
తెలుగు సినిమాల్లో ఎన్నో అద్భుతమైన సినిమాలు ఉన్నాయి. కమర్షియల్ సినిమాలే కాదు భక్తి రస చిత్రాలు కూడా విడుదలై సెన్సేషనల్ హిట్స్ అయిన సినిమాలు చాలానే ఉన్నాయి. తెలుగు సినిమా అంటే అన్నమయ్య సినిమా గురించి చెప్పకుండా ఉండలేం.. 1997 మేలో విడుదలైన అన్నమయ్య చిత్రం తెలుగు సినిమా చరిత్రలో ఒక సువర్ణాధ్యాయంగా నిలిచిపోయింది. ప్రముఖ దర్శకుడు కే. రాఘవేంద్రరావు రూపొందించిన ఈ ఆధ్యాత్మిక చిత్రంలో కింగ్ నాగార్జున అన్నమయ్యగా, హీరో సుమన్ వెంకటేశ్వరస్వామిగా నటించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. అప్పట్లో నాగార్జున లవర్ బాయ్‌గా, యాక్షన్ హీరోగా మంచి మార్కెట్ ఉండేది. అలాంటి సమయంలో ఆయన అన్నమయ్య వంటి భక్తిరస చిత్రం చేయనున్నారని ప్రకటన రాగానే అభిమానులు, డిస్ట్రిబ్యూటర్లు ఆశ్చర్యపోయారు. అయితే, రాఘవేంద్రరావు పై ఉన్న నమ్మకంతో నాగార్జున విమర్శలను పట్టించుకోకుండా ఈ పాత్రను అంగీకరించారు. కట్ చేస్తే అన్నమయ్య సినిమా సంచలన విజయాన్ని అందుకుంది.
అయితే, అన్నమయ్య పాత్రకు నాగార్జున ఖరారు అయిన తర్వాత, వెంకటేశ్వరస్వామి పాత్రధారి ఎంపిక చిత్ర యూనిట్‌కు పెద్ద సవాలుగా మారింది. కొన్ని సన్నివేశాలలో భక్తులు వెంకటేశ్వరస్వామి పాదాలను తాకవలసి రావడంతో, ఆ పాత్రకు సరైన నటుడు ఎవరు అనేది కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో దర్శకుడు రాఘవేంద్రరావు మొదట సీనియర్ నటుడు శోభన్ బాబును సంప్రదించారట. అప్పట్లో సినిమాలు చేయకూడదని రిటైర్మెంట్ ప్రకటించిన శోభన్ బాబు, తనను వదిలేస్తారనే ఉద్దేశంతో ఏకంగా 50 లక్షల పారితోషికం డిమాండ్ చేశారట. ఆ రోజుల్లో ఇది చాలా పెద్ద మొత్తం కావడంతో, నిర్మాతలు ఆయనను పక్కన పెట్టారు.
తరువాత, ఈ పాత్ర కోసం బాలకృష్ణను కూడా పరిశీలించారట. బాలకృష్ణకు ఉన్న స్టార్‌డమ్ దృష్ట్యా, ఆయన అభిమానులకు, నాగార్జున అభిమానుల మధ్య ఏదైనా క్లాష్ వస్తుందేమోనని భయపడి, బాలకృష్ణను కూడా విరమించుకున్నారట. ఈ సంక్లిష్ట పరిస్థితిలో, సుమన్ పేరు తెరపైకి వచ్చింది. సుమన్‌ను వెంటనే పిలిపించి, మేకప్ టెస్ట్ చేసి, షూట్ చేశారు. ఆయన ఆ పాత్రకు కరెక్ట్‌గా సరిపోయారట. అక్కడి నుంచి సుమన్‌కు ఈ సినిమా ప్రయాణం ప్రారంభమైంది. శ్రీ వెంకటేశ్వరస్వామి పాత్రలో సుమన్ నటనకు విశేష ప్రశంసలు లభించాయి. అంతేకాదు, సుమన్ రాష్ట్రపతి భవన్‌లో అప్పటి రాష్ట్రపతితో కలిసి సినిమా చూసి, ఆయన పక్కనే కూర్చుని భోజనం చేయడం ఆయన జీవితంలో మర్చిపోలేని అద్భుతమైన అవకాశమని గతంలో తెలిపారు.
అన్నమయ్య చిత్రానికి జాతీయ స్థాయిలో రెండు అవార్డులు (నాగార్జున ఉత్తమ నటుడిగా, ఎం.ఎం. కీరవాణి ఉత్తమ సంగీత దర్శకుడిగా) లభించాయి. అలాగే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు, బెస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్, ఆర్ట్ డైరెక్టర్, క్యాస్టమ్స్ డిజైనర్, బెస్ట్ సినిమాటోగ్రాఫర్ సహా ఎనిమిది నంది అవార్డులను అందుకుంది అన్నమయ్య. సుమన్ పాత్రకు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం డబ్బింగ్ చెప్పారు. ఈ సినిమా పలు కేంద్రాలలో సిల్వర్ జూబిలీ జరుపుకుంది. నాగార్జున పుట్టినరోజున, ఆగస్టు 29న 100 రోజుల వేడుకను జరుపుకోవడం ఒక గొప్ప విశేషం. అన్నమయ్య నాగార్జున, సుమన్ కెరీర్‌లలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.