ఇదెక్కడి క్రేజ్ రా మావ.! ఫస్ట్ సినిమా రిలీజ్ కూడా కాలేదు.. అప్పుడు వరుస ఆఫర్లు
టాలీవుడ్‌లో మరో స్టార్ ఫ్యామిలీ వారసురాలు హీరోయిన్‌గా పరిచయం కాబోతున్నారు. ఇక ఇప్పుడు మరో స్టార్ హీరో కూతురు కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుంది. ఈ అమ్మడు నటిస్తున్న సినిమా ఇటీవలే పూజాకార్యక్రమాలు జరుపుకుంది. ఇదిలా ఉంటే అప్పుడే ఈ అమ్మడికి ఆఫర్స్ క్యూ కడుతున్నాయి.

టాలీవుడ్‌లో వారసుల ఎంట్రీ కొత్తేమీ కాదు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖుల వారసులు హీరోలు, హీరోయిన్లుగా ఇండస్ట్రీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అయితే కొందరికి తొలి సినిమా విడుదల కాకముందే మంచి అవకాశాలు తలుపు తడుతున్నాయి. ఇప్పుడు ఇదే జాబితాలోకి చేరుతున్నారు సీనియర్ నటుడు శ్రీకాంత్ కుమార్తె మేధా మేకా. దాదాపు మూడు దశాబ్దాల సినీ ప్రయాణంలో 100కు పైగా చిత్రాల్లో నటించిన శ్రీకాంత్.. హీరోగా ఎన్నో విజయాలను అందుకున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్‌లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఆయన, ప్రస్తుతం విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా విభిన్న పాత్రల్లో మెప్పిస్తున్నారు. మరోవైపు కొడుకు రోషన్ ఇప్పటికే హీరోగా ఎంట్రీ ఇచ్చి నటుడిగా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు కుమార్తె మేధా కూడా హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు.
టాలీవుడ్‌లో అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై మేధా తన తొలి సినిమాను చేస్తున్నారు. ఈ చిత్రంలో జై జాస్తి హీరోగా నటిస్తుండగా.. యూట్యూబ్‌లో మంచి విజయాన్ని అందుకున్న ’30 వెడ్స్ 21′ వెబ్ సిరీస్‌తో గుర్తింపు తెచ్చుకున్న పృథ్వీ వనం దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ సినిమాకు ప్రస్తుతం ‘#MythriInLove’ అనే వర్కింగ్ టైటిల్‌ను పెట్టారు. షూటింగ్ కూడా వేగంగా కొనసాగుతున్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే.. మేధాకు సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. సాధారణంగా తొలి సినిమా విడుదలై, అందులో నటనకు మంచి స్పందన వస్తేనే కొత్త అవకాశాలు వస్తుంటాయి. కానీ మేధా విషయంలో అలా కాదు. మొదటి సినిమా ఇంకా ప్రేక్షకుల ముందుకు రాకముందే మరో భారీ ప్రాజెక్ట్‌లో నటించే అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ఇప్పటికే సూపర్ హిట్‌గా నిలిచిన ఓ సినిమా సీక్వెల్‌లో హీరోయిన్‌గా మేధా మేకా పేరును చిత్రబృందం పరిశీలిస్తున్నట్లు టాక్. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. అలాగే బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ నటించే సినిమాలోనూ మేధ హీరోయిన్ గా నటించే అవకాశం ఉందని తెలుస్తుంది. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది. మరి శ్రీకాంత్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న మేధా.. తన నటనతోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంటారా? తొలి సినిమా తర్వాత ఎలాంటి విజయాలను అందుకుంటారో చూడాలి.

Medha Meka
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




