టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న హీరోయిన్లలో ఆమె ఒకరు. తెలుగులో నటించింది తక్కువ సినిమాలే అయినా.. అడియన్స్ హృదయాల్లో చెరగని స్థానం సొంతం చేసుకుంది. మెగాస్టార్ చిరంజీవి సరసన ఓ సూపర్ హిట్ చిత్రంలో నటించి మెప్పించింది. ఈ సినిమాతోనే తెలుగులో ఆమెకు ఓ రేంజ్ క్రేజ్ వచ్చేసింది. ఆ తర్వాత మరిన్ని చిత్రాల్లో నటిస్తుందని అంతా అనుకున్నారు. కానీ అనుహ్యంగా తెలుగు సినీ పరిశ్రమకు దూరమయ్యింది. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా..? తనే అలనాటి హీరోయిన్ మీనాక్షి శేషాద్రి. 1980లో హీరో, మేరీ జంగ్, దామిని వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి జోడిగా అపద్బాంధవుడు సినిమాలో నటించింది. ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. ఈ మూవీతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది మీనాక్షి శేషాద్రి.
అపద్భాంధవుడు సినిమాకుగానూ ఉత్తమ నటిగా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకుంది. అంతకు ముందు తెలుగులో జీవన పోరాటం సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపించింది. ఆ తర్వాత బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రంలో నటించింది. తెలుగులో కొన్ని సినిమాలు చేసిన మీనాక్షి శేషాద్రి.. ఆ తర్వాత హిందీలో పలు సినిమాలు చేసింది. అందం, అభినయంతో మెప్పించినా.. అనుకున్నంత అవకాశాలు మాత్రం రాలేదు. దీంతో సినిమాలకు గుడ్ బై చెప్పేసింది.
1995లో మీనాక్షి శేషాద్రి..మైసూర్ కు చెందిన హరీష్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీరికి ఒక కూతురు, కుమారుడు సంతానం ఉన్నారు. పెళ్లి తర్వాత భర్తతో కలిసి అమెరికాలో సెటిల్ అయ్యింది. కథానాయికగా వెండితెరపై అలరించిన మీనాక్షి శేషాద్రి.. ఇప్పుడు అమెరికాలో ఓ డ్యాన్స్ స్కూల్ స్టార్ట్ చేసి భారతనాట్యం, కథక్, ఒడిస్సీ నృత్యాలను నేర్పించింది. ఇక ఇప్పుడిప్పుడే సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యింది. తాజాగా తన ఇంట్లో చేసిన బొమ్మల కొలువు సందర్భంగా స్వయంగా పాట పాడింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుండగా.. మీనాక్షి శేషాద్రి టాలెంట్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్స్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.