిధిని సాధించే క్రమంలో ఎదురయ్యే సవాళ్లతో కథ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది.
ఈ చిత్రంలో కృష్ణ గెటప్, మేకప్, సినిమా అట్మాస్ఫియర్ తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించాయి. విజువల్ ట్రీట్‌గా నిలిచిన ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు, గుర్రపుస్వారీలు ప్రేక్షకులను అబ్బురపరిచాయి. కెమెరామెన్ వి.ఎస్.ఆర్. స్వామి అందించిన విజువల్స్ అద్భుతం. అప్పలాచార్య, ఆరుద్ర అందించిన సాహిత్యానికి ఆదినారాయణరావు సంగీతం తోడై పాటలు తిరుగులేని విజయం సాధించాయి. కోరినది నెరవేరినది, ఎలా ఉంది ఎలా ఉంది అబ్బాయా, కత్తిలాంటి పిల్ల వంటి పాటలు ప్రేక్షకాదరణ పొందాయి. కృష్ణ, విజయనిర్మలలతో పాటు నాగభూషణం, కైకాల సత్యనారాయణ, రావు గోపాలరావు, ప్రభాకర్ రెడ్డి వంటి సీనియర్ నటులు తమ పాత్రలలో జీవించారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా అద్భుత విజయాన్ని సాధించింది. 8 లక్షల బడ్జెట్‌తో నిర్మితమై ఏకంగా 50 లక్షల గ్రాస్‌ను వసూలు చేసింది. ఎన్.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావు తర్వాత 50 లక్షల గ్రాస్ కలెక్షన్లు సాధించిన మూడో హీరోగా కృష్ణ నిలిచారు. ఈ విజయం తర్వాత మోసగాళ్లకు మోసగాడు హిందీలో ఖజానా పేరుతో, తమిళంలో మోసక్కారనుక్కు మోసక్కారన్ పేరుతో డబ్ అయి అక్కడ కూడా అనూహ్య స్పందన పొందింది. ఆ తర్వాత కృష్ణ మరో సాహసం చేసి, పాటలు తొలగించి ది ట్రెజర్ పేరుతో ఇంగ్లీష్ లోకి డబ్ చేసి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. అలా తెలుగు నుంచి ఇంగ్లీష్ లోకి డబ్ అయిన తొలి తెలుగు చిత్రంగా, 50 దేశాల్లో విడుదలైన తొలి పాన్ వరల్డ్ తెలుగు చిత్రంగా మోసగాళ్లకు మోసగాడు చరిత్ర సృష్టించింది. ఈ సినిమా దెబ్బకు టాలీవుడ్‌లో కౌబాయ్ ట్రెండ్ మొదలైంది, కృష్ణ “తెలుగు వారి కౌబాయ్ హీరో”గా చరిత్రలో నిలిచిపోయారు.
ఇది కూడా చదవండి :
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.